మద్యం దుకాణాల్లో సీసీ కెమెరాలు... | CCTV camera cover for liquor shops in khammam | Sakshi
Sakshi News home page

మద్యం దుకాణాల్లో సీసీ కెమెరాలు...

Oct 31 2013 6:52 AM | Updated on Sep 2 2017 12:10 AM

జిల్లాలోని మద్యం (వైన్) దుకాణాల్లో సీసీ కెమెరాలు, లైట్లను వచ్చే నెల 15వ తేదీలోగా ఏర్పాటు చేసుకోవాలని, సెక్చూరిటీ గార్డును నియమించుకోవాలని వాటి యజమానులను ఎస్పీ ఎవి.రంగనాధ్ ఆదేశించారు.

ఖమ్మం మయూరి సెంటర్, న్యూస్‌లైన్: జిల్లాలోని మద్యం (వైన్) దుకాణాల్లో సీసీ కెమెరాలు, లైట్లను వచ్చే నెల 15వ తేదీలోగా ఏర్పాటు చేసుకోవాలని, సెక్చూరిటీ గార్డును నియమించుకోవాలని వాటి యజమానులను ఎస్పీ ఎవి.రంగనాధ్ ఆదేశించారు. వీటిని అమలు చేయలేకపోతే.. మద్యం విక్రయాలు నిలిపేయాల్సుంటుందని  అన్నారు. మహిళలపై దాడులు, లైంగిక వేధింపుల నేపథ్యంలో... మద్యం దుకాణాల యాజమానులు, ఆటో యజమానులు-డ్రైవర్లతో బుధవారం జడ్పీ మీటింగ్ హాలులో ఎస్పీ రంగనాధ్ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. మందుబాబులు వైన్ షాపుల వద్ద నిలబడి మద్యం తాగుతున్నట్టుగా ఫిర్యాదులు అందినట్టు చెప్పారు. అనుమతి ఇచ్చిన గదుల్లో మాత్రమే మద్యం తాగాలని చెప్పారు.
 
 దీనికి విరుద్ధంగా, వైన్ షాపుల ఎదుట మద్యం తాగుతూ దారిన వెళ్లేవారికి ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు (షాపు లెసైన్స్ రద్దు, కేసుల నమోదు) తీసుకుంటామని హెచ్చరించారు. కౌంటర్‌లో మద్యాన్ని లూజుగాఅమ్మవద్దని చెప్పారు. తోపుడు బండ్లపై తినుబండారాలు విక్రయిస్తూ  ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలిగించవద్దన్నారు. వైన్ షాపులకు 50 మీటర్ల దూరంలో తినుబండారాలు అమ్మవచ్చని అన్నారు. దీనిని ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. ‘దొంగ.. నేరం చేయడానికి ముందుగా మద్యం తాగేందుకు వైన్ షాపుకు వస్తాడు. అందుకే వైన్ షాపుల వద్ద సీసీ కెమెరాలను తప్పనిసరిగా ఉంచాలి’ అని చెప్పారు. నేర నియంత్రణలో భాగంగానే ఇలాంటి నిబంధనలు విధిస్తున్నట్టు చెప్పారు. వీటిని పాటించని వారిపై వచ్చే నెల 15వ తేదీ తరువాత చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎక్సైజ్ పాలసీ ప్రకారం వైన్ షాపులను రాత్రి 10.30 గంటలకే బంద్ చేయాలన్నారు.
 
 ఆటో డ్రైవర్లు వ్యక్తిగత సమాచారం ఇవ్వాలి
 ఆటో డ్రైవర్లు తమ వ్యక్తిగత సమాచారాన్ని స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఇవ్వాలని ఎస్పీ రంగనాధ్ చెప్పారు. పూర్తి సమాచారం ఇచ్చిన వారికి గుర్తింపు కార్డులు అందజేస్తామన్నారు. ఈ గుర్తింపు కార్డులను జిల్లాలోని సబ్ డివిజన్ పరిధిలోని డీఎస్పీలు అందజేస్తారని తెలిపారు. సాయంత్రం ఆరు గంటల తరువాత బయటకు వచ్చే ఆటో డ్రైవర్లంతా ఈ గుర్తింపు కార్డును మెడలో ధరించాలని చెప్పారు. ప్రతి డ్రైవర్ ఆటో వెనుక వైపు, అద్దం పక్కన పోలీసులు ఇచ్చిన నంబర్‌ను రేడియం స్టిక్కర్‌తో అంటించాలని తెలిపారు. ఆటో డ్రైవర్‌కు, ప్రయాణికులకు మధ్యలో చిన్న బల్బు అమర్చాలని, ఆటోలో ఉన్న వారు బయటకు స్పష్టంగా కనిపించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. జిల్లాలోని 90 శాతం ఆటో డ్రైవర్లు మంచివారేనని అన్నారు. కొత్తగా వచ్చి కేవలం 10 శాతం మంది ఆటో డ్రైవర్ల వ్యవహార తీరుతోనే మిగిలిన అందరికీ చెడ్డ పేరు వస్తోందని అన్నారు.
 
 ఆటోల అడ్డాల ఏర్పాటుకు వినతి
 ఆటో అడ్డాలు ఏర్పాటు చేయాలని ఆటో డ్రైవర్స్ యూనియన్ల నాయకులు ఎస్పీని కోరారు. ఈ విషయాన్ని కలెక్టర్, మున్సిపల్/నగర కమిషనర్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. నాన్ ట్రాన్స్‌పోర్ట్ లెసైన్స్ ఉన్నప్పటికీ కూడా పోలీసులు కేసులు పెడుతున్నారని డ్రైవర్లు ఫిర్యాదు చేశారు. తన దృష్టికి తీసుకొస్తే చర్యలు తీసుకుంటామని ఎస్పీ చెప్పారు. నేరాలను నియంత్రించేందుకు ఆటో డ్రైవర్లు సమాచారం ఇవ్వాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. కొంతమంది ఆటో డ్రైవర్లు రైల్వేస్టేషన్‌కు వచ్చే డ్రైవర్ల వద్ద యూనియన్ పేరుతో డబ్బులు వసూలు చేయడం సరికాదని అన్నారు. ప్రతి ఆటో డ్రైవర్ ఏ ప్రాంతానికైనా వెళ్లవచ్చని అన్నారు. ఈ సమావేశంలో ఏఎస్పీ భాస్కర్ భూషణ్, మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ రవీందర్, ఎక్సైజ్ సూపరింటెండెంట్లు నరసింహారెడ్డి, గణేష్, డీఎస్పీలు బాలకిషన్‌రావు, కృష్ణ, రవీంద్రరావు, అశోక్‌కుమార్, సాయిశ్రీ, ఎక్సైజ్ సీఐ విజయ్‌కుమార్, కూసుమంచి సీఐ నరేష్‌రెడ్డి, ఖమ్మం రూరల్ సీఐ తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement