
నివురుగప్పిన నిప్పులా మారిన విజయనగరం!
సాక్షి ప్రతినిధి, విజయనగరం : విజయనగరంలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. మూడురోజుల పాటు కొనసాగిన అల్లర్లు, హింసాత్మక ఘటనలకు మంగళవారం విరామం లభించినట్లయింది. పట్టణం మొత్తం పోలీసుల చేతుల్లోకి వెళ్లిపోవడంతో ప్రజల సాధారణ జీవనం పూర్తిగా స్తంభించిపోయింది. పాలు, నీళ్లు, మందులు వంటి అత్యవసరాలకు సైతం ప్రజలు అవస్థలు పడ్డారు. పరిస్థితి బయటకు ప్రశాంతంగా కనిపిస్తున్నా.. లోలోపల రాజుకుంటూనే ఉందని చెప్పాలి. పోలీసులు వీధి వీధి శోధిస్తూ అనుమానం వచ్చిన వారందర్నీ అదుపులోకి తీసుకుంటున్నారు. మంగళవారం ఉదయం ఉదయం 7 నుంచి 8 గంటల వరకు కర్ఫ్యూ సడలించడంతో ప్రజలు నిత్యావసరాల కోసం అవస్థలుపడ్డారు.
పెట్రోలు బంకులు, ఏటీఎం కేంద్రాలు, పాల బూత్‌ల వద్ద బారులు తీరారు. సమయం సరిపోక కొన్నిచోట్ల తోపులాటలు చోటుచేసుకున్నాయి. రైతుబజార్లలో డబ్బులు చెల్లించకుండానే ప్రజలు కూరగాయలు, సరుకులు ఎత్తుకెళ్లారు. ఉదయం 8 గంటలకు మళ్లీ కర్ఫ్యూ అమల్లోకి రావడంతో వీధుల్లో కనిపించిన వారినల్లా పోలీసులు తరిమేశారు. ఇప్పటివరకూ 110 మందిని అరెస్టుచేసినట్లు ఎస్పీ కార్తికేయ వెల్లడించారు. అయితే ఇంతకు మూడింతలమంది వారి అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. వీధుల్లో యువకులు కనిపిస్తే చాలు వ్యాన్ ఎక్కించి ఎక్కడెక్కడో తిప్పి మరుసటిరోజు వదిలిపెడుతున్నారు.
నేడు రెండుగంటల పాటు కర్ఫ్యూ సడలింపు
మంగళవారం గంటసేపు సడలింపు ఇచ్చిన అధికారులు బుధవారం ఉదయం 7 నుంచి 9 వరకూ కర్ఫ్యూను సడలించనున్నారు. త్వరలో జరగనున్న పైడితల్లమ్మ ఉత్సవాలకు సంబంధించి సిరిమాను చెట్టును పట్టణంలోకి తీసుకొచ్చే ఘట్టం బుధవారం పోలీసు బందోబస్తు మధ్య అతి కొద్దిమందితో నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లుచేశారు.
హైదరాబాద్‌పై అందరికీ హక్కు
హైదరాబాద్‌పై అందరికీ హక్కు ఉందని రైతన్నలు నినదించారు. మంగళవారం విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలంలోని ఖడ్గవలస జంక్షన్‌లో జరిగిన నాగావళి రైతు గర్జనకు వేలాదిగా అన్నదాతలు తరలివచ్చారు. సమైక్య నినాదాలు మార్మోగించారు. రాష్ర్టం సమైక్యంగా ఉంటేనే తాము ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని, ఇక ముక్కలైతే తీవ్రమయ్యే సాగునీటి ఎద్దడితో సీమాంధ్ర రైతాంగానికి విపరిణామాలే ఎదురవుతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. జేఏసీ సభ్యుడు చొక్కాపు శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆంధ్రా మేధావుల ఫోరం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ ప్రజా గాయకుడు వంగపండు ప్రసాద్ పాల్గొన్నారు.