కరీంనగర్, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు టీజేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించనున్న సకల జనభేరి సభకు జిల్లా నుంచి అధిక సంఖ్యలో తరలివెళ్లేందుకు తెలంగాణవాదులు సన్నద్ధమయ్యారు.
తెలంగాణ రాష్ట్ర ప్రకటన వచ్చి యాభై రోజులు దాటినా.. అది బిల్లు రూపం దాల్చకపోవడం, సీమాంధ్రలో ఆందోళనలు కొనసాగుతుండడంతో కాంగ్రెస్ తీరుపైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంతోపాటు కాంగ్రెస్ పార్టీపైన ఒత్తిడి తీసుకొచ్చేందుకు టీజేఏసీ హైదరాబాద్‌లో సకల జనభేరి సభను తలపెట్టింది. దీనికి టీఆర్‌ఎస్‌తోపాటు టీజేఏసీలోని రాజకీయ పార్టీలు ఇప్పటికే మద్దతు ప్రకటించాయి. ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మిక, విద్యార్థి, కుల, ప్రజా సంఘాలు సంఘీభావం తెలిపాయి.
వివిధ పార్టీలతోపాటు ఆయా సంఘాల జేఏసీలు సక ల జనభేరి సభను విజయవంతం చేసేందుకు జిల్లావ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. కరీంనగర్, గోదావరిఖరి, జగిత్యాల, సిరిసిల్ల, కోరుట్ల, మెట్‌పల్లి, పెద్దపల్లి, హుజూరాబాద్, హుస్నాబాద్‌లతో టీజేఏసీ సహా వివిధ సంఘాలు ప్రదర్శనలు, సభలు, సమావేశాలు నిర్వహిస్తూ ప్రజలను సన్నద్ధం చేస్తున్నాయి. తెలంగాణ ఏర్పాటే లక్ష్యంగా ఇంటికొక్కరు వెళ్లి తమ గళం వినిపించేందుకు సిద్ధమవుతున్నారు. సభ రోజున జిల్లా నుంచి హైదరాబాద్ వెళ్లే మార్గంలో రాకపోకలపై పోలీసులు నియంత్రణ విధించే అవకాశముండడంతో పలువురు శనివారం సాయంత్రానికే అక్కడికి చేరుకునేందుకు సన్నద్ధమవుతున్నారు.
సకలం సన్నద్ధం
Published Sat, Sep 28 2013 3:51 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement