సాక్షి, న్యూఢిల్లీ : ప్రవర్తనా నియమాల ఉల్లంఘనకు సంబంధించి సస్పెన్షన్‌కు గురైన ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు వ్యవహారంపై కేంద్ర హోంశాఖ స్పందించింది. వెంకటేశ్వరరావు అవినీతిపై ప్రాథమిక ఆధారాలు ఉన్నాయన్న కేంద్రం.. ఆయనపై రాష్ట్ర ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేయడాన్ని సమర్థించింది. అలాగే ఏబీ వెంకటేశ్వరరావు అవినీతిపై ఏప్రిల్ 7లోగా చార్జ్‌షీట్ దాఖలు చేయాలని శనివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. మొత్తం రూ. 25 కోట్ల 50 లక్షల పరికరాల కొనుగోలులో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయనీ.. వీటి వెనుక వెంకటేశ్వరరావు హస్తం ఉందని హోంశాఖ పేర్కొంది. పోలీస్‌శాఖ అధునీకరణ పేరుతో ఆయన అవినీతికి పాల్పడ్డారని నిర్థారించింది. కాగా ప్రవర్తనా నియమాల ఉల్లంఘించినందుకు ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతనెల 8న ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. (దేశ భద్రతా రహస్యాలు బహిర్గతం!)
ఆల్ ఇండియా సర్వీసెస్ (క్రమశిక్షణ, అప్పీల్) నిబంధనల నియమం 3 (1) కింద సస్పెండ్ చేసినట్లు ఆదేశాల్లో పేర్కొంది. ఏబీ వెంకటేశ్వరరావు అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా ఉండగా భద్రతా పరికరాల కొనుగోలు టెండర్లలో అవకతవకలకు పాల్పడినట్లు తేలటంతో సస్పెండ్ చేసినట్లు జీవో నంబర్ 18లో స్పష్టం చేసింది. ఆయన దేశ భద్రతకు సంబంధించిన పలు కీలక విషయాలను బహిర్గతం చేసినట్లు తేలింది. ఏబీ వెంకటేశ్వరరావు పోలీస్ ఇంటెలిజెన్స్ ప్రొటోకాల్స్ విధానాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినట్లు ప్రభుత్వం గుర్తించింది. కాగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హయాంలో ఏబీ వెంకటేశ్వరరావు ఇంటిలిజెన్స్ చీఫ్‌గా పనిచేసిన విషయం తెలిసిందే. (వామ్మో.. ఏబీవీ!: సర్వత్రా విస్మయం).
ఏపీ ప్రభుత్వం చెప్పిన చెప్పిన కారణాలు
- నిబంధనలకు విరుద్ధంగా ఇజ్రాయెల్ సంస్ధ నుంచి నిఘాపరికరాల కొనుగోలు ఆరోపణలు
- ఇంటిలిజెన్స్ చీఫ్‌గా ఉండి ఇజ్రాయెల్ సంస్ధతో కుమ్మక్కై కుమారుడి సంస్ధకు కాంట్రాక్టు
- అడ్వాన్సుడ్ సిస్టమ్స్ సంస్ధకు కాంట్రాక్టు ఇప్పించుకున్నారని ఆరోపణ
- విదేశీ సంస్ధతో కుమ్మకై కుమారుడి సంస్ధకు కాంట్రాక్టు ఇప్పించుకోవడం అఖిల భారత సర్వీసుల నిబంధనల ఉల్లంఘన
- విదేశీ సంస్ధతో నిఘా సమాచారం పంచుకోవడం ద్వారా జాతీయ భద్రతకు ముప్పు కలిగించారని ఆరోపణ
- నాణ్యతలేని నిఘాపరికరాల కొనుగోలు ద్వారా రాష్ట్ర భద్రతకు ముప్పు కలిగించారని ఆరోపణ
- రాష్ట్ర భద్రతకు సంబంధించిన సమాచారం విదేశీ సంస్ధలతో పంచుకోవడం భవిష్యత్ భద్రతకు ముప్పని ఆరోపణ
- కాసులకు కక్కుర్తి పడి అనామక సంస్ధకు కాంట్రాక్టు ఇచ్చారని ఆరోపణ
- కావాలనే టెండర్ల సాంకేతిక కమిటీలో నిపుణులకు స్ధానం కల్పించలేదని ఆరోపణ
- విదేశీ సంస్ధకు మేలు చేసేందుకు ఉద్దేశపూర్వకంగానే కాంట్రాక్టు నిబంధనలు మార్చారని ఆరోపణ
- ఇజ్రాయెల్ సంస్ధకు కాంట్రాక్టు ఇచ్చేందుకే మిగతా కంపెనీల అర్హతలను పట్టించుకోలేదని ఆరోపణ
- నిఘా పరికరాల కొనుగోలుకు ప్రభుత్వ శాఖల నుంచి అనుమతులు కూడా తీసుకోలేదని ఆరోపణ
- ఉద్దేశపూర్వకంగానే పరికరాల కొనుగోలు ఆర్డర్ కాపీలను మాయం చేశారు
- కావాలనే పరికరాల కొనుగోళ్లలో సీనియర్ అధికారుల అభ్యంతరాలను బేఖాతరు చేశారు
- ఇజ్రాయెల్ కంపెనీతో కుమ్మకై అయినట్టుగా ప్రభుత్వం ఆరోపణ
- వెంకటేశ్వరరావు ఉద్దేశపూర్వకంగానే ఇంటెలిజెన్స్ ప్రోటోకాల్స్, విధానాలను బహిర్గతం చేశారనే ఆరోపణ
దీనితో పాటు వెంకటేశ్వరరావు రాజద్రోహానికి పాల్పడ్డారని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేధించింది.
Comments
Please login to add a commentAdd a comment