
మన్నించు మహాత్మా..
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం, చేనేతలే పట్టుగొమ్మలని చెప్పి.. రాట్నం పట్టుకుని, నూలు వడికి.. ప్రజలంతా ఖద్దరు దుస్తులే ధరించాలని పిలుపునిచ్చిన మహాత్మునికి జాతీయ టెక్స్‌టైల్ కార్పొరేషన్ మరవలేని నివాళినే అర్పించింది. తన నిరాడంబర జీవితాన్నే విలువలుగా బోధించిన బాపూజీకి పంచ వన్నెల విద్యుత్ కాంతి నడుమ హోటల్ తాజ్ కృష్ణాలో కేంద్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, టెక్స్‌టైల్ కార్పొరేషన్ చైర్మన్ ఎంతో ఆడంబరంగా నివాళులర్పించారు. కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు, చిరంజీవి, రాష్ట్ర మంత్రి పితాని సత్యనారాయణ, ఎమ్మెల్యేలు వంగా గీత, కన్నబాబు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
అనంతరం హైదరాబాద్ మటన్ బిర్యాని, తందూరీ చికెన్‌తో ఆహూతులకు భోజనాలు ఏర్పాటు చేశారు. గాంధీ జయంతి రోజున మద్యం, మాంసం ముట్టుకోకూడదని చిన్నపిల్లాడిని అడిగినా చెపుతాడు. కానీ, గాంధీ జయంతిని పురస్కరించుకుని కొత్తతరం దుస్తులు ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన జాతీయ టెక్స్‌టైల్ కార్పొరేషన్ వారికి ఆ విషయం గుర్తు లేదు. గాంధీ జయంతి రోజునే ఆయన పేరుతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలోనే మాంసం వండటం, వడ్డించడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. జాతీయ టెక్స్‌టైల్ కార్పొరేషన్ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ ఆర్‌కే సిన్హా కేంద్ర, రాష్ట్ర మంత్రులను, ఎమ్మెల్యేలను భోజనానికి ఆహ్వానించారు. ఈ ఘటన గాంధేయవాదుల మనస్సును తీవ్రంగా గాయపర్చింది.