ఓట్లేయించుకుని మాట మారుస్తారా?
అనంతపురం ఎడ్యుకేషన్ : రుణాలన్నీ మాఫీ చేస్తామని చెప్పి ఓట్లు వేయించుకుని.. గద్దెనెక్కిన తర్వాత మాట మారుస్తారా అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై డ్వాక్రా మహిళలు, రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీపై రాష్ర్ట ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన ‘నరకాసుర వధ’ రెండో రోజు శుక్రవారం కూడా కొనసాగింది. జిల్లా వ్యాప్తంగా ర్యాలీలు, ధర్నాలు, సీఎం దిష్టిబొమ్మలను దహనం చేశారు.
విధివిధానాల కోసం కోటయ్య కమిటీని వేసి రెండు నెలలు కాలయాపన చేసి.. ఇప్పుడు కుటుంబానికి లక్షన్నర లోపు రుణం మాఫీ చేస్తామని ప్రకటించడం రైతులను మోసం చేయడమేనని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మాలగుండ్ల శంకరనారాయణ గోరంట్లలో నిర్వహించిన ‘నరకాసుర వధ’లో అన్నారు. డ్వాక్రా రుణాలు పూర్తిగా మాఫీ చేస్తానని ఇప్పుడు ఒక్కో గ్రూపునకు లక్ష రూపాయలు ఇస్తామంటున్నారని, ఆ మొత్తం వడ్డీకి కూడా సరిపోదన్నారు. ఎన్నికల సమయంలో చేనేత కార్మికుల రుణాలూ మాఫీ చేస్తానని నమ్మబలికిన చంద్రబాబు ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదని మండిపడ్డారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు గంపల వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు.
రైతులు, మహిళల రుణాలు రద్దు చేయకుండా, విద్యార్థుల ఫీజు బకాయిలు చెల్లించకుండా సీఎం అందరినీ మోసం చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర కమిటీ అధ్యక్షుడు రంగంపేట గోపాల్‌రెడ్డి నిప్పులు చెరిగారు. వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో అనంతపురంలో చంద్రబాబు దిష్టిబొమ్మతో నిరసన ప్రదర్శన నిర్వహించి సప్తగిరి సర్కిల్‌లో దహనం చేశారు. విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధానకార్యదర్శి బండి పరశురాం, పార్టీ మహిళా విభాగం నగర అధ్యక్షురాలు శ్రీదేవి, యువజన విభాగం నగర కమిటీ అధ్యక్షుడు మారుతీ నాయుడు పాల్గొన్నారు.
గుంతకల్లు నియోజకవర్గంలోని గుత్తిలో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ గోవర్ధన్‌రెడ్డి, మాజీ సర్పంచు పీరా, మార్కెట్ యార్డు చెర్మైన్ మల్లయ్య యాదవ్ ఆధ్వర్యంలో గాంధీ చౌక్ వద్ద రాస్తారోకో చేశారు. అనంతరం సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఉరవకొండలో టవర్‌క్లాక్ వద్ద చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు సుశీలమ్మ, ఉరవకొండ, విడపనకల్లు జెడ్పీటీసీ సభ్యులు లలితమ్మ, తిప్పయ్య పాల్గొన్నారు. కూడేరులో చంద్రబాబు దిష్టిబొమ్మను ఊరేగించిన అనంతరం అనంతపురం-బళ్లారి ప్రధాన రహదారిపై దహనం చేశారు. కూడేరు జెడ్పీటీసీ నిర్మలమ్మ, ఎంపీపీ మహేశ్వరి, వైస్ ఎంపీపీ రాజశేఖర్, పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు మాదన్న పాల్గొన్నారు.
కదిరి నియోజకవర్గ పరిధిలోని తలుపులోలో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ శంకర ఆధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో మండల యూత్ కన్వీనర్ ఉత్తారెడ్డి, నూతనకాలువ ఎంపీటీసీ మల్లినాయుడు పాల్గొన్నారు.
మడకశిర నియోజకవర్గంలోని అగళిలో సీఎం దిష్టిబొమ్మను ఊరేగించి.. దహనం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ స్టూడియో శ్రీనివాస్, నాయకులు డాక్టర్ దేవరాజు పాల్గొన్నారు. రైతులు, డ్వాక్రా మహిళలు, చేనేత కార్మికుల అన్ని రకాల రుణాలూ మాఫీ చేయాలని కోరుతూ అమరాపురం తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు వాగేష్, త్రిలోక్‌నాథ్ తదితరులు పాల్గొన్నారు.
పెనుకొండలో సీపీఐ ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళలు ర్యాలీ, మానవహారం, రోడ్డు దిగ్బంధం, చంద్రబాబు దిష్టి బొమ్మ దహనం చేశారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు వడ్డే శ్రీరాములు, వజ్రం వెంకటేష్. వెంకటరాముడు పాల్గొన్నారు. సోమందేపల్లి తహశీల్దారు కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ నారాయణస్వామి, సర్పంచు వెంకటరత్నం బీసీ, మైనార్టీ సెల్ కన్వీనర్లు రామాంజినేయులు, నజీర్ పాల్గొన్నారు.