సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీకి చెందిన విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ వ్యవస్థాపక డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న వైజాగ్ డిఫెన్స్ అకాడమీ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. విద్యార్థి టీసీ ఇచ్చేందుకు సొమ్ములు డిమాండ్ చేయడంతోపాటు బెదిరింపులకు పాల్పడ్డారంటూ బాధితులు విశాఖ ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. వివరాల్లోకి వెళితే.. గుంటూరుకు చెందిన మారెడ్డి మణికంఠారెడ్డి విశాఖ నగరం 104 ఏరియాలో ప్రియదర్శిని జూనియర్ కాలేజీగా రిజిస్టరైన వైజాగ్ డిఫెన్స్ అకాడమీలో ఇంటర్మీడియెట్ ఫస్టియర్ చదివాడు. సబ్జెక్టులు చాలా మిగిలిపోవడంతోపాటు సరైన విద్యా ప్రమాణాలు లేవని, హాస్టల్ వసతి కూడా సరిగ్గా లేదని భావించిన మణికంఠ కుటుంబ సభ్యులు కాలేజీ నుంచి టీసీ తీసుకోవాలని భావించారు.
విశాఖ నగరం 104 ఏరియాలోని వైజాగ్ డిఫెన్స్ అకాడమీ
కళాశాల ప్రిన్సిపాల్ మంగళవాణిని సంప్రదించిన విద్యార్థి తల్లి మారెడ్డి ఆదిలక్ష్మి తన కుమారుడి టీసీ ఇవ్వాలని కోరారు. టీసీ ఇవ్వాలంటే రూ.30 వేలు చెల్లించాలని ప్రిన్సిపాల్ డిమాండ్ చేశారు. ఫస్టియర్ ఫీజు మొత్తం రూ.1.50 లక్షలు చెల్లించామని, టీసీ కోసం మళ్లీ రూ.30 వేలు అడగటం ఏమిటని ఆదిలక్ష్మి ప్రశ్నించారు. అంతమొత్తం చెల్లించలేమని స్పష్టం చేశారు. దీంతో కళాశాల సిబ్బంది ఒక్కసారిగా జులుం ప్రదర్శించారు. ‘డబ్బు కట్టకపోతే టీసీ ఇచ్చేది లేదు. బయటకు పొండి’ అంటూ బలవంతంగా గెంటివేశారు. ఇదేమిటని ఎదురు తిరిగిన వారిపై ‘ఇది ఎమ్మెల్యే గారి కాలేజీ. మీకు దిక్కున్న చోట చెప్పుకోండి. మమ్మల్ని ఎవ్వరూ పీకలేరు. ఎక్కువ మాట్లాడితే మీరు గుంటూరు కూడా వెళ్లలేరు’ అని బెదిరింపులకు దిగారు. దీంతో భయభ్రాంతులకు గురైన ఆదిలక్ష్మి వెంటనే ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ప్రిన్సిపాల్, మేనేజ్‌మెంట్‌పై ఫిర్యాదు చేశారు.
టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ ఫొటోతో ఉన్న అకాడమీ బోర్డు
కేసు దర్యాప్తు చేస్తున్నాం
ప్రియదర్శిని కాలేజీగా రిజిస్టరైన వైజాగ్ డిఫెన్స్ అకాడమీపై ఆదిలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ విజయ్‌కుమార్ శనివారం తెలిపారు. ఆదిలక్ష్మితో పాటు మరో ముగ్గురు విద్యార్థుల తల్లితండ్రులు కూడా తమపై కళాశాల ప్రతినిధులు బెదిరింపులకు పాల్పడినట్టు చెప్పారన్నారు. అయితే వారు లిఖితపూర్వకంగా ఫిర్యాదు ఇవ్వలేదని పేర్కొన్నారు. గతంలోనూ విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన విద్యార్థుల నుంచి ఇదే మాదిరి ఫిర్యాదులు సదరు అకాడమీపై అందాయని, సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment