క్రీడాపాలసీకి మంత్రివర్గ ఉపసంఘం
‘వ్యాయామ విద్య అక్షరాస్యత- క్రీడలు’ వర్క్‌షాపు ముగింపులో ముఖ్యమంత్రి చంద్రబాబు
విజయవాడ స్పోర్ట్స్: రాష్ట్రంలో విద్యార్థులు మొదలు పెద్దవారి వరకు అంతా వ్యాయామ విద్యలో సంపూర్ణ అక్షరాస్యత సాధించేందుకు ఐదుగురు మంత్రులతో కేబినెట్ సబ్‌కమిటీ వేస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్ర క్రీడాశాఖ, శాప్ సంయుక్త ఆధ్వర్యంలో ‘వ్యాయమ విద్య అక్షరాస్యత-క్రీడలు’ అంశం పై నాగార్జున వర్సిటీలో ఈ నెల 13నుంచి నిర్వహిస్తున్న వర్క్‌షాపు శనివారం ముగిసింది. చివరిరోజు విజయవాడ ఎ-కన్వెషన్ సెంటర్‌లో జరిగిన కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. వ్యాయామ అక్షరాస్యతను పూర్తిస్థాయిలో అమల్లోకితెచ్చేందుకు క్రీడా పాలసీని రూపొందిస్తున్నట్లు చెప్పారు.
వ్యాయామ విద్యకు కావాల్సిన మౌలిక వసతులు తదితర అంశాలపై ఏప్రిల్ నాటికి మంత్రివర్గ ఉపసంఘం నివేదిక ఇస్తుందన్నారు. మే ఆఖరుకు మౌలిక సదుపాయాలు ఏర్పాటు, జూన్ కల్లా స్పోర్ట్స్ క్యాలెండర్ ప్రకటిస్తామని తెలిపారు. కేబినెట్ సబ్‌కమిటీలో క్రీడాశాఖ, విద్య, ఆరోగ్య, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖ మంత్రులను నియమిస్తున్నట్లు ప్రకటించారు. హైస్కూల్ వరకు వ్యాయామ విద్య తప్పనిసరి చేస్తూ పాఠ్యాంశాన్ని ప్రవేశపెట్టనున్నట్లు చెప్పా రు. పరీక్షల్లో వ్యాయామ విద్యకు మార్కులు ఇచ్చి వెయిటేజీ లెక్కిస్తామన్నారు. సర్టిఫికెట్లలో ఫిజికల్ ఫిట్‌నెస్ కాలమ్ చేరుస్తామని ప్రకటించారు. ఆనందంగా ఉండే విషయంలో మన దేశం ప్రపంచంలో 117వ స్థానంలో ఉందని, 2029 నాటికి రాష్ట్రాన్ని హ్యాపీనెస్ ఇండెక్స్‌లో దేశంలోనే నెంబర్‌వన్ స్థానానికి చేర్చేలా చర్యలు తీసుకుంటామన్నారు.
ఆధునిక స్టేడియాలు..
అమరావతి, విశాఖ, తిరుపతి రీజియన్లుగా ఆధునిక వసతులున్న స్టేడియాలు నిర్మించనున్నట్లు సీఎం చెప్పారు. వ్యాయామ విద్య-క్రీడలు రెండు విభాగాలుగా చేస్తామన్నారు. ప్రతి పాఠశాలలో కావల్సిన పీఈటీలు, పీడీలు, వ్యాయామ విద్య బోధకులను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఆధార్ కార్డు లింకేజీతో విద్యార్థులు, క్రీడాకారుల ఫిట్‌నెస్, డేటాను నమోదు చేస్తామన్నారు. వర్క్‌షాపు నిర్వహించిన బ్యాడ్మింటన్ జాతీయ కోచ్ పుల్లెల గోపిచంద్‌ను సీఎం అభినందించారు.
స్వయం ఉపాధికి ‘పెట్టీ’ చేయూత: సీఎం
విశిష్ట ప్రతిభావంతులకు (వికలాంగులకు) స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడంలో సోలార్ మొబైల్ బడ్డీకొట్టు(పెట్టీ) వాహనాలు చేయూతగా నిలుస్తాయని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. స్థానిక ఏ1-కన్వెన్షన్ హాల్ ప్రాంగణంలో ఆర్‌స్ట్రీచ్ కంపెనీ ద్వారా భారతదేశంలో మొట్టమొదటిసారిగా వికలాంగుల కోసం రూపొందించిన సన్ని స్పెల్టర్-సోలార్ చార్జ్డ్ పెట్టీ షాపు వాహన పనితీరును శనివారం సీఎం పరిశీలించి ప్రారంభించారు. ముఖ్యమంత్రి వాహనాన్ని నడిపి దాని పనితీరుపై ప్రతినిధులను అభినందించారు. ఈ వాహనం గంటకు 12 కి.మీ. నడుస్తుంది. ఒక్కసారి చార్జ్‌డ్ అయ్యాక 70 కి.మీ. నడుస్తుంది. 200 కేజీల బరువును ఇది మోసుకుపోగలదు. చిరు వ్యాపారాలు పండ్లు, కూరగాయలు, బిస్కెట్లు, కూల్‌డ్రింక్స్ వంటి వాటిని దీని ద్వారా అమ్ముకోవచ్చని కంపెనీ ప్రతినిధి వైవీ రత్నకుమార్ సీఎంకు వివరించారు.