- మొక్కులు సమర్పించిన ఎమ్మెల్యే, మంత్రి, చీఫ్‌విప్
- మేడారం భక్తులతో కిక్కిరిసిన ఆలయం
ములుగు, న్యూస్‌లైన్ : ప్రముఖుల మొక్కులతో ఆదిదేవత గట్టమ్మ ఆలయం కిక్కిరిసింది. శుక్రవారం పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులతోపాటు ప్రముఖులు వచ్చి తల్లికి మొక్కులు సమర్పించుకోవడంతో సందడి నెలకొంది. వర్ధన్నపేట ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, ప్రభుత్వ చీఫ్‌విప్ గండ్ర వెంకటరమణారెడ్డి సతీసమేతంగా వచ్చి గట్టమ్మకు మొక్కులు చెల్లించారు. మంత్రి పసుపులేటి బాలరాజు, డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ సోదరుడు రాంచందర్, కుటుంబ సభ్యులు ఆదిదేవతకు మొక్కులు సమర్పించారు. సెక్టోరియల్ అధికారులు నాగేశ్వర్‌రావు, రమేష్, ఎమ్మార్వో మార్క చక్రధర్ వారికి స్వాగతం పలికారు. ఊహించని విధంగా భక్తులు తరలిరావడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా సీఐ శ్రీధర్‌రావు, ఇతర సిబ్బంది ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.
సందడి చేసిన గబ్బర్‌సింగ్ టీం సభ్యులు
గబ్బర్‌సింగ్ సినిమా ఫేం హాస్య నటులు సాయిబాబు, నాగులు గట్టమ్మ ఆలయాన్ని సందర్శించి సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. మొదటిసారిగా మే డారం సమ్మక్క-సారలమ్మను దర్శించుకునేందుకు వెళ్తున్నామని, ఇంతమంది భక్తులను చూస్తే ఆశ్చర్యమేస్తోందని వారు అన్నారు. పూజలు చేసిన అనంతరం బయటకి వస్తున్న తరుణంలో వారిని భక్తులు గుర్తుపట్టడంతో ఒక్కసారిగా ఆ ప్రాంతం సందడిగా మారిం ది. వారితో ఫొటోలు దిగేందుకు భక్తులు ఎగబడ్డారు.
జనసంద్రంలా..
మేడారం సమ్మక్క-సారలమ్మను దర్శించుకుని తిరుగు పయనమైన భక్తులు గట్టమ్మ దర్శనానికి ఆగడంతో రద్దీ నెలకొంది. సారలమ్మ గద్దెపైకి వచ్చిన రోజు బుధవారం మేడారం వెళ్లే భక్తుల సంఖ్య ఒక్కసారిగా పెరగడంతో జిల్లా కేంద్రం నుంచి వచ్చిన వాహనాలను గుడెప్పాడ్, గణపురం, జంగాలపల్లి మీదుగా జాతరకు మళ్లించిన విషయం తెలిసిందే. దీంతో ఆ రోజు గట్టమ్మను దర్శించుకోలేకపోయిన వారు తిరుగు ప్రయాణంలో గట్టమ్మ తల్లిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అక్కడే విడిది చేసి వంటావార్పులకు సిద్ధమయ్యారు.