సమైక్య సెగతో ముఖం చాటేసిన కేంద్ర మంత్రులు రోజురోజుకూ ఉధృతమవుతోంది. ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. సమైక్య నినాదంతో హోరెత్తిస్తున్నారు
సమైక్యాంధ్ర ఉద్యమం జిల్లాలో ఉవ్వెత్తున ఎగసిపడుతోంది. రోజురోజుకూ ఉధృతమవుతోంది. ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. సమైక్య నినాదంతో హోరెత్తిస్తున్నారు. కానీ జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఇద్దరు కేంద్ర మంత్రులు ఇటువైపు కన్నెత్తి చూడడం లేదు. కనీసం ప్రజలకు మద్దతు ప్రకటించే ధైర్యం కూడా చేయడం లేదు.
విశాఖపట్నం - సాక్షి ప్రతినిధి : సమైక్యాంధ్ర ఉద్యమంతో జిల్లా అట్టుడికిపోతున్నా జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు పురందేశ్వరి, కిశోర్ చంద్రదేవ్‌లు పట్టనట్టే వ్యవహరిస్తున్నారు. రాజీనామాలు చేయాల్సి వస్తుందని తప్పించుకు తిరుగుతున్నారు. వీరి వైఖరిపై ప్రజలు మండిపడుతున్నారు. విశాఖపట్నం నుంచి లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తున్న పురందేశ్వరి, అరకు నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న కిశోర్ చంద్రదేవ్ కేంద్ర మంత్రి పదవులు అనుభవిస్తున్నారు. విశాఖ ఎంపీ టికెట్‌కు టి.సుబ్బరామిరెడ్డి పోటీకి దిగడంతో తన లోక్‌సభ నియోజక వర్గం పరిధిలోని ప్రజలతో సంబంధాలు పెంచుకోవడానికి పురందేశ్వరి కొంత కాలంగా అడపా దడపా కార్యక్రమాలకు హాజరవుతున్నారు.
కిశోర్ చంద్రదేవ్ అరకు ఎంపీగా ఉన్నా ఆయన తన నియోజక వర్గ పరిధిలో పర్యటించిన సందర్భాలు చాలా అరుదు. గత నెల 30వ తేదీన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పచ్చజెండా ఊపడంతో జిల్లాలో సైతం ఉద్యమం ప్రారంభమైంది. ఎంపీలు రాజీనామాలు చేసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలనే డిమాండ్ జనం నుంచి తీవ్రమైంది. ఉద్యమం రోజు రోజుకూ తీవ్ర రూపం దాల్చుతుండడంతో నియోజక వర్గాలకు వస్తే ఓటర్ల నుంచి ఎదురు దాడికి గురి కావాల్సి వస్తుందనే భయంతో కేంద్ర మంత్రులిద్దరూ ఇటు వైపే రావడం మానేశారు. కిశోర్ చంద్రదేవ్ అయితే తాను రాజీనామా చేయాల్సిన అవసరం లేదని కుండబద్దలు కొట్టారు. పురందేశ్వరి ఈ మాట నేరుగా అనక పోయినా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్ సింగ్ వద్దన్నారని తాను రాసిన రాజీమానా లేఖను ఆయనకు ఇవ్వకుండానే తిరుగుముఖం పట్టారు. లోక్‌సభలో సమైక్యాంధ్ర గొడవ జరుగుతున్నా పురందేశ్వరి, కిశోర్ చంద్రదేవ్ ఇది తమకు సంబంధంలేని వ్యవహారం అన్నట్లుగా వ్యవహరించారు.
అధిష్టానం అభీష్టానికి విరుద్ధంగా వ్యవహరిస్తే రాబోయే ఎన్నికల్లో పార్టీ టికెట్ దక్కదనే భయంతో ఉద్యమానికి బహిరంగంగా మద్దతు తెలిపేందుకు కూడా ఇష్టపడడం లేదు. కేంద్ర మంత్రుల తీరుపై జిల్లా జనం మండిపడుతున్నారు. తాము ఓట్లేసి గెలిపించిన ఎంపీలు జనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కనీసం పరామర్శకు కూడా రాకపోవడం దారుణమని ఆగ్రహిస్తున్నారు. రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డి సమైక్యాంధ్ర ఉద్యమంలో నేరుగా పాల్గొనకుండా ఉద్యమ కారులకు సంఘీభావం తెలపడానికే పరిమితమయ్యారు.