‘దేశానికి గ్రామాలే పట్టుగొమ్మలు..
ప్రజాస్వామ్యానికి పంచాయతీలే మూల స్తంభాలు.. వాటిని పటిష్టం చేస్తాం.. 73, 74 రాజ్యాంగ సవరణల ప్రకారం అధిక నిధులిస్తాం. అధికారాలు కట్టబెడతాం!’- ఇదీ ఎన్నికలకు ముందు తెలుగుదేశం నేతల హామీ! తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత వారి తీరు మారిపోయింది. పంచాయతీలను పటిష్టం చేయాల్సింది పోయి మూలస్తంభాల్నే కదిపేస్తున్నారు. రాజ్యాంగ స్ఫూర్తికే తూట్లు పొడుస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జన్మభూమి కమిటీలతో సర్పంచ్‌లు ఉత్సవ విగ్రహాలుగా మారిపోయారు. ముఖ్యంగా వైఎస్సార్ సీపీ మద్దతుదారులు సర్పంచ్‌లుగా ఉన్నచోట కమిటీలు చెప్పిందే వేదం, చేసిందే చట్టంలా ఉంది.
సాక్షి ప్రతినిధి, కాకినాడ : జిల్లాలో మొత్తం 1,036 గ్రామ పంచాయతీల్లో చాలాచోట్ల వైఎస్సార్ కాంగ్రెస్ మద్దతు తెలిపిన అభ్యర్థులు విజయం సాధించారు. వారి హయాంలో అభివృద్ధి పనులు చేపడితే గ్రామాల్లో తమ పలుకుబడి ఎక్కడ తగ్గిపోతుందోనని తెలుగు తమ్ముళ్లకు ఆందోళన మొదలైంది. ఈ సమయంలో తమ్ముళ్ల అధికార దాహాన్ని తీర్చుతూనే మరోవైపు పంచాయతీల నిధులను గుప్పిట పట్టాలనే ఉద్దేశంతో ప్రభుత్వం జన్మభూమి
కమిటీలకు తెరలేపింది. రాజ్యాంగబద్ధతలేని ఇలాంటి కమిటీల కోసం రాజ్యాంగ స్ఫూర్తితో ఏర్పాటైన స్థానిక సంస్థలకు చేటుచేస్తోంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి పంచాయతీకి జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ కమిటీల సమక్షంలోనే పంచాయతీ సమావేశాలు, సంక్షేమ పథకాల అమలు, వాటికి అర్హుల జాబితా తయారీలో సలహాలు తీసుకోవాలని అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ కమిటీలకు అధ్యక్షుడు సర్పంచే అయినా మిగతా ఐదారుగురు సభ్యులు టీడీపీ వారే ఉండటం గమనార్హం.
అన్నింటా పచ్చపాతమే..
ఏటా అక్టోబర్ 2న గ్రామసభ నిర్వహించాలి. కానీ రెండేళ్ల నుంచి ఆర్నెల్లకోసారి నిర్వహించాలని ప్రభుత్వం మార్పులు చేసింది. సాధారణంగా సర్పంచ్ అధ్యక్షతన, పాలకవర్గం లేదా సర్పంచ్ లేనిచోట ప్రత్యేకాధికారి అధ్యక్షతన సమావేశం జరుగుతుంది. గ్రామంలో చేపట్టే వివిధ కార్యక్రమాలను కార్యవర్గం గ్రామస్తుల దృష్టికి తీసుకొస్తుంది. అది ఏ నిర్ణయమైనా గ్రామ కార్యవర్గానిదే పైచేయి. కానీ ఇప్పుడు గ్రామంలో రేషన్‌కార్డులు ఇవ్వాలన్నా, దీపం పథకం కింద వంటగ్యాస్, ఇళ్లస్థలాలు, పింఛన్లకు అర్హులను ఎంపిక చేయాలన్నా, పంపిణీ చేయాలన్నా జన్మభూమి కమిటీ సభ్యులదే నిర్ణయం. దీంతో తెలుగు తమ్ముళ్లు పచ్చ పార్టీకి ఓటు వేసినవారికే పథకాలు కట్టబెడుతున్నారు. అంతేకాదు ఇప్పటికే లబ్ధిపొందుతున్నా అధికారులకు చెప్పి జాబితా నుంచి తప్పిస్తున్నారు. ఇదేమి అన్యాయమని ఎవరైనా సర్పంచ్ ప్రశ్నిస్తే.. జిల్లా పంచాయతీ అధికారికి ఫిర్యాదు చేసి చెక్ పవర్‌ను రద్దు చేయించేస్తున్నారు. అలాగే ప్రతిపక్షం మద్దతున్న సర్పంచ్‌లను అధికార పార్టీలోకి బలవంతంగా రప్పించేందుకు ఇదే తంత్రాన్ని ప్రయోగిస్తున్నారు. జిల్లాలో పలుచోట్ల ఇదే పరిస్థితి.
గ్రామాల్లో అభివృద్ధి పనులకు కేంద్రం నుంచి 13వ, 14వ ఆర్థిక సంఘాల నిధులు వచ్చేవి. జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం ప్రారంభించిన తర్వాత 60 శాతం పనులు చేయిస్తే 40 శాతం మ్యాచింగ్ గ్రాంటు ఇస్తోంది. ఇలా గ్రామంలో ఒక్కో మనిషికి రూ.379 చొప్పున మంజూరవుతోంది. నేరుగా గ్రామాలకు వచ్చే ఈ నిధులను తన చేతుల్లోకి తీసుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో పాచిక వేసింది. కేంద్రం నుంచి వచ్చే నిధులు తనకిస్తే మ్యాచింగ్ గ్రాంట్‌కు తామే నిధులు కట్టి పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు ద్వారా గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేయిస్తామని చెబుతోంది. దీన్ని సర్పంచ్‌ల సమాఖ్య తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
నేడు చర్చావేదిక
రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఒంటెత్తు పోకడల కారణంగా స్థానిక స్వపరిపాలన సంస్థలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఆదివారం చర్చావేదిక ఏర్పాటు చేస్తున్నారు. కాకినాడ జేఎన్‌టీయూ ఆడిటోరియంలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. సర్పంచ్‌లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యు లు, ఇతర స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పాల్గొని విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కోరారు.
ఉత్సవ విగ్రహాలుగా సర్పంచ్‌లు
నిబంధనల ప్రకారం వ్యవహరించే పంచాయతీ కార్యదర్శులను వేరేచోటకు బదిలీ చేయించి, తమకు అనుకూలమైనవారికి తెచ్చుకోవడానికి తెలుగుతమ్ముళ్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కార్యదర్శులు స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యే చెప్పుచేతుల్లో ఉండాల్సిన పరిస్థితి. స్థానిక పరిపాలనను వికేంద్రీకరించాల్సిన ప్రభుత్వం.. అందుకు భిన్నంగా సర్పంచ్‌లను ఉత్సవ విగ్రహాలుగా మార్చేస్తోంది.
- అక్కిరెడ్డి మహేశ్, ఉప సర్పంచ్, దివాన్‌చెరువు
జన్మభూమి కమిటీలు అప్రజాస్వామికం
జన్మభూమి కమిటీలు స్థానిక స్వపరిపాలనకు చేటు తెస్తున్నారుు. ప్రజలు ఎన్నుకున్న పాలకవర్గం బదులు పెత్తనం పార్టీ పెత్తనాన్ని రుద్దడం అప్రజాస్వామికం. రాజ్యాంగ విరుద్ధం. జిల్లా పంచాయతీ అధికారి, డ్వామా పీడీ సమక్షంలో రెండు వారాల క్రితం నిర్వహించిన జిల్లాలోని సర్పంచ్‌ల సమావేశంలో జన్మభూమి కమిటీలను వ్యతిరేకిస్తూ తీర్మానం ఇచ్చాం.
- గండి నానిబాబు, సర్పంచ్, తోకాడ
‘స్థానిక’ పాలనకు సెగ!
Published Sun, Aug 23 2015 4:55 AM | Last Updated on Fri, May 25 2018 9:20 PM
Advertisement
Advertisement