అంతులేని దోపిడీ | CAG fires on Polavaram Project Works Irregularities | Sakshi
Sakshi News home page

అంతులేని దోపిడీ

Published Thu, Sep 20 2018 3:54 AM | Last Updated on Sat, Sep 22 2018 8:48 PM

CAG fires on Polavaram Project Works Irregularities - Sakshi

డిసెంబర్‌ 7, 2016న ‘పోలవరం.. కమీషన్ల పరం’ శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనం

సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనుల్లో జరుగుతున్న అక్రమాలను కాగ్‌ (కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌) నివేదికలో తీవ్రస్థాయిలో ఎండగట్టింది. హెడ్‌వర్క్స్‌ కాంట్రాక్టర్‌కు భారీ ప్రయోజనం కల్పించారని, పనుల్లో మాత్రం పురోగతి లేదని పేర్కొంది. బుధవారం శాసనసభలో ప్రవేశపెట్టిన నివేదికలో కాగ్‌ ప్రస్తావించిన అక్రమాలు ‘సాక్షి’ గత నాలుగేళ్లుగా ప్రచురించిన కథనాలకు అద్దం పట్టాయి.  సీఎస్‌ఎంఆర్‌ఎస్‌ (సెంట్రల్‌ సాయిల్‌ అండ్‌ మెటిరీయల్‌ రీసెర్చ్‌ స్టేషన్‌)తో ఒప్పందం చేసుకునే వరకూ అంటే 2017 జూలై వరకూ ప్రాజెక్టు పనుల నాణ్యత పరిశీలనకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయకపోవడంపై కాగ్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. భూసేకరణ, నిర్వాసితులకు సహాయ, పునరావాస ప్యాకేజీ అమలులో అవతవకలను కడిగేసింది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ)ని 2014 మే నెలలో ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం దీనితో ఒప్పందం చేసుకోవాలని పదేపదే కోరినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదని కాగ్‌ పేర్కొంది.

జరిమానాకు బదులు నజరానా
పోలవరం హెడ్‌వర్క్స్‌ పనులను దక్కించుకున్న టీడీపీ ఎంపీ రాయపాటికి చెందిన ట్రాన్స్‌ట్రాయ్‌(జేవీ) సంస్థకు వాటిని పూర్తి చేసే సామర్థ్యం లేదని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీలు తేల్చి చెప్పాయి. 2016 సెప్టెంబరు వరకూ హెడ్‌వర్క్స్‌లో ఎలాంటి పురోగతి లేదు. కాంట్రాక్టర్‌పై జరిమానా విధించి వసూలు చేయాల్సిన సర్కార్‌ అందుకు విరుద్ధంగా వ్యవహరించింది. ఒప్పందం గడువు ముగియడానికి రెండేళ్ల ముందే రాష్ట్రంలో ఏ ప్రాజెక్టులోనూ లేని తరహాలో 2016 సెప్టెంబరు 8న అంచనా వ్యయాన్ని రూ.1,331.91 కోట్లు పెంచేసి కాంట్రాక్టర్‌కు లబ్ధి చేకూర్చిందని కాగ్‌ తప్పుబట్టింది. ఈ నివేదికలో కాగ్‌ ప్రస్తావించిన ఇతర అంశాలు ఇవీ..

డంపింగ్‌ యార్డుకూ సర్కారు డబ్బులే..
‘అంచనా వ్యయాన్ని పెంచిన నేపథ్యంలో రూ.66.59 కోట్లను ఫెర్పార్మెన్స్‌ సెక్యూరిటీ కింద కాంట్రాక్టర్‌ నుంచి వసూలు చేయాల్సిన సర్కార్‌ మినహాయింపు ఇచ్చింది. నిబంధనల ఉల్లంఘించి రూ.25.37 కోట్ల విలువైన స్టీలును కొనుగోలు చేసి హెడ్‌వర్క్స్‌ కాంట్రాక్టర్‌కు సరఫరా చేసింది. యంత్రాల దిగుమతిపై సుంకాన్ని కాంట్రాక్టర్‌కు బదులుగా ప్రభుత్వమే రూ.5.72 కోట్లు చెల్లించింది. మట్టి నిల్వకు డంపింగ్‌ యార్డ్‌ భూమిని కాంట్రాక్టరే సేకరించాల్సి ఉండగా సర్కారే రూ.32.66 కోట్లను ఖర్చు చేసి 203.74 ఎకరాలను సేకరించింది. 

అడ్వాన్సులపై అడ్వాన్సులు..
కాంట్రాక్టర్‌కు మొదట రూ.404.86 కోట్లను మొబిలైజేషన్‌ అడ్వాన్సుగా ప్రభుత్వం ఇచ్చింది. 21వ బిల్లు నుంచి 11 శాతం వడ్డీతో మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌ వసూలు చేయాలి. అయితే దీన్ని వాయిదా వేస్తూ వచ్చింది. రూ.422.20 కోట్ల విలువైన డయాఫ్రమ్‌ వాల్‌ పనులను సబ్‌ కాంట్రాక్టర్‌కు అప్పగించిన సమయంలో నిబంధనలను ఉల్లంఘించి రూ.95 కోట్లను మళ్లీ మొబిలైజేషన్‌ అడ్వాన్సుగా ఇచ్చింది. 2017 జూన్‌ నాటికి 76 శాతం పని పూర్తి కావాల్సి ఉండగా కేవలం 31 శాతం పనులు మాత్రమే పురోగతిలో ఉంది.

కాలువల్లో అక్రమాల ప్రవాహం
పోలవరం కుడి, ఎడమ కాలువల పనుల్లో భారీ అక్రమాలు చోటుచేసుకున్నాయి. పీపీఏ అనుమతి తీసుకోకుండానే అంచనా వ్యయాన్ని రూ.8,021 కోట్లకు పెంచేస్తూ 2016 డిసెంబర్‌ 6న ఉత్తర్వులు జారీ అయ్యాయి. గడువులోగా పనులు చేయని కాంట్రాక్టర్లపై జరిమానా విధించాల్సింది పోయి అంచనా వ్యయాన్ని పెంచేసి అనుచిత లబ్ధి చేకూర్చారు. కాలువల పనుల్లో పైపు లైన్లు, విద్యుత్‌ స్తంభాల తరలింపు వ్యయాన్ని కాంట్రాక్టర్లకు బదులుగా సర్కారే భరించడం ద్వారా రూ.38.12 కోట్ల లబ్ధి కలిగించారు. 3.28 లక్షల ఎకరాలకు నీళ్లందించడానికి డిస్ట్రిబ్యూటరీల పనులు చేపట్టాల్సిన సర్కార్‌ మీనవేషాలు లెక్కిస్తోంది.

భూసేకరణ, పునరావాస ప్యాకేజీలో అక్రమాలు
కేంద్ర జలసంఘం మార్గదర్శకాల ప్రకారం రిమోట్‌ సెన్సింగ్‌ ఏజెన్సీ సహకారంతో డీపీఆర్‌ రూపొందించాల్సి ఉండగా పోలవరంలో జీఎస్‌ఐ చిత్రాల ఆధారంగా రూపొందించారు. తొలుత 54,448.69 ఎకరాలు ముంపునకు గురవుతాయని, 44,574 కుటుంబాలు నిర్వాసితులుగా మారుతున్నట్లు లెక్కగట్టారు. తాజాగా ముంపు భూమి 1,03,585.21 ఎకరాలకు, నిర్వాసితు కుటుంబాల సంఖ్య 1,05,601కి పెరగడం విస్మయం కలిగిస్తోంది. 2013 భూసేకరణ చట్టం ప్రకారం వివాదాల పరిష్కారానికి ప్రాధికార సంస్థను ఏర్పాటు చేసి రెండు నెలలకు ఒకసారి సమావేశం నిర్వహించాల్సి ఉండగా దీన్ని పట్టించుకోవడం లేదు. సహాయ, పునరావాస ప్యాకేజీ అమలుకు అంబుడ్స్‌మెన్‌ను నియమించకపోవడంతో భారీ అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. భూసేకరణ, సహాయ పునరావాస ప్యాకేజీ కింద వెచ్చించిన రూ.1,407.64 కోట్లకు సంబంధించిన వివరాలను రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు పీపీఏకి సమర్పించలేదు.’

- విభజన చట్టం హామీ మేరకు పోలవరాన్ని వేగంగా పూర్తి చేసేందుకు కేంద్రం ఏర్పాటు చేసిన పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ)తో రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ఒప్పందం చేసుకోకపోవడంలో ఆంతర్యం ఏమిటి?
పోలవరం హెడ్‌వర్క్స్‌ కోసం ఒప్పందం కుదుర్చుకున్న ట్రాన్స్‌ట్రాయ్‌–జేఎస్సీ–ఈసీ–యూఈఎస్‌(జేవీ) మూడేళ్ల దాకా పనులే ప్రారంభించలేదు. కాంట్రాక్టర్‌కు జరిమానా విధించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం గడువు ముగియక ముందే అంచనా వ్యయాన్ని రూ.1,331.91 కోట్లు పెంచేసింది. ఇది అనుచిత లబ్ధి కాదా?
భూసేకరణ, సహాయ పునరావాస ప్యాకేజీ పనుల్లో రూ.1,407.64 కోట్ల వ్యయానికి సంబంధించిన వివరాలను ప్రభుత్వం ఇప్పటివరకూ అందచేయలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement