తడిసి మోపెడు! | power all types of agricultural loans | Sakshi
Sakshi News home page

తడిసి మోపెడు!

Published Wed, Dec 17 2014 3:45 AM | Last Updated on Sat, Jul 28 2018 6:35 PM

తడిసి మోపెడు! - Sakshi

తడిసి మోపెడు!

సాక్షిప్రతినిధి, అనంతపురం : తాను అధికారంలోకి వస్తే అన్ని రకాల వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తానని చెప్పిన చంద్రబాబు.. సీఎం పీఠం ఎక్కాక మాట తప్పారని రైతులు వాపోతున్నారు. ఎన్నికలకు ముందు ఆయన జిల్లాలో పాదయూత్ర నిర్వహించినపుడు గుంతకల్లు బహిరంగ సభలో వేలాది జనం సాక్షిగా రుణ మాఫీ హామీ ఇచ్చారు. జిల్లాలో 10.24 లక్షల ఖాతాల్లో 6,817 కోట్ల రూపాయల వ్యవసాయ రుణాల బకాయిలు ఉన్నాయి.
 
 ఎన్నికల అనంతరం కేవలం పంట రుణాలు, బంగారు రుణాలు మాత్రమే మాఫీ చేస్తానన్నారు. ఈ లెక్క ప్రకారం జిల్లాలో 8.20 లక్షల ఖాతాల్లో రూ.4,994 కోట్ల రుణాలు మాఫీ చేయాలి. ఇందులో 3,093 కోట్ల పంట రుణాలు, 1,851 కోట్ల బంగారు రుణాలు ఉన్నాయి. ఈ మాటపై కూడా చంద్రబాబు నిలబడలేకపోయారు. ఒక్కో కుటుంబానికి రూ.1.50 లక్షల వరకూ మాఫీ చేస్తానని చెప్పారు. చివరకు ఆ మాటను కూడా నిలుపుకోలేక పలు దఫాల్లో మాఫీ చేస్తామంటూ సెలవిచ్చారు. రూ.50 వేల లోపు రుణాలను తొలిదశలో ఒకేసారి మాఫీ చేస్తామని చెప్పినా, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పేరుతో కోత వేయడం వల్ల అందులో పాతిక శాతం కూడా రుణం మాఫీ కాలేదని జిల్లా వ్యాప్తంగా రైతులు రగిలిపోతున్నారు.  
 
 రూ.780.16 కోట్లు మాత్రమే మాఫీ!
 జిల్లాలో 6.62 లక్షల ఖాతాలకు సంబంధించి 2,234.5 కోట్ల (డిసెంబర్ 2013 వరకు వడ్డీతో కలిపి) రూపాయల రుణాలను మాఫీ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం 50 వేల రూపాయలలోపు ఉన్న వారికి పూర్తిగా రుణమాఫీ చే సేందుకు, ఆపై ఉన్నవారికి తొలివిడతలో 20 శాతం డబ్బులు జమ చేసేందుకు 780.16 కోట్లు మంజూరు చేసింది.
 
 తక్కిన 1454.34 కోట్ల రూపాయల్లో ఏడాదికి 363.58 కోట్ల రూపాయల చొప్పున మాఫీ చేయనుంది. అయితే ఈ డబ్బు వస్తుందో రాదో నమ్మకం లేదు. ప్రభుత్వం చెల్లించిన 20 శాతం కాకుండా తక్కిన 80 శాతం అప్పును రైతులు, బ్యాంకులకు చెల్లించి రుణాలను రెన్యువల్ చేసుకోవాలని ప్రకాశం జిల్లా కొండపిలో సీఎం చంద్రబాబు చెప్పారు. అంటే ఇక రుణాలను చెల్లించలేనని చెప్పకనే చెప్పాడని రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ లెక్కన ‘అనంత’కు వచ్చే పంటల బీమా, ఇన్‌పుట్ సబ్సిడీ కంటే తక్కువగానే ప్రభుత్వం రుణమాఫీ చేసిందని రైతులు బాహాటంగా వ్యాఖ్యానిస్తున్నారు.
 
 స్కేల్ ఆఫ్ ‘మోసం’
 ప్రభుత్వం చెప్పినట్లు 50 వేల రూపాయలులోపు ఉన్నవారి రుణాలు పూర్తికా మాఫీ చేయలేదు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పేరుతో ఎన్నిరకాలుగా వీలైతే అన్ని రకాలుగా రైతన్నను దెబ్బతీసింది. ఉదాహరణకు బెళుగుప్ప మండలం ఎర్రగుడిలో యశోదమ్మ అనే మహిళా రైతు 3.25 ఎకరాలకు 2007లో రుణం తీసుకున్నారు. అప్పట్లో స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఎకరాకు రూ.5 వేలు మాత్రమే. 2007 నుంచి 2013 వరకూ రెన్యువల్ చేసుకున్నారు. రెన్యువల్ అంటే కొత్త రుణం అన్నమాట.
 
 2013లో ఈమె లక్ష రూపాయలు అప్పు తీసుకున్నారు. వడ్డీతో కలిపి 1.09,704 రూపాయలైంది. కానీ 2007 స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం 3.25 ఎకరాలకు 16,250 రూపాయలు మాత్రమే మాఫీ అయినట్లు ప్రభుత్వం లెక్క తేల్చింది. 50 వేల రూపాయల కంటే పైబడి డబ్బు ఉండటంతో తొలివిడతలో 3,565 రూపాయలు జమ చేస్తున్నట్లు, తక్కిన మొత్తాన్ని నాలుగు విడతల్లో మాఫీ చేస్తామని ప్రకటించింది.
 
 నిజానికి యశోదమ్మది కొత్త రుణం. ఎందుకంటే 2013 వరకూ 4 శాతం మాత్రమే వడ్డీ చెల్లించింది. 2013లో కూడా అదే లెక్క ప్రకారం రుణం తీసుకుంది. కొత్త రుణాలకు మాత్రమే ఈ వడ్డీకి రుణాలు ఇస్తారు. డీపాల్టర్ అయితే 14 శాతం వడ్డీ వసూలు చేస్తారు. మరి ప్రభుత్వం మాత్రం రుణమాఫీలో యశోదమ్మపై అన్యాయంగా వ్యవహరించింది. 2013 స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం ఎకరాకు రూ.12 వేల చొప్పున దాదాపు రూ.40 వేలు మాఫీ కావాల్సి ఉండగా ఇలా మోసం చేశారు. ప్రభుత్వం ఇలా ప్రతీ రైతునూ దెబ్బ తీసింది.
 
 మోయలేని వడ్డీ భారం
 ప్రభుత్వం తేల్చిన లెక్క ప్రకారం తమ రుణాలను రైతులు రెన్యువల్ చేసుకోవాలంటే రుణ మాఫీ సొమ్ము ఎప్పుడు ఖాతాల్లోకి జమ చేస్తుందో అప్పటి వరకూ 2014 జనవరి నుంచి వడ్డీ సొమ్ము చెల్లించాలి. దీంతోపాటు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం చెల్లుబాటు కాని రుణాల అసలుతో పాటు మొత్తం వడ్డీ కలిపి బ్యాంకులకు చెల్లించాలి. ఈ లెక్కన రైతులపై వడ్డీ భారం తడిసి మోపెడవుతుంది. రెండు, మూడేళ్ల కిందట రుణాలు తీసుకున్నవారు ఆ మేరకు వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. దీంతో రుణమాఫీ సంగతి దేవుడెరుగు ప్రభుత్వం రైతులను రుణ కూపంలోకి లాగిందని విశ్లేషకులు విమర్శిస్తున్నారు.
 
 రైతన్నలను నిలువునా ముంచారు
 జిల్లాలో పంట, బంగారు రుణాలు దాదాపు 5 వేల కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. దీంతో ప్రభుత్వం 223కోట్లు(వడ్డీతో కలిపి) మాత్రమే భరిస్తోంది. దీంతో రైతులు 2-3 ఏళ్ల నుంచి వడ్డీ భారం భరించాల్సి వస్తుంది. రైతులను రుణ విముక్తులను చేస్తానని చంద్రబాబు చెప్పాడు. కానీ వారిని పూర్తిగా రుణ ఊబిలోకి లాగాడు. ప్రభుత్వం తీసుకున్న అత్యంత దారుణ చర్య ఇది. రైతన్నలను వెన్నుపోటు పొడిచిన నేతగా చంద్రబాబు చరిత్రలో నిలిచిపోతారు.
 -  అనంత వెంకట్రామిరెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
 
 రైతులకు తీవ్ర అన్యాయం చేసింది
 రుణమాఫీ అంశంలో ప్రభుత్వం రైతులకు తీవ్ర అన్యాయం చేసింది. మాఫీపై పెట్టుకున్న ఆశలను అడియాశలు చేశారు. ‘అనంత’ రైతులు తీవ్ర కరువును ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో మళ్లీ రుణాలు చెల్లించడం, వడ్డీ భారం మోయడం మరింత సమస్యాత్మంగా మారింది. ‘అనంత’ను ఇతర జిల్లాలతో పోల్చకూడదు. రైతుల రుణాలను పూర్తిగా మాఫీ చేయాలి. రెన్యువల్, రీషెడ్యూల్ చేసుకోండని సీఎం చంద్రబాబు చెప్పడం సరికాదు. వెంటనే రైతులకు భరోసానిచ్చే ప్రకటన చేయాలి.   
 - గేయానంద్, ఎమ్మెల్సీ
 
 సర్వత్రా నిరసనే
 
 రైతుల నిరసన, అధికారుల నిలదీత మధ్య రైతు సాధికార సదస్సులు ముగిశాయి. ఈ నెల 10 నుంచి 16 వరకూ జిల్లా వ్యాప్తంగా సదస్సులు నిర్వహించారు. అసాధ్యం అనుకున్న రుణమాఫీ అంశాన్ని సుసాధ్యం చేశామని మంత్రి పరిటాల సునీత, చీఫ్ విప్ కాలువ శ్రీనివాసులతో పాటు అధికారపార్టీ నేతలు ఊదరగొట్టినా రైతులు మాత్రం ఎక్కడికక్కడ ప్రభుత్వ తీరుపై దుమ్మెత్తిపోశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎన్ని మాటలు చెప్పినా, తమకు ఏ మేరకు రుణ మాఫీ అయింది? ప్రభుత్వం ఏ ప్రాతిపదికన రుణ మాఫీలో కోత కోసింది.. అనే విషయూలు తెలుసుకుని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని పలు సభల్లో ఆగ్రహించారు. దీంతో చాలా చోట్ల రైతుసాధికార సదస్సులను అడ్డుకున్నారు. కొన్ని చోట్ల రుణమాఫీపై ‘ఇచ్చిన మాట ఒకటైతే.. ఆచరణలో చేసింది ఇంకోటి’అని నిలదీశారు. వాస్తవానికి ప్రజాప్రతినిధులు కూడా ‘అనంత’ రైతుల సంక్షేమాన్ని పట్టించుకోలేదు. మంత్రి పరిటాల సునీత రామగిరి మండలం గరిమేకలపల్లి సదస్సులో మాట్లాడుతూ.. జిల్లాలో 8.62 లక్షల మంది రైతులు రుణమాఫీ పొందారని ప్రకటించడం పరిశీలకులను ముక్కున వేలేసుకునేలా చేసింది. నిజానికి ప్రభుత్వ లెక్కల ప్రకారం జిల్లాలో 6.62 లక్షల ఖాతాలే రుణమాఫీకి అర్హత సాధించాయి. వీరికి కేవలం 780.16 కోట్లు మాత్రమే రుణమాఫీ సొమ్ముగా ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేయనుంది.
 
 స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ గురించి రైతులు చాలాచోట్ల నిలదీశారు. ప్రభుత్వం రైతుల శ్రేయస్సుపై చిత్తశుద్ధితోనే వ్యవహరించిందని, బ్యాంకర్లే రైతులకు అన్యాయం చేస్తున్నారనే ధోరణిలో మంత్రి చెప్పకొచ్చారు. అయితే ప్రభుత్వం రుణమాఫీ సొమ్ము ఇస్తే బ్యాంకర్లు ఎందుకు అడ్డుపడతారు అని సదస్సులో చాలామంది రైతులు మంత్రి వ్యాఖ్యలను తప్పుబట్టారు.
 
 చాలా సదస్సుల్లో టీడీపీ నేతలు కూడా పూర్తి నిరుత్సాహంగా కన్పించారు. టీడీపీ కార్యకర్తలు కూడా రుణమాఫీపై పెట్టుకున్న ఆశలు అడియాశలయ్యాయి. లక్ష రూపాయలు రుణం ఉన్నవారికి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అంటూ 15-25 వేల రూపాయలే మాఫీ కావడం, ఆ మొత్తంలో కూడా 20 శాతం ఇచ్చి తక్కిన మొత్తాన్ని నాలుగేళ్లలో ఇస్తామని చంద్రబాబు ప్రకటించడంతో టీడీపీ కార్యకర్తలు కూడా తమ అధినేతపై అంతర్గతంగా మండిపడుతున్నారు. రుణ మాఫీకి కేటారుుంచిన సొమ్మును రైతు సాధికార సంస్థకు బదిలీ చేశామంటున్న ముఖ్యమంత్రి.. ఆ డబ్బులను జనవరి 23 తర్వాత ఖాతాల్లో జమ చేస్తామని అంటున్నారని, అంత వరకూ అయ్యే వడ్డీని ఎవరు కడతారని రైతులు ప్రశ్నిస్తున్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement