
సాక్షి ప్రతినిధి, ఏలూరు : భీమవరం నియోజకవర్గ కన్వీనర్ గ్రంథి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆయన నివాసం నుండి కారుల్లో బయలుదేరిన నాయకులు, కార్యకర్తలను గ్రంథి శ్రీనివాస్ ఇంటి వద్దనే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట, వాగ్వివాదం నెలకొంది. పోలీసుల తీరును నిరసిస్తూ గ్రంథి శ్రీనివాస్, నాయకులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులు 31 మందిని ముందస్తుగా అరెస్టు చేశారు. సీపీఐ పట్టణ కార్యదర్శి ఎం.సీతారామప్రసాద్, సీహెచ్.రంగారావులను ముందస్తుగా అరెస్టు చేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షులు కరీముల్లా బాషాలను అరెస్టు చేశారు. ఏలూరులో చలో అసెంబ్లీ కార్యక్రమంలో పాల్గొనటానికి బయలుదేరిన సీపీఐ, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు సీపీఐ కార్యాలయం నుండి పవరుపేట రైల్వేస్టేషన్ వరకు ప్రదర్శనగా వెళ్తుండగా పోలీసులు అరెస్టు చేశారు.
జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్, సీపీఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్ నెక్కంటి సుబ్బారావు, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బండి వెంకటేశ్వరరావులను గృహ నిర్బంధం చేశారు. తాడేపల్లిగూడెంలో సీపీఐ పట్టణ కార్యదర్శి మండల నాగేశ్వరరావు, బోనం ధనలక్ష్మిలను పోలీసులు అరెస్టు చేశారు. తణుకు పట్టణానికి చెందిన సీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యులు కోనాల భీమారావు, జిల్లా కార్యవర్గ సభ్యులు బొద్దాని నాగరాజులను రాత్రి అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పోలవరం మండలం సీపీఐ కన్వీనర్ జమ్మి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి టి.ఆంజనేయులుని గృహనిర్బంధం చేసి సోమవారం అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
ఆచంట మండలంలో సీపీఐ కార్యదర్శి వైట్ల విద్యాధరరావును ముందస్తు చర్యగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నిడదవోలుకు చెందిన సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రేకా భాస్కరరావును గృహ నిర్బంధం చేసి అనంతరం అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సీపీఐ నాయకులు ఉండి మండల కార్యదర్శి కె.వెంకట్రావు, గణపవరం సీపీఐ కార్యదర్శి గంజిరాజు, మహిళా సమాఖ్య రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేతర లక్ష్మిలను అరెస్టు చేశారు.