కొత్తకోట(రావికమతం,) న్యూస్‌లైన్: జిల్లాలో గంజాయిపై గురువారం పోలీసులు ఉక్కుపాదం మోపారు. వేర్వేరుచోట్ల దాడులు, తనిఖీల్లో 350 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 9మందిని అరెస్టు చేశారు. కోత్తకోటలో అక్రమంగా తరలిస్తున్న రూ.6లక్షల విలువైన 60 కిలోల గంజాయిని రాత్రి గస్తీలో భాగంగా పోలీసులు గురువారం తెల్లవారుజామున పట్టుకున్నారు.
ఆటోలో ముగ్గురు వ్యక్తులు గంజాయితో వస్తుండగా అనుమానంతో పోలీసులు తనిఖీలు చేశారు. అందు లో ఇద్దరు పారిపోయారు. ఆ ఆటోలో ఉన్న చెట్టుపల్లి గ్రామానికి చెందిన రాయికోటేశ్వరరావును పట్టుకున్నారు. గంజాయిని స్వాధీనం చేసుకున్నామని సీఐ తిరుమలరావు తెలిపారు. తనిఖీల్లో కొత్తకోట, రావికమతం ఎస్‌ఐలు అశోక్‌కుమార్, విశ్వేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు.
ముగురు అరెస్టు
పాడేరురూరల్: ముందస్తు సమాచారం మేరకు మాటువేసి రూ.లక్ష విలువైన 30 కిలోల ఎండు గంజాయిని పట్టుకున్నట్టు ప్రొహిబిషన్ ఆండ్ ఎక్సైజ్ సీఐ శ్రీనివాసరావు తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తమకు అందిన సమాచారం మేరకు పెదబయలు నుంచి పాడేరు వైపు ఆటోలో గంజాయి తరలిస్తుండగా గంపరాయి గ్రామం వద్ద పట్టుకున్నామన్నారు. గంజాయి తరలిస్తున్న పెదబయలు మండలం బొండపల్లి గ్రామానికి చెందిన జంపరంగి శంకరరావు, పాడేరుకు చెందిన గొర్లె రాజేశ్వరరావు, విశాఖపట్నానికి చెందిన కసంగి సుఖ్‌దేవ్‌మన్‌బహుదుర్ అనే ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్టు వివరించారు. ఆటోను సీజ్ చేశామన్నారు. దాడుల్లో ప్రొహిబిషన్ ఆండ్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్(మొబైల్) ఎల్.ఉపేంద్ర, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
110 కిలోల గంజాయి స్వాధీనం
జి.మాడుగుల: ఎన్.కొత్తూరు నుంచి గంజాయి తరలిస్తుండగా ముందస్తు సమాచారంతో దాడి చేసి పట్టుకున్నామని సీఐ కె.కృష్ణ తెలిపారు. 110 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఎన్.కొత్తూరు గ్రామానికి చెందిన దేవినాయుడు మరో ముగ్గురు వ్యక్తులతో కలిసి గంజాయి తరలిస్తుండగా మత్స్యపురం జంక్షన్ వద్ద మాటువేసి పట్టుకున్నామన్నారు. బీరం గ్రామానికి చెందిన కె.సింహాచలం, వి.కృష్ణ, మత్స్యపురం గ్రామానికి చెందిన ఎం.సింహాచలంను అరెస్టు చేసినట్టు వివరించారు. కార్యక్రమంలో ఎస్‌ఐ సన్యాసినాయుడు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
90 కిలోలు స్వాధీనం
నర్సీపట్నం రూరల్: అక్రమంగా తరలిస్తున్న సుమారు రూ.3లక్షల విలువ గల 90 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు ఎక్సైజ్ సీఐ ఖలీమ్ గురువారం విలేకరులకు తెలిపారు. కమాండర్ జీపులో గంజాయిని తరలిస్తుండగా ముందస్తు సమాచారం మేరకు గొలుగొండ మండలం పోలవరం గ్రామ సమీపంలో మాటు వేసి పట్టుకున్నామన్నారు. జి.మాడుగుల మండలానికి చెందిన ఎం.అప్పారావు, వై.నారాయణను అదుపులోకి తీసుకోగా బుచ్చింపేట మండలానికి చెందిన ఉరబాల రాజు పరారయ్యాడన్నారు. రాజు కోసం గాలిస్తున్నామని తెలిపారు.
సత్యవరంలో గంజాయి పట్టివేత
మాడుగుల: ముందస్తు సమాచారంతో విశాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ జైభీమ్, మాడుగుల ఎక్సైజ్ సీఐ ఇ.శ్రీనివాస్, సిబ్బంది కలిసి గురువారం గంజాయిపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రూ.లక్ష విలువైన 60 కిలోల సీలావతి రకానికి చెందిన గంజాయిని పట్టుకున్నామని సీఐ శ్రీనివాస్ తెలిపారు. అయితే నిందితుల ఆచూకీ తెలియకపోవడంతో దర్యాప్తు చేస్తున్నామని వివరించారు.
గంజాయిపై ఉక్కుపాదం
Published Fri, Sep 6 2013 3:13 AM | Last Updated on Wed, Sep 5 2018 1:38 PM
Advertisement
Advertisement