
సాక్షి, కర్నూలు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎన్నికలు నిర్వహించేందుకు సమాయత్తం అవుతోంది. అందులో భాగంగానే కర్నూలు నగరపాలక సంస్థలో ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది. నగరపాలక సంస్థ ఎన్నికలకు సంబంధించి ఏప్రిల్ నెల 5న ఎన్నికల్ కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. ఆ ప్రకారం అదే నెల 30వ తేదీ లోపు నగరంలోని అన్ని వార్డుల్లో ఫొటో ఓటర్ల గుర్తింపు కార్యక్రమం చేపట్టారు.
వివిధ కారణాలతో మే 10వ తేదీ వరకు గడువు పెంచారు. మే 10 నుంచి కులాలవారీగా ఓటర్లను గుర్తించే కార్యక్రమం చేపట్టారు. పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు, సిబ్బంది నగరంలోని 51 వార్డుల్లో తిరిగి కులాల వారీగా ఓటర్లను గుర్తించారు. ఇదే జాబితాను కర్నూలు నగరపాలక సంస్థ కార్యాలయంతో పాటు కలెక్టరేట్, రెవెన్యూ డివిజనల్ కార్యాలయం, కర్నూలు, కల్లూరు తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రదర్శనకు ఉంచారు.
కర్నూలు ఓటర్లు 4.9 లక్షలు
కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్‌కు 2005లో ఎన్నికలు నిర్వహించారు. అప్పటి పాలకవర్గం 2010 సెప్టెంబర్ 30 వరకు పనిచేసింది. అప్పట్లో నగరపాలక పరిధిలో ఓటర్ల సంఖ్య 3.42 లక్షలు. అప్పటి నుండి 9 ఏళ్లుగా కర్నూలు నగరపాలక సంస్థకు ఎన్నికలు నిర్వహించలేదు. ఇదే క్రమంలో 2012 సంవత్సరంలో నగరపాలక సంస్థలో స్టాంటన్‌పురం, మామిదాలపాడు, మునగాల పాడు గ్రామాలు విలీనం అయ్యాయి.
దీంతో త్వరలో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేయడంతో మరోసారి నగరపాలకలో ఎన్నికల ప్రక్రియ వేగవంతం అయ్యింది. ప్రస్తుతం నగరపాలక సంస్థ పరిధిలో 4.9 లక్షల ఓటర్లు ఉన్నట్లు గుర్తించారు. 9 ఏళ్లలో నగరపాలక సంస్థలో 70 వేల ఓటర్లు నమోదు చేసుకున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. కులాల వారీగా ఓటర్లను గుర్తించే కార్యక్రమం పూర్తి కావడంతో పోలింగ్ స్టేషన్ల గుర్తింపు, రిజర్వేషన్ల ప్రక్రియ మొదలు కానుంది.
మొత్తం 51 వార్డులు
నగరపాలక సంస్థలో 51 వార్డులు ఉన్నాయి. మొత్తం 4,09,591 ఓటర్లు ఉన్నారు. పురుషులు 2,01,368, మహిళలు 2,08,147 మంది ఉన్నారు. మిగతా వారు 76 మంది ఉన్నారు. బీసీ వర్గానికి సంబంధించి 2,34,462 ఓట్లు ఉన్నాయి. ఇందులో పురుషులు 1,14,871, మహిళలు 1,19,544 మంది ఉన్నారు. ఎస్సీ వర్గానికి 59,236 ఓట్లు ఉన్నాయి. ఇందులో పురుషులు 27, 809, మహిళలు 31,421 మంది ఉన్నారు. ఎస్టీ ఓటర్లు 2,864 ఉన్నారు. ఇందులో పురుషులు 1,432, మహిళలు 1,431 ఉన్నారు. ఓసీ సంబంధించి 1,13,029 ఓట్లు ఉన్నాయి. పురుషులు 57, 256, మహిళలు 55, 751 మంది ఉన్నారు. 2010లో 13 మంది ఉండేవారు. వీరి సంఖ్య ప్రస్తుతం 76 చేరింది. వీరిలో బీసీలు 47 మంది, ఎస్సీలు ఆరుగురు, ఎస్టీ ఒకరు, ఓసీ 22 మంది ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment