పాలకులు పంచుకోవడానికే ప్యాకేజీ | bv raghavulu takes on bjp and tdp leaders | Sakshi
Sakshi News home page

పాలకులు పంచుకోవడానికే ప్యాకేజీ

Published Mon, Sep 12 2016 3:22 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

bv raghavulu takes on bjp and tdp leaders

ప్రత్యేక హోదా, రైల్వే జోన్ ఆయువుపట్టు
పవన్ మాటల్లో కాదు.. చేతల్లో చూపాలి
సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు

విశాఖపట్నం:
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాకు బదులు ప్యాకేజీని టీడీపీ, బీజేపీ పాలకులు అంగీకరించడంపై సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు మండిపడ్డారు. ప్యాకేజీ సొమ్మును వారు పంచుకోవడానికే అని ఆయన ఆరోపించారు. బీజేపీ, టీడీపీ నేతలకు ప్రత్యేక హోదా ఇష్టం లేదన్నారు. అందుకే ప్రజల ఆకాంక్షను విస్మరించి ప్యాకేజీకి ఆమోదం తెలిపి నమ్మక ద్రోహం చేశారని విమర్శించారు.

ఆదివారం విశాఖపట్నంలో ఏయూ ప్లాటినం జూబ్లీ హాలులో ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక నిర్వహించిన సదస్సులో పాల్గొన్న బీవీ రాఘవులు మాట్లాడారు. ఇప్పుడు ప్యాకేజీ సరిపోతుందంటున్న వారు... విభజన సమయంలో పార్లమెంటులో ఐదేళ్లకు బదులు పదేళ్లు కావాలని ఎందుకు డిమాండ్ చేశారని ప్రశ్నించారు.

కేంద్రమంత్రి వర్గంలో కొనసాగుతూ హోదా సాధించడం టీడీపీకి సాధ్యం కాదన్నారు. ప్రత్యేక హోదా రాకపోతే టీడీపీ, బీజేపీలకు రాష్ట్రంలో నూకలుండవని ఎద్దేవా చేశారు. సదరు రెండు రాజకీయంగా ఘోరీ కట్టుకోవలసిందేనని జోస్యం చెప్పారు. రాష్ట్రం విడిపోయాక రైల్వేజోన్ ఇస్తామన్నారని... కానీ ఇప్పటికీ ఈ అంశంపై  ప్రకటన చేయకపోవడం ద్రోహమేనన్నారు.

మాటలు కాదు.. చేతల్లో చూపాలి
ప్రత్యేక హోదా గురించి మాటలతో సరిపెట్టకుండా చేతల్లో చేసి చూపించాలని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్కు బీవీ రాఘవులు సూచించారు. చెగువేరా గురించి పవన్ కల్యాణ్ తరచూ ప్రస్తావిస్తాడు... ప్రశంసిస్తాడు ఆయన గుర్తు చేశారు. అయితే చెగువేరా మాటలు చెప్పలేదు.. తుపాకీతో సాయుధ పోరాటం చేశాడని చెప్పారు. చెగువేరాలా పవన్‌ను తుపాకీ పట్టుకోమని చెప్పం.. కానీ రాజ్యాంగ పరిధికి లోబడి ప్రజల పక్షాన ఆందోళనలు చేయాలని కోరారు.  

అమరావతి చుట్టూనే అభివృద్ధి
రాష్ట్రవిభజన జరిగాక సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని పట్టించుకోకుండా అమరావతి చుట్టూనే అభివృద్ధిని కేంద్రీకరిస్తున్నారని రాఘవులు విమర్శించారు. ఇదే అంశం గతంలోనూ రాష్ట్ర విభజనకు దారితీసిన విషయాన్ని విస్మరిస్తూ మళ్లీ అదే తప్పునే చేస్తున్నారన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమను నిర్లక్ష్యం చేస్తే మళ్లీ అలాంటి ఉద్యమమే పునరావృతమవుతుందని టీడీపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాయలసీమ వెనకబాటుకు కారణం ఉందని, కానీ ప్రకృతి వనరులున్నా ఉత్తరాంధ్ర వెన కబడి ఉండటానికి పాలకుల నిర్లక్ష్యమే కారణమని బీవీ రాఘవులు ఆరోపించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement