‘రాయల’తో ఫ్యాక్షన్ విజృంభిస్తుంది
Published Thu, Dec 5 2013 6:18 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
పటాన్‌చెరు, న్యూస్‌లైన్: ‘రాయల తెలంగాణ ఏర్పడితే ఫ్యాక్షన్ విజృంభిస్తుంది. హైదరాబాద్‌లో ఫ్యాక్షనిస్టులు పెరిగిపోయి ఫ్యాక్షన్‌కు వేదికవుతుంది. ఇప్పటికే చంచల్‌గూడ జైలు వారితోనే నిండిపోయింది. నాకు తెలిసి ఆ జైల్లో ఈ ప్రాంతం వారెవరూ లేరు’ అని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సీహెచ్ విద్యాసాగర్‌రావు అన్నారు. బుధవారం ఆయన పటాన్‌చెరులో సర్దార్ వల్లభాయ్ పటేల్ రాష్ట్రీయ ఏక్తా ట్రస్ట్ అధ్వర్యంలో జరిగిన మెదక్ జిల్లా వర్క్‌షాప్‌నకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ 2004 నుంచి తెలంగాణపై నాటకాలాడుతోందన్నారు. తాము హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ ఇవ్వాలని మాత్రమే డిమాండ్ చేస్తున్నామన్నారు. అయితే కాంగ్రెస్ మాత్రం రాయలసీమ ప్రాంతంలోని రెండు జిల్లాలను కలుపుకుని రాయల తెలంగాణ ఏర్పాటు చేస్తున్నామంటున్నారనీ, ఒకవేళ అదే జరిగితే తాము అధికారంలోకి రాగానే ఆ రెండు జిల్లాలను తొలగించి ‘తెలంగాణ’ రాష్ట్రం ఏర్పాటు చేస్తామన్నారు. అదే సమయంలో రాయలసీమ ఆత్మగౌరవం కోసం కూడా పరిష్కారం చూపుతామన్నారు.
రాయల తెలంగాణ అంటున్న కాంగ్రెస్‌ది కమ్యూనల్ ఎజెండాగా ఉందని ఆయన ఆరోపించారు. ఓటు బ్యాంకు కోసమే ఆ పార్టీ రాయల తెలంగాణ నాటకానికి తెరతీసిందన్నారు. మజ్లీస్‌ను దేశవ్యాప్త కార్యకర్తలుగా వాడుకునేందుకు ఓ వర్గం ఓట్ల కోసమే రాయల తెలంగాణ ఏర్పాటును యోచిస్తున్నారన్నారు. పది జిల్లాల తెలంగాణతో పాటు రాయలసీమలోని ఆ రెండు జిల్లాలను కలిపితే ముస్లిం ఓట్లు పెరుగుతాయనే ఉద్దేశ్యంతో ‘రాయల’ ప్రతిపాదన చేస్తున్నారన్నారు. నెహ్రూ అనుసరించిన విధానాన్నే ఇప్పటికీ కాంగ్రెస్ అవలంభిస్తోందన్నారు. నిజాంతో ఆనాటి నెహ్రూ స్టాండ్‌స్టిల్ అగ్రిమెంట్(యథాతథ స్థితి) చేసుకున్నట్లే మజ్లిస్‌తో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కమ్యూనల్ ఎజెండాతో పోతుందని విద్యాసాగర్‌రావు వ్యాఖ్యానించారు. రాయల తెలంగాణ ఏర్పడితే ఆర్టీసీ మూతపడుతుందనీ, ఆ సమయంలో బస్సులు తిప్పి నాలుగు రాళ్లు వెనకేసుకోవచ్చనే ఆలోచనతోనే జేసీ దివాకర్‌రెడ్డిలాంటి వారు ఈ ప్రతిపాదనకు మద్దతు పలుకుతున్నారన్నారు.
Advertisement
Advertisement