రేవంత్‌రెడ్డిపై కేసు నమోదు
వైద్యకళాశాలల నుంచి రూ. 100 కోట్ల ముడుపులు తీసుకున్నారంటూ తెలంగాణ ముఖ్యమంత్రి
హైదరాబాద్: వైద్యకళాశాలల నుంచి రూ. 100 కోట్ల ముడుపులు తీసుకున్నారంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుపై ఆరోపణలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిపై బంజారాహిల్స్ పోలీసులు కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేశారు. విచారణకు రావాల్సిందిగా మంగళవారం బంజారాహిల్స్ పోలీసులు ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డికి ఎమ్మెల్యే కాలనీలోని ఆయన నివాసానికి వెళ్లి నోటీసులు అందజేశారు.
ఎన్‌టీఆర్ భవన్‌లో రెండు నెలల క్రితం రేవంత్‌రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తెలంగాణ మనోభావాలు దెబ్బతినేలా కేసీఆర్‌పై ఆరోపణలు గుప్పించారు. తెలంగాణ అడ్వొకేట్ జేఏసీ నేత గోవర్ధన్‌రెడ్డి కోర్టును ఆశ్రయించి రేవంత్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాల్సిందిగా అభ్యర్ధించారు. స్పందించిన కోర్టు ఈ మేరకు రేవంత్‌రెడ్డిపై కేసు నమోదు చేయాల్సిందిగా ఆదేశించింది. దీంతో పోలీసులు ఆయనపై ఐపీసీ 504, 505 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.