అనంతపురం అగ్రికల్చర్ : వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తానని ఎన్నికల ముందు గొప్పగా ప్రకటించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత ‘ఏరుదాటాక తెప్ప తెగలేసిన’ చందంగా వ్యవహరిస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సవాలక్ష షరతులు పెట్టడంతో జిల్లా రైతులు మొదటికే మోసపోయారు. కుటుంబానికి గరిష్టంగా రూ.లక్షన్నర, రూ.50 వేల లోపున్న రుణాలన్నీ ఒకేసారి మాఫీ అని చెప్పినా అవి కూడా అమలు కాకపోవడంతో అన్నదాతలు కంటతడి పెడుతున్నారు.
గత ఏడాది డిసెంబర్ 4న, ఈ ఏడాది మార్చి 28న రెండు విడతలుగా ప్రకటించిన రుణమాఫీ జాబితా చూసిన రైతులు నివ్వెరపోయారు. మాఫీలో ట్రిక్కులు చేయడంతో అసలెంత, వడ్డీ ఎంత, మాఫీ చేసిన మొత్తమెంత, ఇంకా ఎంత కట్టాలో ఏంటనే విషయం అర్థంకాకుండా పోయింది. 2013 డిసెంబర్ 31 నాటికి జిల్లా వ్యాప్తంగా 10,24,577 అకౌంట్ల పరిధిలో రూ.6,817.85 కోట్లు బ్యాంకుల్లో రైతుల అప్పులున్నాయి. ఇందులో 6,08,874 మందికి చెందిన రూ.3,093.06 కోట్ల పంట రుణాలు, 2,12,057 మంది బంగారు నగలు పెట్టి తీసుకున్న రుణాలు రూ.1,851.18 కోట్లు కాగా.. వ్యవసాయ అనుబంధ శాఖల పరిధిలో టర్మ్‌లోన్లు 2,03,646 మందికి చెందిన రూ.1,873.61 కోట్లు ఉన్నాయి. ఎన్నికల ముందు చెప్పినట్లు అన్ని రకాల వ్యవసాయ రుణాలు మాఫీ చేసే పరిస్థితి లేదని సీఎం కాగానే చంద్రబాబు ప్రకటించడంతో మొదట్లోనే లక్షలాది మంది రైతుల ఆశలు ఆవిరయ్యాయి.
కోటయ్య కమిటీ, కుటుంబంలో ఒక్కరికే రుణమాఫీ, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ లాంటి సవాలక్ష షరతులు విధించారు. నెలల తరబడి కసరత్తు చేసిన తరువాత ఎట్టకేలకు పంట, బంగారు రుణాలకు సంబంధించి కుటుంబానికి గరిష్టంగా రూ.లక్షన్నర, అది కూడా ఐదేళ్లలో ఐదు విడతల్లో మాఫీ చేస్తామని ప్రకటించారు. రూ.50 వేలలోపున్న రుణాలన్నీ ఒకేసారి మాఫీ చేస్తానని ఘనంగా ప్రకటించారు.
ప్రభుత్వం ప్రకటించినట్లుగా పంట, బంగారు రుణాలు 8,20,931 అకౌంట్ల పరిధిలోని రూ.4,944 కోట్లు మాఫీ కావాల్సి వుంది. తొలిజాబితా ప్రకారం 6,62,182 మందికి రుణమాఫీ చేశామని గొప్పగా ప్రకటించినా.. అందులో ఇప్పటికిప్పుడు మాఫీ అయ్యింది రూ.780 కోట్లే. ఐదేళ్ల పాటు 20 శాతం చొప్పున కచ్చితంగా మాఫీ చేస్తే రూ.2,234 కోట్లు రద్దవుతాయి. ఇటీవల విడుదల చేసిన రెండో జాబితా ప్రకారం 1,87,781 మందికి ఇప్పటికిప్పుడు రూ.289 కోట్లు మాఫీ అవుతుండగా.. ఐదేళ్లలో మొత్తం రూ.672 కోట్ల రుణాలు రద్దవుతాయి.
మొత్తమ్మీద రెండు జాబితాల ప్రకారం 8,49,963 మంది రైతులకు ఈ ఏడాది కేవలం రూ.1,070.04 కోట్లు మాఫీ కానున్నాయి. షరతుల ప్రకారం ఐదేళ్లు 20 శాతం చొప్పున అమలు చేస్తే రూ.2,907.22 కోట్ల రుణాలు రద్దవుతాయి. అంటే రుణమాఫీకి అర్హత ఉన్న రూ.4,944.24 కోట్లకు గానూ ఐదేళ్లలో రూ.2,907.22 కోట్లు మాఫీ అవుతాయి. ఈ లెక్కన రుణమాఫీకి నోచుకోని మొత్తం రూ.2,037.02 కోట్లు మిగిలిపోతుంది. ఈ మొత్తాన్ని ఎవరు మాఫీ చేస్తారనేది అంతుచిక్కని ప్రశ్న. అన్ని అర్హతలు ఉన్నా పైసా కూడామాఫీ కాని రైతులు సుమారు 1.50 లక్షల మంది ఉన్నారు.
‘మాఫీ’ అంతంతే..
Published Mon, Apr 20 2015 3:04 AM | Last Updated on Sat, Jul 28 2018 6:48 PM
Advertisement
Advertisement