ఊరూ వాడా సమైక్య నినాదం | every where samaikyandhra supporters movement only | Sakshi
Sakshi News home page

ఊరూ వాడా సమైక్య నినాదం

Published Sun, Aug 25 2013 5:35 AM | Last Updated on Fri, Sep 1 2017 10:07 PM

every where samaikyandhra supporters movement only

అనంతపురం సిటీ/ ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్ : తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ దివాకర్‌రెడ్డికి అనంతపురంలో సమైక్య సెగ తాకింది. నగరంలో సమైక్యవాదులు పెద్ద ఎత్తున ఉద్యమించిన క్రమంలో శనివారం జేసీ దివాకర్‌రెడ్డి సుమారు 50 వాహనాలలో తన అనుచరగణంతో అనంతపురం వచ్చారు. ఆర్డీఓ కార్యాలయం ఎదుట రిలే దీక్షలు చేస్తున్న జాక్టో నాయకుల సాక్షి, అనంతపురం :
 లక్షల గళాలు ఒక్కటౌతున్నాయి. విభజన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని గర్జిస్తున్నాయి. శనివారం 25వ రోజు సమైక్య ఉద్యమ సెగ జిల్లాలో ఉప్పెనలా ఎగిసి పడింది. వైఎస్సార్‌సీపీ చేపట్టిన జాతీయ రహదారి దిగ్బంధంతో ‘అనంత’ అట్టుడికింది. జిల్లా అధికారుల సంఘం అధ్యక్షుడు డీఆర్వో హేమసాగర్ ఆధ్వర్యంలో అధికారులు నల్లదుస్తులు ధరించి ఆర్ట్స్ కళాశాల నుంచి తెలుగుతల్లి విగ్రహ ం వరకు సమైక్య నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం తెలుగుతల్లి కూడలిలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ప్రకటన వచ్చే వరకు ఉద్యమం ఆపేది లేదని ప్రతినబూనారు. పంచాయతీరాజ్ ఉద్యోగులు అరగుండు చేయించుకుని నిరసన తెలిపారు. మునిసిపల్ ఉద్యోగులు మాక్ కోర్టు నిర్వహించి.. రాష్ట్ర విభజనకు కారకులైన సోనియా, ద్విగ్విజయ్‌సింగ్, కేసీఆర్‌లకు ఉరిశిక్ష పడేలా తీర్పు వెలువరించారు.
 
 ఆర్టీఓ కార్యాలయం ఎదుట జాక్టో దీక్షకు మద్దతు తెలపడానికి మాజీ మంత్రి, తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ దివాకర్‌రెడ్డి వెళ్లారు. జేసీని చూసిన జాక్టో నాయకులు అడ్డుకున్నారు. జేసీ గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీంతో ఆయన అక్కడ నుంచి వెళ్లిపోయారు. పాతూరు విద్యుత్ కార్యాలయం ఎదుట రిలేదీక్షలు చేపట్టిన విద్యుత్ ఉద్యోగులను పరామర్శించడానికి వెళ్లిన మాజీ ఎంపీ కాలువ శ్రీనివాసులకూ ఉద్యమ సెగ తగిలింది. కాలువ దీక్షా శిబిరం వద్దకు చేరుకోగానే.. గమనించిన ఉద్యోగులు ఒక్కసారిగా కాలువ శ్రీనివాసులు గో..బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో ఆయన అక్కడి నుంచి వెనుదిరిగారు.
 
  మునిరత్నం శ్రీనివాస్ ఆధ్వర్యంలో చిన్నారులకు విచిత్ర వేషధారణలు ధరింపజేసి ఒంటెలపై నగరంలో ప్రదర్శన చేశారు. పశుసంవర్ధక శాఖ, గోపాల మిత్ర అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఎడ్ల బండ్లతో ప్రదర్శన నిర్వహించారు. న్యాయవాదులు నగరంలో ప్రదర్శన నిర్వహించారు. ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో బస్సులతో ర్యాలీ చేశారు. డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో సుభాష్‌రోడ్డులోని వైఎస్ విగ్రహం వద్ద వంటా-వార్పు నిర్వహించారు. ఆర్ట్స్ కళాశాల అధ్యాపకులు, జాక్టో, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాలు, జాతీయ రహదారులు, డ్వామా, ఐకేపీ, ఆస్పత్రి ఉద్యోగులు, సీఐటీయూ, వాణిజ్య పన్నుల శాఖ, పంచాయతీరాజ్ ఉద్యోగులు, విద్యుత్, మునిసిపల్  ఉద్యోగులు, నీటి పారుదల ఉద్యోగులు, ఆల్ మేవా ఆధ్వర్యంలో చేపట్టిన రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. కాగా నగరంలోని అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి సమైక్యాంధ్ర ప్లకార్డులు చేతపట్టుకుని ర్యాలీలు నిర్వహించారు.
 
