విలేకరులతో మాట్లాడుతున్న శిల్పా చక్రపాణిరెడ్డి
సాక్షి, ఆత్మకూరు: ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని, ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సరికాదని వైఎస్సార్‌సీపీ నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, శ్రీశైలం నియోజకవర్గ సమన్వయకర్త శిల్పా చక్రపాణిరెడ్డి హితవు చెప్పారు. సోమవారం ఆయన ఆత్మకూరులోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. బుడ్డా రాజశేఖరరెడ్డి అయ్యప్ప మాలధారణ చేసి అబద్ధాలు మాట్లాడుతున్నారని విమర్శించారు.
నైతిక విలువలు, అవినీతి గురించి ఆయన మాట్లాడడం విడ్డూరమన్నారు. ‘నేను అవినీతికి పాల్పడుతున్నానని చెప్పడం సిగ్గుచేటు. శ్రీశైలం పాతాళగంగలో మునిగి అవినీతిపై బహిరంగంగా చర్చిద్దాం.. సవాల్‌కు సిద్ధమేనా? వైఎస్సార్‌సీపీ తరఫున గెలిచిన నీవు టీడీపీలో చేరినప్పుడు సీఎం చంద్రబాబు దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోకుండానే చేరావా? పార్టీ మారేటప్పుడు మీరు రాజీనామా చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా ఇస్తానని అన్నావు.
నేను నైతిక విలువలకు కట్టుబడి రాజీనామా చేశా. మరి నీవెందుకు చేయలేదు’ అని సూటిగా ప్రశ్నించారు. తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరినప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పశువులను కొన్నట్లు కొన్నారని చంద్రబాబు అన్నారని, మరి అదే ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు 23 మందిని ఎలా కొన్నారని నిలదీశారు. ఎమ్మెల్యే బుడ్డా ఎన్ని కోట్లకు అమ్ముడుపోయారో నియోజకవర్గ ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉందన్నారు.
‘నీరు– చెట్టు, మట్టి, ఇసుక ..ఇలా ప్రతి పనిలో అవినీతికి పాల్పడలేదా? నీ వెంట ఉన్న వారే నీవు అవినీతికి పాల్పడుతున్నావని అంటున్నారు. వినిపించడం లేదా? ఏ అవినీతికీ పాల్పడని నన్ను విమర్శించడం భావ్యమా? ప్రతిపక్ష పార్టీలో ఉన్న మాకు ప్రశ్నించే అధికారం ఉంది. విమర్శలను స్వీకరించి బాధ్యతగా నడుచుకోవాలే తప్ప ఇష్టారాజ్యంగా మాట్లాడడం తగదు. శ్రీశైలంలో శిల్పా ఇళ్లు ఎలా కట్టిస్తారని అంటున్నావు. అది కూడా తెలియదా? చంద్రబాబును అడుగు.. ఆయనే చెబుతాడు.
అటవీ భూములు కావాల్సి వస్తే.. అందుకు ప్రతిగా మరో భూమిని ఇప్పిస్తే క్లియరెన్స్ వస్తుంది. ప్రభుత్వం ఉంటే ఇళ్లు కట్టించడం పెద్ద సమస్య కాద’ని అన్నారు. సిద్ధాపురం చెరువు కింద పంటలు ఎండిపోతున్నా ఎమ్మెల్యే పట్టించుకోకపోవడం దారుణమన్నారు. పోతిరెడ్డిపాడు నుంచి వెలుగోడు రిజర్వాయర్‌కు నీరు నింపే సమయంలోనే సిద్ధాపురం చెరువుకూ నింపివుంటే పంటలు ఎండేవి కాదన్నారు. చెరువులో సగం టీఎంసీ నీరు లేకున్నా పది వేల ఎకరాలకు పారించానని ఎమ్మెల్యే చెప్పడం శోచనీయమన్నారు.
తెలుగుగంగ రిజర్వాయర్‌లోని మూడు టీఎంసీల నీరు ఇప్పిస్తే మహానంది, బండిఆత్మకూరు, వెలుగోడు మండలాల్లోని వరి పొలాలకు నీరు పారించి పంటలు ఎండిపోకుండా కాపాడతానని, మరి నీరిప్పించే ధైర్యం ఉందా అని సవాల్ విసిరారు. ఇందిరేశ్వరం, వడ్లరామాపురం గ్రామాలకు ఎత్తిపోతల పథకాలు మంజూరు చేయించి నీరు ఎందుకివ్వరని ప్రశ్నించారు. ఎలాంటి జీఓలు లేకుండా నెల్లూరు జిల్లా సోమశిలకు 50 టీఎంసీల నీరు తీసుకెళ్తున్నా బుడ్డా నోరు మెదపడం లేదన్నారు.
తాను, తన తమ్ముడు శిల్పా భువనేశ్వరెడ్డి అవినీతికి పాల్పడి ఉంటే అన్ని విషయాల్లో క్వాలిటీ కంట్రోల్ అధికారులతో విచారణ చేయించుకోవాలని సూచించారు. ఇక పవన్‌కల్యాణ్ వైఎస్ జగన్ గురించి మాట్లాడటం సరికాదన్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులు శిల్పా భువనేశ్వరరెడ్డి మాట్లాడుతూ తాము అక్రమాలకు పాల్పడాల్సిన అవసరం లేదన్నారు.
ప్రజాసేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చామని, దోచుకునేందుకు కాదని పేర్కొన్నారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ పట్టణ, మండల అధ్యక్షులు అంజాద్‌అలీ, దరగమ్మ, నాయకులు పార్వతి, లాలు, స్వామి, రమణమ్మ, జిలానీ, సుల్తాన్, తిమోతి, కలీముల్లా, ఫరూక్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment