నాదెండ్ల/ విద్యానగర్ (గుంటూరు): రోడ్డు ప్రమాదంలో వైద్య విద్యార్థి మృతిచెందిన ఘటన గుంటూరు-నరసరావుపేట రాష్ట్రీయ రహదారిపై నాదెండ్ల మండలం గొరిజవోలు సమీపంలోని పౌల్ట్రీఫాం వద్ద శనివారం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు వైద్యవిద్యార్థులు తీవ్రంగా, నలుగురు స్వల్పంగా గాయపడ్డారు. పోలీసులు, మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు వైద్యకళాశాలలో ఎంబీబీఎస్ ఫైనలియర్ చదువుతున్న విద్యార్థులు కొంతమంది శనివారం ఫిరంగిపురం మండలం మేరిగపూడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యశిబిరం నిర్వహించారు.
రొంపిచర్ల మండలం బుచ్చిపాపన్నపాలేనికి చెందిన వి.అశోక్‌రెడ్డి(21)తోపాటు మరో ఆరుగురు విద్యార్థులు అఖిల్, రాజశేఖరరెడ్డి, గోపాలకృష్ణ, రఘురాం, సీహెచ్ ఆదిత్య, పవన్‌కుమార్‌లు మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో భోజనం చేసేందుకు కారులో నరసరావుపేటకు బయలుదేరారు. అదే సమయానికి వర్షం పడుతుండడంతో కారును నడుపుతున్న రఘురాంకు దారి సక్రమంగా కనిపించకపోవడంతోపాటు వేగంగా వెళుతూ ఎదురుగా వస్తున్న లారీని తప్పించేక్రమంలో కారు అదుపుతప్పి ఎదురుగా ఉన్న విద్యుత్‌స్తంభాన్ని ఢీకొని బోల్తాకొట్టింది. ఈ ఘటనలో కారులో ముందు కూర్చున్న అశోక్‌రెడ్డి, పవన్, అఖిల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన కొంతసేపటికే ప్రమాద స్థలంలోనే అశోక్‌రెడ్డి మృతిచెందగా తీవ్రగాయాలపాలైన పవన్, అఖిల్, మరో నలుగురిని 108లో నరసరావుపేట ప్రభుత్వాస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అశోక్‌రెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు సమగ్ర ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నాదెండ్ల ఎస్‌ఐ సుబ్బానాయుడు సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు.
కుప్పకూలిన అశోక్‌రెడ్డి తండ్రి..
రొంపిచర్ల మండలం బుచ్చిపాపన్నపాలెంలో వ్యవసాయం చేసుకునే వలిపెంట రామకోటిరెడ్డి ఇద్దరు కుమారులు. పెద్దకుమారుడు అశోక్‌రెడ్డి గుంటూరు వైద్యకళాశాలలో ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్నాడు.
చిన్న కుమారుడు రాజశేఖరరెడ్డి బీటెక్ చదువుతున్నాడు. మరో ఏడాదిలో పెద్దకొడుకు డాక్టరై చేతికి అందివస్తాడనుకుంటున్న తరుణంలో విధి వక్రీకరించి రోడ్డుప్రమాదంలో రూపంలో అశోక్‌రెడ్డి మృతి చెందాడన్న దుర్వార్త విని తండ్రి రామకోటిరెడ్డి కుప్పకూలిపోయాడు. బంధువులు, గ్రామస్తులు విషాదంలో మునిగిపోయారు. అప్పటివరకు తమ ముందే ఉషారుగా తిరిగిన అశోక్‌రెడ్డి ఆకస్మిక మృతితో స్నేహితులు, తోటి విద్యార్థులు జీర్ణించుకోలేకపోతున్నారు. జీజీహెచ్‌కు పెద్దసంఖ్యలో వైద్యవిద్యార్థులు తరలివచ్చారు.
కారు బోల్తా:వైద్య విద్యార్థి మృతి
Published Sun, Sep 7 2014 12:58 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM
Advertisement
Advertisement