 ఊరూ వాడా సమైక్య నినాదం
 ధర్మవరంలో రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా పలు పార్టీలు, ప్రజా సంఘాలు చేపట్టిన రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. స్వర్ణకారుల సంఘం, విద్యుత్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో రోడ్డుపై వంటావార్పు నిర్వహించారు. ముదిగుబ్బలో చిరు వ్యాపారులు బంద్ పాటించారు. గుంతకల్లు, గుత్తి, పామిడి పట్టణాల్లో జాక్టో, వైఎస్సార్‌సీపీ రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. గుత్తిలో విద్యుత్ ఉద్యోగులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. హిందూపురంలో పౌరాణిక వేషధారణలతో యాదవ కులస్తులు పట్టణంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. తపాలా, టెలిఫోన్ కార్యాలయాలను సమైక్య వాదులు బంద్ చేయించారు. అంబేద్కర్ సర్కిల్‌లో విద్యార్థినులు సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ప్రజలకు సమైక్యాంధ్రపై అవగాహన కల్పించారు.
 
  చిలమత్తూరు, లేపాక్షి మండలాల్లో విద్యుత్ శాఖ ఉద్యోగులు బైక్‌లతో ర్యాలీ నిర్వహించారు. కదిరి పరిసర మండలాల ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాద్యాయులు రిలే నిరాహార దీక్ష చేశారు. కదిరి డివిజన్ లోని ఉపాధ్యాయులు విజిల్ వేసుకుంటూ వినూత్నంగా పట్టణంలో ర్యాలీ చేపట్టారు. స్థానిక ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల అధ్యాపకులు, సిబ్బంది పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. డివిజన్ పరిధిలోని 10 మండలాల రెవెన్యూ ఉద్యోగులు, సిబ్బంది ర్యాలీ నిర్వహించి అనంతరం రిలేదీక్షా శిబిరాలను సందర్శించి సంఘీభావం తెలిపారు. తనకల్లులో ఉపాధ్యాయులు బైక్ ర్యాలీ నిర్వహించారు. కళ్యాణదుర్గంలో న్యాయవాదుల దీక్షలు కొనసాగుతున్నాయి. విచిత్ర వేషధారణలతో సమైక్య వాదులు ర్యాలీ చేశారు.
 
  మడకశిరలో ఉపాధ్యాయులు భిక్షాటన చేసి నిరసన తెలిపారు. పుట్టపర్తిలో జేఏసీ ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం రాహుల్ పెళ్లి కోసం భిక్షాటన చేసి.. సోనియాకు మనియార్డర్ చేశారు. మహమ్మదాబాద్ నుంచి అమడగూరు వరకు సమైక్యవాదులు పాదయాత్ర చేశారు. ఓడీ చెరువు మండలంలో రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. పెనుకొండ, సోమందేపల్లె, రొద్దం దళిత సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. పరిగిలో ఉపాధ్యాయులు, విద్యార్థులు రిలేదీక్షలు చేపట్టారు. రాయదుర్గంలో ఫుట్‌వేర్ వ్యాపారులు, విశ్వభారతి పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, పశుసంవర్ధశాఖ ఉద్యోగుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. విద్యుత్ ఉద్యోగులు, జిరాక్స్ బుక్‌స్టాల్స్ నిర్వాహకుల ఆధ్వర్యంలో చిరిగిన దుస్థులతో ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు.
 
 కణేకల్లులో ఎన్జీవోలు రోడ్డుపై క్రికెట్ ఆడి నిరసన తెలిపారు. రాప్తాడులో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. సీకేపల్లెలో టింబక్టు ఆధ్వర్యంలో సమైక్యాంధ్రపై చర్చా వేదిక నిర్వహించారు. పుట్లూరు, నార్పల, బీకేఎస్ మండలాల్లో జేఏసీ, నాన్‌పొలికల్ జేఏసీ చేపట్టిన రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. తాడిపత్రిలో జేఏసీ, మునిసిపల్, ట్రాన్స్‌కో ఉద్యోగులు  భారీ ర్యాలీలు నిర్వహించారు. యాడికి, పెద్దపప్పూరులలో రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. ఉరవకొండలో సమైక్యవాదులు చేపట్టిన 48 గంటల నిరాహార దీక్షలకు ప్రజల నుంచి సంఘీభావం వెల్లువెత్తింది. మైనార్టీలు భారీ ప్రదర్శన నిర్వహించారు. కళ్లకు గంతలు కట్టుకొని ఉపాధ్యాయినులు ర్యాలీ నిర్వహించారు. వజ్రకరూరులో దూదేకుల సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. బెళుగుప్పలో ఉపాధ్యాయులు ర్యాలీ నిర్వహించారు.    

Advertisement
Advertisement
Advertisement