జగిత్యాలక్రైం: తన సోదరితో కలిసి భర్తను హత్య చేసి బావిలో పడేసిన కేసులో భార్యతోపాటు ఆమె సోదరికి కోర్టు జీవితఖైదు విధించింది. దీంతోపాటు ఒక్కొక్కరికి రూ.6వేల చొప్పున జరిమానా విధించింది. ఈమేరకు జిల్లా సెషన్స్ జడ్జి నీలిమ శుక్రవారం తీర్పునిచ్చారు. కోరుట్ల మండలం సంగెం గ్రామానికి చెందిన గుంటి గంగమల్లయ్య(52) మొదటి భార్య మృతి చెందడంతో రెండోభార్య దేవను వివాహం చేసుకున్నాడు.
ఆమెకు మనోజ్ (12) కుమారుడు సంతానం. ఆస్తికోసం దేవ తన భర్తతో పలుమార్లు గొడవ పడింది. ఆస్తి పంచివ్వడం లేదని ఆగ్రహం పెంచుకుంది. ఈక్రమంలో 2018 మార్చి 13న గంగమల్లయ్య సోదరి గ్రామం కథలాపూర్ మండలం తక్కళ్లపల్లిలో గొర్రెలు మేపేందుకు వెళ్లాడు. తిరిగి ద్విచక్ర వాహనంపై వస్తున్నాడు. ఈక్రమంలో గ్రామ శివారులోరెండో భార్య దేవతోపాటు, ఆమె చెల్లెలు ఆదె రజిత కలిసి గంగమల్లయ్య తలపై సుత్తెతో కొట్టి చంపేశారు.
మృతదేహం కాళ్లు, చేతులను చీరతో కట్టి సమీపంలోని వ్యవసాయ బావిలో పడేశారు. అయితే, మృతుడి మొదటి భార్య కుమారుడు గుంటి గంగమహేందర్ ఫిర్యాదు మేరకు కోరుట్ల పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ సతీశ్‌చందర్‌రావు పలువురు సాక్ష్యులను కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయమూర్తి ఇద్దరు నిందితులకు జీవిత ఖైదుతోపాటు, రూ.6 వేల చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment