- పేలిన తూటాపై అంతు చిక్కని పోలీస్ రహస్యం
- పేలింది జంపన్న వాగు వద్దనా..!చిలకలగుట్ట కాడనా...!
- హడావుడిగా బుల్లెట్ తీసుకున్న డీఎస్పీ
- ఎక్కడా చెప్పొద్దంటూ హెచ్చరికలు
హన్మకొండ, న్యూస్‌లైన్ : మేడారం జాతరలో పోలీసుల తుపాకీ పేలింది.. పోలీసుల అత్యుత్సాహం కారణంగా జంపన్నవాగు వద్ద ఓ డీఎస్పీ గన్‌మెన్ తుపాకీ మిస్ ఫైర్ అరుుననట్లు తెలుస్తోంది. ఈ ఘటన నుంచి తప్పించుకునేందుకు పోలీసులు నానాపాట్లు పడుతున్నారు. చిలుకలగుట్ట వద్ద పైకి పేల్చిన తూటా కిందకు వచ్చి తాకిందని కొందరు, జంపన్న వాగు వద్ద మిస్‌ఫైర్ అయిందని మరికొందరు చెబుతున్నారు. ప్రస్తుతం మేడారం మహాజాతరలో అధికార వర్గాల్లో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. మేడారం జాతరలో భాగంగా పోలీసుల తూటాకు గురువారం ములుగు మండలం అడవిమల్లంపల్లికి చెందిన ఆర్షం కొమురమ్మ(78) గాయపడింది. చీకటి పడుతున్న వేళ జంపన్నవాగు సమీపంలోని రెండు తాటిచెట్ల వద్ద వేసుకున్న గుడారం ఎదుట కొమురమ్మ సేద తీరుతుండగా తలకు బుల్లెట్ గాయమైంది. తలలోకి బుల్లెట్ కొంతమేర చొచ్చుకుపోయి చీల్చినట్లు తెలిసింది. ఆమెను మేడారం ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స కోసం తరలించారు. అరుుతే అప్పటికే కొమురమ్మ కుమారుడు బుల్లెట్‌ను తీసుకోవడంతో ఎవరో కచ్చితంగా చెప్పినట్లుగా పోలీసులు అక్కడకు చేరుకున్నారు.
ముందుగా బాధితురాలి కుమారుడిని పిలిచి ‘ఇది పోలీసుల బుల్లెట్... మీ దగ్గర ఉండొద్దు... మేడం వస్తున్నారు...’ అంటూ ఆ బుల్లెట్‌ను తీసుకునే ప్రయత్నం చేశారు. వారితో మాట్లాడుతుండగానే మహిళా డీఎస్పీ అక్కడకు చేరుకుని బుల్లెట్ తీసుకుని బాధితురాలిని తన వాహనంలోనే గద్దెల వద్ద ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు కొమురమ్మకు చికిత్సచేసి తలకు నాలుగు కుట్లు వేశారు. కొద్దిసేపు అక్కడే ఉంచుకుని తిరిగి పంపించారు.
గోప్యంగా ఘటన..
పోలీసులు ఈ ఘటనను అత్యంత గోప్యంగా దాచి పెడుతున్నారు. ఇప్పటి వరకూ పోలీసుల తుపాకీ ఎక్కడ పేలిందనే విషయాన్ని రహస్యంగా ఉంచారు. సమ్మక్క ఆగమనం సందర్భంగా జిల్లా రూరల్ ఎస్పీ కాళిదాసు ప్రభుత్వపరంగా గౌరవ వందనం చేసే సందర్భంలో ఏకే-47 నుంచి బయటకు వెళ్లిన తూటా తాకిందని కొందరు పోలీసులు చెబుతున్నారు. జంపన్నవాగు వద్ద డీఎస్పీ గన్‌మన్ తుపాకీ పేలిందని మరికొందరు పేర్కొంటున్నారు. సదరు డీఎస్పీ జంపన్నవాగు వద్దకు వస్తున్న క్రమంలో గన్‌మెన్‌లు అత్యుత్సాహం చూపించారని, తుపాకులను ఎక్కుపెట్టి భక్తులను బెదిరించారని తెలుస్తోంది.
దీంతో ఓ గన్‌మెన్ చేతిలోని తుపాకీ పేలడంతో రోడ్డు పక్కన గుడారంలో ఉన్న కొమురమ్మకు తూటా తగిలిందని ప్రచారం జరుగుతోంది. ఈ తూటా అంతే స్పీడ్‌తో తగిలితే... ప్రాణాలు పోయేవని అంటున్నారు. కొంతమంది పోలీసులు మాత్రం ఎస్పీ కాళిదాసు పేల్చిన తుపాకీ నుంచి తూటా కిందకు వచ్చి కొమురమ్మకు తాకిందని చెబుతున్నారు. కానీ.. చిలుకలగుట్టలో పేల్చిన తుపాకీ నుంచి తూటా కిందకు వచ్చి జంపన్నవాగు వద్ద గుడారం ముందున్న కొమురమ్మకు తాకిందంటే నమ్మశక్యంగా లేదు. అంతేగాక సమ్మక్కను తీసుకొచ్చిన నేపథ్యంలో ముందుగా సాయంత్రం 5.39 గంటలకు, రెండోసారి 5.42 గంటలకు, మూడోసారి 5.55 గంటలకు ఫైరింగ్ చేశారు.
కానీ కొమురమ్మకు చీకటిపడిన తర్వాత తూటా తగిలిం దని చెబుతున్నారు. దీంతో ఇక్కడ కూడా పోలీసులు చెబుతున్న వివరాలకు పొంతన కుదరడం లేదు. ఇదిలా ఉండగా ఈ విషయం ఎవరికీ చెప్పొద్దంటూ బాధితురాలి కుటుంబ సభ్యులను పోలీసులు హెచ్చరించినట్లు ప్రచారం జరుగుతోంది. అంతేగాక గద్దెల వద్ద ప్రభుత్వ వైద్యులకు కూడా ఇలాగే హెచ్చరికలు జారీచేయడంతో... వారు కూడా నోరు మెదపడం లేదు. గురువారం రాత్రి పోలీసు వాహనంలో ఓ ముసలావిడను తీసుకొచ్చారని, ఆమె తలకు బుల్లెట్ తగలడంతో గాయాలయ్యాయని, కుట్లు వేశామని కిందిస్థాయి వైద్య సిబ్బంది చెబుతున్నారు.