రిమ్స్‌లో ఉద్యోగులు గీ +డీడీ
Published Tue, Jan 21 2014 1:52 AM | Last Updated on Sat, Sep 2 2017 2:49 AM
రిమ్స్‌క్యాంపస్, న్యూస్‌లైన్ : జిల్లా కేంద్రంలోని రాజీవ్‌గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్(రిమ్స్) ఆస్పత్రి వివాదాలతో హోరెత్తిపోతోంది. ఒక సమస్య సమసిందనేసరికి కొత్త వివాదం పుట్టుకొస్తోంది. ఫలితంగా వైద్య సేవలకు విఘాతం కలిగే పరిస్థితి నెలకొంటోంది. తాజాగా రిమ్స్ డిప్యూటీ డెరైక్టర్ సృజన, గెజిటెడ్ ఉద్యోగుల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతోంది. ఆమె తీరు పట్ల ఉద్యోగులు మండిపడుతున్నారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని పరిష్కరించకుంటే మున్ముందు వివాదం పెరిగి పెద్దదయ్యే పరిస్థితి కనిపిస్తోంది.
ఇదీ సంగతి
డీడీ సృజన వ్యవహార శైలి ఆది నుంచి వివాదాస్పదంగా ఉంటోందని ఆస్పత్రి వర్గాలు వివరించాయి. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగాంగా ఉద్యోగులందరూ సమ్మె చేస్తున్నప్పుడు డీడీ మాత్రం విధులకు హాజరయ్యేవారు. అంతటి తో ఆగకుండా సిబ్బంది కూడా హాజరుకావాలని, లేకుంటే బాగోదని బెదిరించేవారు. దీంతో అప్పట్లో ఆమెకు, ఎన్జీవోలకు మధ్య వాగ్వాదం కూడా జరిగింది. సమ్మె సమయంలోనే ఆమె కొన్ని కంప్యూటర్‌లను గుట్టు చప్పుడు కాకుండా కొనుగోలు చేయటంపై వివాదం రేగింది. తర్వాత కొన్నాళ్లు బానే ఉన్న ఆమె రెండు నెలలుగా వైద్యు లు, ఉద్యోగులను ఇబ్బంది పెట్టేందుకు యత్నిస్తున్నారు. రోజూ వైద్యులు ఉదయం 8.30 గంటలకు విధులకు హాజరవుతారు.
డీడీ 10.30 గంటల సమయంలో వస్తారు. అప్పుడు వైద్యులు తన వద్దకొచ్చి హాజరు పట్టికలో సంతకం పెట్టాలని ఆమె హుకుం జారీ చేశారు. వైద్యులు తీవ్రంగా వ్యతిరేకించటంతో ఊరుకున్నారు. ఫిజియో థెరపిస్టును మాత్రం పిలిపించి ఆ విభాగాన్ని మరింత అభివృద్ధి చేయాలనుకుంటున్నానని, రోజూ తన వద్దకువచ్చి సంతకం పెట్టాలని ఆదేశించారు. అందుకు ఆయన నిరాకరించటంతో వెనక్కి తగ్గారు. ఇప్పుడు తాజాగా గెజిటెడ్ అధికారులైన ఫిజియోథెరపిస్టు, ముగ్గురు నర్సింగ్ సూపరింటెండెంట్ లు, బయోకెమిస్ట్రీ వైద్యాధికారులపై పెత్తనం చేసేందుకు యత్నాలు మొదలుపెట్టారు. రోజు తనవద్దకొచ్చి సంతకం పెట్టాలని మళ్లీ ఆదేశించారు. తాము ఉదయం త్వరగా విధులకు వస్తామని, మీరు వచ్చేసరికి విధుల్లో బిజీగా ఉంటామని, అందువల్ల రావటం కుదరదని వీరిలో ఒకరు డీడీకి తెలియజేశారు. అదంతా తనకు తెలియదని కచ్చితంగా వచ్చి తీరాలని పేర్కొంటూ ఫిజియోథెరపిస్టు డాక్టర్ లక్ష్మణరావు వద్దకు సోమవారం సర్క్యులర్ పంపారు. అయితే దీనిని ఆయన తిరస్కరించారు.
మరి బయోమెట్రిక్ విధానం ఎందుకు?
వైద్య సిబ్బంది సకాలంలో విధులకు హాజరయ్యేలా చూసేందుకుగాను బయోమెట్రిక్ విధానం అమల్లో ఉంది. అలాంటపుడు డీడీ తన వద్దకు వచ్చి సంతకాలు పెట్టమనటం ఎంతవరకు సమంజసమని వైద్యులు ప్రశ్నిస్తున్నారు. విధులను మధ్యలో నిలుపుదల చేసి సంతకం పెట్టడానికి వెళ్తే రోగులు ఇబ్బందులు పడతారని అంటున్నారు. డీడీ తీరు మారకుంటే విధుల బహిష్కరణ చేపట్టకతప్పదని హెచ్చరిస్తున్నారు. ఈ విషయాన్ని రిమ్స్ సూపరింటెండెంట్ డాక్టర్ అరవింద్ వద్ద ప్రస్తావించగా తన వద్దకు వచ్చి సంతకాలు పెట్టాలంటూ డీడీ ఎలాంటి సర్క్యులర్ పంపలేదని, కేవలం హాజరుపట్టికను మాత్రమే పంపాలని వైద్యులకు చెప్పారని పేర్కొన్నారు.
Advertisement
Advertisement