రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మాట మారుస్తున్నారని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అన్నారు.
కర్నూలు: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మాట మారుస్తున్నారని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అన్నారు. శుక్రవారం కర్నూలుకు వచ్చిన ఆయన పార్టీ సభ్యులు, సానుభూతిపరుల సమావేశంలో మాట్లాడారు. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఏపీకి ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటిస్తే.. తమ ప్రభుత్వం వస్తే పదేళ్ల పాటు ప్రత్యేక హోదా కల్పిస్తామని బీజేపీ నేత వెంకయ్య నాయుడు గతంలో పార్లమెంట్ సమావేశాల్లో చెప్పినట్టు గుర్తు చేశారు.
గుర్తు లేకపోతే పార్లమెంట్ రికార్డులు, వీడియోలను పరిశీలించి ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఒకవేళ మతిలేక మాట్లాడి ఉంటే ప్రజలకు క్షమాపణ చెప్పి తన పదవికి రాజీనామ చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో రైతులు, డ్వాక్రా మహిళలకు, చేనేతలకు ఇచ్చిన హామీలను విస్మరిస్తున్నారన్నారు. ఈ సమావేశంలో కేంద్ర కమిటీ సభ్యుడు ఎంఏ గఫూర్ పాల్గొన్నారు.