గజ్వేల్/గజ్వేల్ రూరల్, న్యూస్‌లైన్: జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్ వద్ద శుక్రవారం సందడి నెలకొంది. తెలంగాణకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత టీఆర్‌ఎస్ అధినేత తన పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశం నిర్వహించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
సమావేశానికి పార్టీ నేతలు కె.కేశవరావు, వినోద్, కడియం శ్రీహరి, మందా జగన్నాథం, మధుసూదనాచారి, టీఆర్‌ఎస్‌ఎల్పీ నేత ఈటెల రాజేందర్, ఎమ్మెల్యేలు హరీష్‌రావు, కేటీఆర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఉద్యోగ సంఘాల నేతలు దేవీ ప్రసాద్, శ్రీనివాస్‌గౌడ్, విఠల్ పాల్గొన్నారు. కేబినెట్‌తో సరిపెట్టుకోకుండా సంపూర్ణంగా తెలంగాణను సాధించేవరకు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా చర్చించుకున్నారు. సమావేశాన్ని పురస్కరించుకుని ఫామ్‌హౌస్‌కు వెళ్లే దారుల్లో పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.