ఎమ్మెల్యే వ్యాఖ్యలతో అవాక్కయిన 'తమ్ముళ్లు'
‘మీలో కాపు సామాజికవర్గీయులెవరు?.. ఒకసారి చేతులెత్తండి’.. నగర టీడీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ ఇచ్చిన ఈ పిలుపు ఆ పార్టీలో తీవ్ర దుమారం రేపుతోంది. ఆ సామాజికవర్గానికి చెందిన సీనియర్ నేతలు కుతకుతలాడుతున్నారు. స్కూల్లో పిల్లల్ని ఆదేశించినట్లు తమను చేతులెత్తమనడమేంటి?.. అయినా పాతికేళ్ల నుంచి పార్టీలో ఉన్నాం. ఎవరు.. ఏ సామాజికవర్గానికి చెందినవారో నగర అధ్యక్షుడికి ఇంతవరకు తెలియకపోవడమేంటని మథనపడుతున్నారు.
► వాసుపల్లి ప్రశ్నతో గతుక్కుమన్న టీడీపీ కాపు నేతలు
► 25 ఏళ్ల తర్వాత ఇప్పుడు మా గురించి చెప్పుకోవాలా?
► ఆక్రోశం, ఆవేదన వెళ్లగక్కుతున్న ఆ వర్గీయులు
► దసపల్లా హిల్స్ కబ్జాపై టీడీపీ దొంగాట
► కబ్జా చేస్తూ ఆ కొండ తమదేనని బుకాయింపు
విశాఖపట్నం: ఒక సామాజికవర్గాన్ని దగ్గరకు తీసుకుందామంటూనే.. టీడీపీ నగర శాఖ అధ్యక్షుడు వాసుపల్లి గణేష్‌కుమార్ అనాలోచితంగా అన్న మాటలు ఆ ప్రయత్నానికే గండికొట్టేలా పరిణమించాయి. శుక్రవారం జరిగిన పార్టీ నగర శాఖ సమావేశంలో వాసుపల్లి మాట్లాడుతూ కాపు సామాజికవర్గం పార్టీకి దూరం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ సామాజికవర్గాన్ని ఆకట్టుకోవడానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు.
టీడీపీయే ఆ వర్గానికి న్యాయం చేస్తుందన్న వాదనను వినిపించడానికి ఈ నెల 25న ఓ సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. తటస్థులుగా ఉన్న కాపు వర్గీయులు కూడా ఆ సమావేశానికి వచ్చేట్లు చూడాలి అన్నారు. అంతా చెప్పిన తరువాత ‘ఇంతకీ ఈ సమావేశానికి వచ్చిన వారిలో కాపు కులస్తులు ఎవరు ఉన్నారో చేతులు ఎత్తండి’ అని వాసుపల్లి అన్నారు. దాంతో సమావేశంలో పాల్గొన్న కాపు సామాజికవర్గానికి చెందిన సీనియర్ నేతలు బిత్తరపోయారు. ఎందుకంటే ఆ సామాజిక వర్గానికి చెందిన పార్టీ అధికార ప్రతినిధి పాతర్లగడ్డ రంగబాబు, టీఎన్‌టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విల్లా రామకృష్ణ, ఆరిలోవ డివిజన్ పార్టీ అధ్యక్షుడు మోది అప్పారావు, మాజీ కార్పొరేటర్ బండారు శ్రీనివాసరావు తదితర సీనియర్ నేతలు సమావేశంలో పాల్గొన్నారు.
పాతికేళ్లుగా వారంతా టీడీపీలో ఉన్నారు. వాస్తవానికి వాసుపల్లి కంటే ఎంతో సీనియర్లు. కానీ వాసుపల్లి వ్యాఖ్యలతో పార్టీ సమావేశంలో తాము కాపు సామాజికవర్గానికి చెందినవారమని చేతులు పెకైత్తి చెప్పుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందా? అని ఆవేదన చెందారు. పాతికేళ్లుగా పార్టీలో ఉన్న తాము ఎవరిమో కూడా నగర పార్టీ అధ్యక్షుడికి తెలియదా?.. ఇప్పుడు మేము చేతులు పెకైత్తి మా పేరు, సామాజికవర్గం గురించి కొత్తగా చెప్పుకోవాలా?.. అని లోలోన మథనపడ్డారు.
దసపల్లా హిల్స్ కబ్జాపై కథలు చెప్పండి
కాగా టీడీపీ కార్యాలయ నిర్మాణానికి నగర నడిబొడ్డున దసపల్లా హిల్స్ ప్రాంతంలో రెవెన్యూ పోరంబోకు కొండను కబ్జా చేస్తున్న వ్యవహారంపై వాసుపల్లి మల్లగుల్లాలు పడ్డారు. లోకేష్ కనుసన్నల్లో రూ.60 కోట్ల విలువైన కొండను కబ్జా చేస్తూ పార్టీ కార్యాలయం నిర్మించనున్న వ్యవహారాన్ని ‘సాక్షి’ పత్రిక వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. దాంతో టీడీపీ నేతలు నష్టనివారణ చర్యలపై చర్చించారు. ప్రభుత్వం కేటాయించిన స్థలంలోనే పార్టీ కార్యాలయం నిర్మిస్తున్నామనే వాదనను వినిపించమని వాసుపల్లి గణేష్ పార్టీ నేతలను ఆదేశించారు. కానీ వాస్తవానికి టీడీపీకి 1999-2004 మధ్య కేవలం 2వేల చదరపు గజాలు మాత్రమే కేటాయించారు. అందులో అప్పట్లోనే కార్యాలయం నిర్మించారు. ప్రస్తుతం దాదాపు రెండు ఎకరాల కొండను తొలిచేసి భారీ కార్యాలయాన్ని నిర్మంచనున్నారు. దీనిపై ప్రజలకు ఎలా కట్టకథలు చెప్పాలని అని టీడీపీ నేతలే విస్మయం చెందుతున్నారు.