పులివెందుల ఐసీడీఎస్ ప్రాజెక్టు సీడీపీఓ సావిత్రిదేవిపై సస్పెన్షన్ వేటు పడింది. 2014 వేసవిలో అంగన్‌వాడీ కేంద్రాలను నిర్వహించకుండానే నిర్వహించినట్లు రికార్డులు చూపి పెద్ద ఎత్తున సరుకులను పక్కదారి పట్టించారన్నదానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
10 మంది సూపర్‌వైజర్లపై వేటుకు రంగం సిద్ధం
సాక్షి, కడప : పులివెందుల ఐసీడీఎస్ ప్రాజెక్టు సీడీపీఓ సావిత్రిదేవిపై సస్పెన్షన్ వేటు పడింది. 2014 వేసవిలో అంగన్‌వాడీ కేంద్రాలను నిర్వహించకుండానే నిర్వహించినట్లు రికార్డులు చూపి పెద్ద ఎత్తున సరుకులను పక్కదారి పట్టించారన్నదానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వివరాల్లోకి వెళితే.. పులివెందుల ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో అంగన్‌వాడీ స్కూళ్లకు సంబంధించి పెద్ద ఎత్తున గోల్‌మాల్ జరిగినట్లు గత ఏడాది వేసవిలో పత్రికల్లో వార్తలు ప్రచురితమయ్యాయి. ఈ విషయంపై తెలుగు యువత నాయకుడొకరు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం, అంగన్‌వాడీకి చెందిన అనుబంధ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో అప్పట్లో విచారణ చేపట్టారు. అప్పటి పీడీ లీలావతి, ప్రస్తుత పీడీ రాఘవరావులతోపాటు ఆర్డీలు విచారణ నిర్వహించారు.
అంగన్‌వాడీ కార్యకర్తలను ప్రత్యేకంగా పిలిపించుకుని మాట్లాడటంతో పాటు కొన్ని సెంటర్లకు అధికారులు వెళ్లి విచారించారు. చాలా రోజులుగా విచారణ కొనసాగింది. ఇందులో భాగంగా సీడీపీఓపై చర్యలు తీసుకోకుండా ఓ రాజ్యాంగ పదవిని అనుభవిస్తున్న నేత తీవ్ర స్థాయిలో ఒత్తిడి తేగా, మరో వైపు చర్యలు తీసుకోవాల్సిందేనంటూ తెలుగు యువత నాయకుడు ఒత్తిడి చేస్తూ వచ్చారు. దీంతో ఉన్నతాధికారులకు ఎటూ పాలుపోలేని పరిస్థితి నెలకొంది. ఎట్టకేలకు ఉన్నత స్థాయి అధికారుల సూచన మేరకు సీడీపీఓ సావిత్రిదేవిపై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి పది మంది సూపర్‌వైజర్లపై వేటు పడనున్నట్లు సమాచారం. ఒక్క పులివెందుల ప్రాంతంలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా జరిగిన అవకతవకలపై కూడా అధికారులు దృష్టి సారించాలని వర్కర్లు కోరుతున్నారు.