అడ్డగోలుగా నిధుల కేటాయింపులు, అక్రమంగా వెచ్చింపులపై రాష్ట్ర ఆడిట్‌శాఖ మండిపడింది. జమా ఖర్చులకు పొంతన లేకపోవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
సాక్షి ప్రతినిధి, కడప: అడ్డగోలుగా నిధుల కేటాయింపులు, అక్రమంగా వెచ్చింపులపై రాష్ట్ర ఆడిట్‌శాఖ మండిపడింది. జమా ఖర్చులకు పొంతన లేకపోవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దుర్వినియోగం అయిన సొమ్మును అక్రమార్కుల నుంచి వసూలు చేయాలంటూ నివేదికలో పేర్కొంది. జిల్లా పరిషత్, మున్సిపాలిటీ, గంధ్రాలయాలకు సంబంధించిన గ్రాంటు కేటాయింపులు, ఖర్చులకు చెందిన రికార్డులు సక్రమంగా లేకపోవడాన్ని తప్పుబట్టింది.
జిల్లా పరిషత్‌లో ఏకంగా రూ.6కోట్ల నిధులకు చెందిన రికార్డులు లేకపోవడాన్ని ఎత్తి చూపింది. రాజంపేట మున్సిపాలిటీలో రూ.64 లక్షలు దుర్వినియోగం అయినట్లు తేల్చేసింది. ప్రత్యేకించి జిల్లా పరిషత్‌లో వివిధ పద్దుల కేటాయింపులు వాటి వ్యయానికి పొంతన లేకపోవడాన్ని ఆడిట్ శాఖ ఎత్తి చూపింది. అధికారుల నిర్లక్ష్య వైఖరిని ప్రస్ఫుటం చేస్తూ నివేదికలను పొందుపర్చింది. 2010-11 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పంచాయితీరాజ్, మున్సిపాలిటీ, వ్యవసాయ మార్కెట్ కమిటీలు, గ్రంధాలయాల ఆడిట్ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం గురువారం విడుదల చేసింది.
తప్పుల తడకగా
జిల్లా పరిషత్ . వ్యయాలు
జిల్లా పరిషత్ వ్యయాలు, కేటాయింపులు తప్పుల తడకగా నిర్ధారణ అయ్యాయి. 35శాతం వాటా కింద సాధారణ నిధులకు మంజూరు చేసిన మొత్తంలో రూ.13.97 లక్షలను నిబంధనలకు విరుద్ధంగా వినియోగించారు. మాజీ జెడ్పీటీసీ శివమోహనరెడ్డి ప్రతిపాదన మేరకు తొండూరు మండలం బూచుపల్లెలో దేవాలయ ప్రహరీకి రూ. 9 లక్షలు వెచ్చించారు. డీసీసీ అధికార ప్రతినిధి షబ్బీర్ ప్రతిపాదన మేరకు స్కౌట్ గ్రౌండు లెవెలింగ్‌కు రూ. లక్షలు ఖర్చు చేశారు.
వీటిపై ఆడిట్ శాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది. అలాగే కాంట్రాక్టర్లుకు చట్టబద్ధంగా తగ్గించి ఇవ్వాల్సిన వ్యాట్, ఇన్‌కం టాక్స్, సీనరేజ్ చార్జీలు రూ.2.9 లక్షలు అందజేసింది. కాంట్రాక్టర్లు నుంచి ఆమొత్తం చెల్లించుకోవాల్సి ఉండగా ఆపని చేపట్టలేదు. రాష్ట్ర ఆర్థిక సంఘం గ్రాంట్లు రూ. 27.35 లక్షలు, సీనరేజ్ గ్రాంట్ రూ. 51.68 లక్షలు, ఇసుక వేలం గ్రాంటు రూ.1.92 లక్షలు, మత్య్స సంపద రూ.50వేలు, టీఎఫ్‌సీ గ్రాంట్లు రూ. 130.4లక్షలకు చెందిన రికార్డులను జిల్లా పరిషత్ యంత్రాంగం ఆడిట్‌కు సమర్పించ లేకపోయింది. రూ.5,90,60,126 మొత్తానికి రికార్డులు చూపించలేక పోయారు. దీంతో జిల్లా పరిషత్ జమా ఖర్చులపై రాష్ట్ర ఆడి ట్ శాఖ తీవ్రంగా తప్పు బట్టింది.
