దశాబ్ధాల తరబడి జిల్లా ప్రజలకు సాగు, తాగునీరు అందించిన చంపావతి నదికి గర్భశోకం కలుగుతోంది. అక్రమార్కుల స్వార్థం వల్ల నది కాస్తా కాలువ స్థాయికి దిగజారిపోతోంది. జిల్లా వ్యాప్తంగా సుమారు 150 గ్రామాలకు తాగునీరు, లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్న నదిపై కొంతమంది అక్రమార్కుల కన్ను పడింది. నదీ తీరంలో ఆక్రమణలు చేపట్టడంతో పాటు ఇసుక అక్రమ రవాణా వల్ల నది తన రూపం కోల్పోతోంది. ఇదే తీరు భవిష్యత్‌లో కొనసాగితే నది తన ఉనికినే కోల్పోనుంది.
మెంటాడ : చంపావతి నది జిల్లాకు ప్రధాన తాగునీటి వనరు. ఎన్నో దశాబ్ధాలుగా లక్షల ఎకరాలకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించిన నది నేడు కుచించుకుపోయింది. ఒకప్పుడు విశాలంగా కని పించిన చంపావతి నేడు కాలువలా మారిపోయింది. వివరాల్లోకి వెళితే.. జిల్లాలో సుమారు 65 కిలోమీటర్ల పొడవునా ప్రవహిస్తున్న నది విస్తీర్ణం రోజురోజుకూ తగ్గిపోతోంది. విశాఖపట్నం జిల్లా అనంతగిరి కొండల్లో పుట్టి మెంటాడ మండలం ఆండ్ర కొండల మీదుగా విజయనగరం జిల్లాలో 65 కిలోమీటర్ల పొడవునా ప్రవహిస్తోంది. ఆండ్ర కోట పక్క నుంచి మెంటాడ, గంగచోళ్లపెంట, గజపతినగరం, కొనిశ, గుర్ల, పూసపాటి రేగ, నెల్లిమర్ల, నడుపూరు, తదితర గ్రామాల మీదుగా ప్రవహిస్తూ చివరకు పూసపాటిరేగ మండలం కోనాడ వద్ద బంగాళాఖాతంలో కలుస్తోంది.
మెంటాడ మండలంలోని గుర్ల గెడ్డ ఆగూరు వద్ద చంపావతి నదిలో కలుస్తుంది. అలాగే గజపతినగరం మండలం లింగాలవలస సమీపంలో ఏడొంపుల గెడ్డ కూడా చంపావతి నదిలో కలుస్తున్నాయి. గెడ్డల కలరుుకతో ఉద్ధృతంగా ప్రవహించాల్సిన నది కొంతమంది అక్రమార్కుల చేతుల్లో పడి క్షీణించిపోతోంది. ఆక్రమణ ప్రదేశాల్లో వరి, టేకు, సరుగుడు, నీలగిరి, జీడి, మామిడి పంటలు సాగు చేస్తున్నారు. మెంటాడ, గజపతినగరం, నెల్లిమర్ల, పూసపాటిరేగ మండలాల్లోని ఆండ్ర, లోతుగెడ్డ, జగన్నాథపురం, పిట్టాడ, తమ్మిరాజుపేట, మెంటాడ, గజపతినగరం, మర్రివలస, గంగచోళ్లపెంట, తుమ్మికాపల్లి, లోగిశ,తదితర ప్రాంతాల్లో సుమారు వెయ్యి ఎకరాలకు పైబడి ఆక్రమణలు జరిగినట్లు అంచనా. ఇదే సమయంలో నదిలో ఇసుక అక్రమ రవాణా కూడా గణనీయంగా పెరిగింది.
ఈ రెండు కారణాల వల్ల భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. దీంతో చంపావతి నది చిన్న కాలువలా తయారైంది. ఈ నది నీటిపై ఆధారపడుతూ ఆండ్ర, పిట్టాడ, తమ్మిరాజుపేట, ఆగూరు, మెంటాడ, గజపతినగరం, బొండపల్లి, గుర్ల, డెంకాడ, పూసపాటిరేగ, నెల్లిమర్ల, గంట్యాడ మండలాల్లో తాగునీటి పథకాలు ఏర్పాటు చేశారు. సుమారు 150 గ్రామాల్లోని నాలుగు లక్షల మందికి తాగునీరు సరఫరా చేస్తున్నారు. అయితే ఆక్రమణలు మరింత పెరిగితే తాగునీటి సరఫరా కష్టమవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అలాగే వ్యవసాయూనికి సాగునీరు కూడా అందే పరిస్థితి ఉండదని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఆక్రమణలపై దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.
చంపావతికి గర్భశోకం
Published Tue, Mar 15 2016 1:29 AM | Last Updated on Sun, Sep 3 2017 7:44 PM
Advertisement