చంద్రబాబు క్షమాపణ చెప్పలేదు: వైఎస్ జగన్
మాజీ స్పీకర్ కుతూహలమ్మ బాధపడిన సందర్భంలో చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పనే లేదని ప్రతిపక్ష నాయకుడు, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. గురువారం నాడు ఆయన అసెంబ్లీలో సభాహక్కుల ఉల్లంఘన తీర్మానంపై చర్చలో పాల్గొని మాట్లాడారు. చంద్రబాబు క్షమాపణ చెప్పకపోవడం వల్లే ఆరోజు కుతూహలమ్మ సభ నుంచి ఏడుస్తూ బయటకు వెళ్లారన్నారు. కౌరవుల్లా వ్యవహరించారని కుతూహలమ్మే అన్నారని గుర్తుచేశారు. అయితే.. తమవైపు నుంచి ఇంకోసారి ఇలా జరగకుండా చూస్తామని, అది మా వ్యక్తిత్వమని చెప్పారు.
ఉప్పూ కారం చల్లేటప్పుడు అప్పుడేం చేశారో ఆలోచించాలని తెలిపారు. మధ్యలో మంత్రి అచ్చెన్నాయుడు కలగజేసుకుని.. వ్యక్తిగత విమర్శలు చేయడంతో, వక్రీకరణలు లేకుండా ఒక్క మాట కూడా మాట్లాడరని ఆయన అన్నారు. ఎదిగితే సరిపోదు... ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలని చెప్పారు. తమకు అటూ ఇటూ మాట్లాడటం చేతకాదని, తప్పు చేస్తే సారీ చెప్పడానికి నామోషీ లేదని, తాము స్ట్రైట్గానే మాట్లాడతామని వైఎస్ జగన్ చెప్పారు.