నిబంధనలకు విరుద్ధంగా
సీఈఓ వాహనం ఖర్చులు
వివిధ గ్రాంటులతో బాటు సీఈఓ వాహనం ఇంధనం ఖర్చులు కూడా నిబంధనలకు విరుద్ధంగా అధికంగా ఖర్చు చేశారని ఆడిట్ తప్పుబట్టింది. ప్రభుత్వ అనుమతి కంటే రూ.4.25లక్షలు అధికంగా ఖర్చు చేసినట్లు పేర్కొంది. అలాగే వాహనాల మరమ్మత్తులకు రూ.2.32లక్షలు, కార్యాలయ నిర్వహణ ఖర్చులు రూ.40 వేలు ప్రభుత్వ అనుమతి కంటే అదనంగా ఖర్చు చేసినట్లు వివరించింది.
రాజంపేట ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయంలో కాంట్రాక్టర్లుకు చెందిన డిపాజిట్ మొత్తం రూ.2.87లక్షలు చెల్లించినట్లు పేర్కొన్నారు, అయితే రికార్డులు పొందుపర్చలేదు. పోరుమామిళ్ల ఎంపీడీఓ కార్యాలయం రూ.6.45 లక్షలు, కలసపాడు ఎంపీడీఓ కార్యాలయం రూ.50వేలు, రాచగుడిపల్లె పంచాయితీ రూ.75వేలు, పెన్నపేరూరు పంచాయితీ రూ.1.12 లక్షలు, యర్రగుంట్ల పంచాయితీ రూ.55 వేల మేరకు రికార్డులు చూపలేకపోయింది. దీంతో నిధులు దుర్వినియోగం అయినట్లు ఆడిట్ శాఖ భావిస్తోంది.
రాజంపేట మున్సిపాలిటీలో ...
రాజంపేట మున్సిపాలిటీలో రూ.64.58 లక్షల నిధులు దుర్వినియోగం అయినట్లు ఆడిట్ అభిప్రాయపడింది. 2007 ఏప్రిల్ 1 నుంచి మున్సిపాలిటీకి ఆస్తి పన్నుగారూ. 4,47,48,613 లభించింది. అలాగే నీటి సరఫరా ద్వారా రూ. 1,57,18,004 ఆదాయం లభించింది. అందులో ఆస్తి పన్ను కింద రూ.36,44,665, నీటి పన్ను కింద రూ.28,13,362 మొత్తం రూ.64.58 లక్షలు జమ చేయకుండా నొక్కేసినట్లు ఆడిట్ శాఖ పేర్కొంది.
అలాగే కడప కార్పొరేషన్ పరిధిలో తప్పుడు కూడికల ద్వారా నీటి పన్నుకు సంబంధించి రూ.2.27 లక్షలు దుర్వినియోగం చేశారు. ఇక్కడి బిల్‌కలెక్టర్లు మహమ్మద్‌గౌస్ రూ.1,54,760, ప్రభాకర్ రూ.1,31,100, ఇలియాకత్ రూ.31,680, సీవీ రమణ రూ.2.92,480 స్వాహా చేసినట్లు ఆడిట్ శాఖ పేర్కోంది. వీరు నలుగురు రూ.6.1లక్షలు దుర్వినియోగం చేశారని, పన్నులు వసూలు చేసి చిట్టాలో పొందుపర్చలేదని పేర్కొంది. అలాగే జిల్లా గంధ్రాలయ సంస్థ లభించిన ఆధాయం కంటే రూ.3.54లక్షలు తక్కువ జమ చేసినట్లు ఆడిట్ శాఖ నిర్ధారించింది.
రాబడి కంటే వ్యయమే అధికం...
జిల్లాలో ఆదాయం కంటే వ్యయమే అధికంగా ఉన్నట్లు ఆడిట్ నివేదిక పేర్కొంది. వివిధ పద్దుల ద్వారా జిల్లా పరిషత్‌కు ఆదాయం రూ. 627.94లక్షలు ఉంది. వ్యయం రూ. 933.76 లక్షలు నమోదైంది. అలాగే మండల పరిషత్ గ్రాంటుకు రాబడులు రూ. 1120.75 లక్షలు ఉండగా, ఖర్చులు రూ.1655.39 లక్ష లు ఉంది. గ్రామ పంచాయితీలకు రాబడి రూ. 2008.82లక్షలు ఉండగా ఖర్చు రూ.2975.9లక్షలు ఉంది. ప్రతి సందర్భంలోనూ రాబడి కంటే ఖర్చు అధికంగా ఉన్నట్లు నివేదికల ఆధారంగా రూఢీ అవుతోంది.