నగర శివారులో సారంగపూర్ వద్ద గల జిల్లా జైలును కేంద్ర కారాగారంగా (సెంట్రల్ జైలు) మార్చాలన్న అంశం ప్రతిపాదనలకే పరిమితమవుతోంది
నగర శివారులో సారంగపూర్ వద్ద గల జిల్లా జైలును కేంద్ర కారాగారంగా (సెంట్రల్ జైలు) మార్చాలన్న అంశం ప్రతిపాదనలకే పరిమితమవుతోంది. స్థల సేకరణ అంశం కొలిక్కి రాకపోవడమే ఇందుకు కారణం. రెవెన్యూ అధికారులనుంచి స్పందన కరువైందని తెలుస్తోంది.
సుభాష్‌నగర్, న్యూస్‌లైన్ :
గతంలో జిల్లా జైలు ఖిల్లాలో ఉండేది. తర్వాత సారంగాపూర్ వద్ద 56 ఎకరాల స్థలాన్ని సేకరించి నూతన జైలును నిర్మించారు. ఇందులో 15 ఎకరాలను వ్యవసాయం, సిబ్బంది నివాసాల కోసం కేటాయించారు. 2007లో జైలును ఖిల్లా నుంచి సారంగపూర్‌కు మార్చారు. అన్ని హంగులతో నిర్మించిన ఈ జైలును సెంట్రల్ జైలుగా అప్‌గ్రేడ్ చేయాలని జైళ్ల శాఖ గతంలో ప్రతిపాదనలు పంపింది. గతేడాది ఉన్నతాధికారులు జిల్లా జైలును సందర్శించి వసతుల గురించి తెలుసుకున్నారు. సెంట్రల్ జైలుకు కావాల్సిన అన్ని వసతులు ఉన్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. సెంట్రల్ జైలుకు వంద ఎకరాలు అవసరమని పేర్కొన్న అధికారులు కావాల్సిన భూమిని కేటాయించాల్సిందిగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అయితే జిల్లా జైలుకు స్థలం కేటాయించే విషయంలో రెవెన్యూ అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.
ఇదీ పరిస్థితి
జిల్లా జైలులో ప్రస్తుతం 389 మంది ఖైదీలున్నా రు. దీనిని సెంట్రల్ జైలుగా మార్చితే రాష్ట్రంలో వివిధ జైళ్లలో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలకు చెందినవారిని ఇక్కడికి తరలిస్తారు. ఇలా తరలిస్తే ఖైదీల కుటుంబ సభ్యులకు వారిని కల వడానికి సమయంతోపాటు ప్రయాణ భార మూ తగ్గుతాయని అధికారులు భావించారు. ఇదే ఆలోచనతో గతంలో కొందరు ఖైదీలను చర్లపల్లినుంచి నిజామాబాద్ తరలించారు. మరికొందరిని తరలించడానికి వీలుగా సెంట్ర ల్ జైలుగా మార్చాలని ప్రతిపాదనలు పంపా రు. పలువురు జీవిత ఖైదీల కుటుంబ సభ్యులు ఇందుకోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నా రు. తమవారు ఇక్కడికి వస్తే కలుసుకోవడం తేలికవుతుందని వారి ఆశ. అధికారుల నిర్లక్ష్యం తో అవి ప్రతిపాదనలుగానే మిగిలిపోయాయి. కాగా సారంగపూర్‌లో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని జైలుకు కేటాయించకుండా కుంటిసాకులు చెబుతున్న రెవెన్యూ అధికారులు, అదే భూమిని రియల్టర్లు కబ్జా చేసినా చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.