
ధనికులు, పేదలనే తేడా లేదు.. తోపుడు బండ్లు, బంగారం వ్యాపారులనే తారతమ్యం లేదు.. మనోళ్లు, పరాయోళ్లనే భేదం లేదు.. ఎవరినీ వదల్లేదు.. ఐదేళ్లపాటు ఎక్కడా అడ్డూఅదుపూ లేదు.. అందినకాడికి దోచుకున్నారు. అన్నింటా పట్టుబట్టి పన్నులు పీకారు. అధికారాన్ని అడ్డుపెట్టి అవినీతి కోటలు కట్టారు. అక్రమ కేసులు పెట్టి అరాచక పాలన సాగించారు. శాసనసభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ అధికారం అండతో సత్తెనపల్లి, నరసరావుపేటలో ఆయన బిడ్డలు శివరామ్, విజయలక్ష్మి అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడ్డారు. వీరి అరాచకాలను పంటిబిగువున భరించిన బాధితుల కన్నీళ్లు ఇప్పుడు మండాయి. కొత్త ప్రభుత్వమిచ్చిన ధైర్యంతో కోడెల కుటుంబంపై తిరగబడుతున్నాయి. తమకు జరిగిన అన్యాయాలను పోలీసు మెట్ల వరకు తీసుకెళ్లి.. కేసులు కట్టిస్తున్నాయి.
సాక్షి, గుంటూరు: అధికారాన్ని అడ్డుపెట్టుకుని కోడెల, ఆయన కొడుకు, కుమార్తెల వల్ల ఇబ్బందులు పడ్డ బాధితులంతా ఏకమై తిరగబడుతున్నారు. బలవంతంగా వసూలు చేసిన డబ్బును వెనక్కు కక్కిస్తున్నారు. దౌర్జన్యంగా లాక్కున్న భూములను స్వాధీనం చేసుకుంటున్నారు. ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేశారని పలువురు పోలీసు స్టేషన్‌లలో ఫిర్యాదులు చేస్తున్నారు. ల్యాండ్ కన్వర్షన్‌ల పేరుతో బలవంతంగా డబ్బులు వసూలు చేశారని, అపార్టుమెంట్ నిర్మాణాల సమయంలో కమీషన్లు దండుకున్నారని కొందరు బిల్డర్లు నరసరావుపేట పోలీసు స్టేషన్ల మెట్లెక్కారు. తమ వద్ద లాక్కున్న స్థలాలు, పొలాలను వెనక్కు ఇచ్చేయాలంటూ కొందరు కోడెల, ఆయన కొడుకు, కుమార్తెలకు మధ్యవర్తుల ద్వారా హెచ్చరికలు పంపుతున్నారు. కొందరు నేరుగా కోడెల కుమార్తె నిర్వహిస్తున్న సేఫ్ కంపెనీకి, ఇళ్లకు వెళ్లి నిలదీస్తున్నారు. నరసరావుపేట వన్ టౌన్, రూరల్ పోలీసు స్టేషన్‌లలో కోడెల కుమార్తె, కొడుకుపై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి.
అధికార అహంకారంతో..
జిల్లాలోని నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో టీడీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లల్లో మాజీ స్పీకర్ కోడెల, ఆయన తనయుడు శివరామ్, కుమార్తె విజయలక్ష్మిలు చేసిన అరాచకాలు, అక్రమాలు, దౌర్జన్యాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అనేక మందిని బెదిరించి డబ్బులు వసూలు చేయడంతోపాటు, భూకబ్జాలకు సైతం పాల్పడ్డారు. కొందరు పోలీసు అధికారులను అడ్డుపెట్టుకుని కోడెల కుటుంబం చేసిన దౌర్జన్యాలు, అక్రమ వ్యవహారాలపై బాధితులు పోలీసు స్టేషన్‌లను ఆశ్రయిస్తూ తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నరసరావుపేట పట్టణంలో ఇంజినీర్ వేణు అనే వ్యక్తి పలువురు బిల్డర్లను బెదిరించి కోడెల కుమారుడు శివరామ్, అతని అంతరంగికుడు గుప్తాప్రసాద్‌లకు భారీ మొత్తంలో డబ్బులు ఇప్పించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నరసరావుపేట –1 టౌన్ పోలీసులు 384 సెక్షన్ కింద కేసు కట్టి దర్యాప్తు చేస్తున్నారు.
♦ సత్తెనపల్లి రోడ్డులో అపార్టుమెంట్‌లు నిర్మిస్తున్న తమను బెదిరించి రూ. 54 లక్షలు వసూలు చేశారంటూ కోడెల శివరామ్‌పై నలుగురు బిల్డర్లు ఫిర్యాదు చేశారు.
♦ విద్యుత్ సబ్ స్టేషన్‌లో ఆపరేటర్, వాచ్‌మెన్ పోస్టులు ఇప్పిస్తామంటూ రూ. 4 లక్షల నుంచి రూ. 6 లక్షల వరకు వసూలు చేశారని నరసరావుపేట టీడీపీ నాయకుడు కళ్యాణం రాంబాబుతోపాటు కోడెల కుమార్తె విజయలక్ష్మి, ఆమె పీఏ బొమ్మిశెట్టి శ్రీనివాసరావులపై బాధితులు పోలీసులకు ఫిర్యాదులు చేశారు. దీనిపై కేసు నమోదైంది.
♦ కేశానుపల్లిలో పొలం కొనుగోలు చేసిన తమను కోడెల కుమార్తె విజయలక్ష్మి బెదిరించి రూ. 15 లక్షలు వసూలు చేయడంతోపాటు మరో రూ. 5 లక్షలు ఇవ్వాలంటూ బెదిరించారని అరవపల్లి పద్మావతి అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదైంది.
♦ రావిపాడు గ్రామానికి చెందిన పలువురికి సచివాలయంలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కోడెల కుమార్తె విజయలక్ష్మి డబ్బులు వసూలు చేశారని, వాటిని తిరిగి ఇవ్వాలని అడిగేందుకు సేఫ్ కంపెనీకి వెళితే వెనక దారి నుంచి వెళ్లిపోయారని బాధితులు వాపోతున్నారు.
♦ నరసరావుపేట పట్టణంలోని ఓ టీడీపీ నాయకుడికి చెందిన బంగారం దుకాణంలో రూ. 25 లక్షలు విలువ చేసే నగలు తీసుకుని డబ్బులు ఇవ్వకుండా వెళ్లిన కోడెల కుమార్తెపై సదరు నాయకుడు ఫిర్యాదు చేసేందుకు సమాయత్తమవుతున్నట్లు తెలిసింది.
♦ మద్యం దుకాణాల నిర్వాహకుల నుంచి కోడెల కుమారుడు శివరామ్ భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసిన విషయం తెలిసిందే. వీరంతా ఏకమై తమ డబ్బులు వెనక్కు ఇవ్వాలంటూ కోడెల వద్ద పంచాయతీ పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
♦ సత్తెనపల్లి పట్టణంలో ఓ క్లబ్‌ను బలవంతంగా ఆక్రమించిన కోడెల శివరామ్ ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల కౌంటింగ్ రోజు వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిందని తెలియగానే క్లబ్‌లో కార్యాలయాలు ఏర్పాటు చేసిన ప్రభుత్వ ఉద్యోగులు స్వచ్ఛందంగా ఖాళీ చేసి వెళ్లిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment