జెడ్పీసెంటర్, న్యూస్‌లైన్: రాయల తెలంగాణ అంటే టీఆర్‌ఎస్ మరో యుద్ధం చేస్తుందని ఆ పార్టీ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు హెచ్చరించారు. బంద్‌లో భాగంగా పొలిట్‌బ్యూరో సభ్యుడు సయ్యద్ ఇబ్రహీం ఆధ్వర్యంలో తెల్లవారు జామున 5 గంటలకే జిల్లాకేంద్రంలోని బస్టాండ్ ముందు బైఠాయించి, బస్సులను బయటికి రాకుండా ధర్నా చేశారు. ఆ తర్వాత పట్టణంలో నిర్వహించిన బైక్ ర్యాలీలో జూపల్లి పాల్గొన్నారు.
అనంతరం నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ సీడబ్ల్యూసీలో తీసుకున్న నిర్ణయాన్ని ఆ పార్టీయే విస్మరించడం విడ్డూరంగా ఉందన్నారు. సీమాంధ్రుల దోపిడీని శాశ్వతంగా కొనసాగించేందుకు రాయల ప్రతిపాదనను కాంగ్రెస్ చేస్తుందన్నారు. హైదరాబాద్‌లో అక్రమంగా సంపాదించిన ఆస్తులు, భూములను కాపాడుకోవడానికి సీమాంధ్రులు ఎంతకైనా తెగిస్తున్నారని, అందులో భాగమే రాయల తెలంగాణ అని అన్నారు. నీటి దోపిడీని సాగించేందుకు కేంద్రంపై సీమాంధ్రులు వత్తిళ్లు చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షకు భిన్నంగా కేంద్ర రాయల తెలంగాణ ప్రకటిస్తే టీఆర్‌ఎస్ మరో మహోద్యం చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు.
రాయల తెలంగాణతో కేంద్ర ముందుకు వస్తే టీ కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు తిప్పి కొట్టాలని, అందుకు బాధ్యత వహించాలన్నారు. దేశంలో ఏ రాష్ట్రానికి లేని ఆంక్షలు తెలంగాణకు మాత్రమే ఎందుకని ప్రశ్నించారు. ఎట్టి పరిస్థితుల్లో ఆంక్షలను తెలంగాణ ప్రజలు ఒప్పుకునే ప్రసక్తే లేదన్నారు. పొలిట్‌బ్యూరో సభ్యులు పి.చంద్రశేఖర్, సయ్యద్ ఇబ్రహీంలు మాట్లాడుతూ కృష్ణా, తుంగభద్ర నదుల్లో నీటి దోపిడీని చట్టబద్ధం చేసేందుకే రాయల తెలంగాణ అంటున్నారని ఆరోపించారు. రాయల తెలంగాణను వ్యతిరేకిస్తూ టీఆర్‌ఎస్ పార్టీ నిర్వహించిన బంద్ విజయవంతమైందని, బంద్‌కు సహకరించిన ప్రతి ఒక్కరికీ పార్టీ తరుఫున కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు బెక్కం జనార్దన్, మహబూబ్, గుండా మనోహర్, నాగరాజు, కృష్ణముదిరాజ్, మోసిన్‌ఖాన్, మిట్టేనర్సింహ్మ, గౌతంశ్రీను, కిరణ్ పాల్గొన్నారు.
‘రాయల’ తెలంగాణ అంటే యుద్ధమే
Published Fri, Dec 6 2013 2:47 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement