సర్కారు వాత..అప్పుల మోత! | government crash! | Sakshi
Sakshi News home page

సర్కారు వాత..అప్పుల మోత!

Published Thu, Feb 19 2015 3:51 AM | Last Updated on Sat, Jul 28 2018 6:48 PM

government crash!

 టీడీపీ ప్రభుత్వాన్ని గద్దెనెక్కిస్తే అప్పులన్నీ మాఫీ అవుతాయనుకున్న అన్నదాత ఘోరంగా మోసపోయాడు. సవాలక్ష షరతులతో, అడ్డగోలు నిబధనలతో అరకొర మొత్తం మాఫీ చేసిన సర్కారు.. పండుగ చేసుకోండని చెబుతోంది. పాత రుణం మాఫీ కాక, రెన్యూవల్ చేసుకోలేక, కొత్త అప్పు పుట్టక రైతులు విలవిల్లాడుతుంటే ఆదుకోవాల్సిన పాలకులు చోద్యం చూస్తున్నారు.
 
 అనంతపురం అగ్రికల్చర్ : ‘అనంత’ అన్నదాత అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. చంద్రబాబునాయుడు సర్కారు అవలంభించిన రైతు వ్యతిరేక విధానాల వల్ల మునుపెన్నడూ లేని విధంగా జిల్లాలో రైతులు అత్యంత దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. రైతుకు పెద్దపీట వేస్తామంటూ ఎన్నికల ముందు గొప్పలు చెప్పడంతో చంద్రబాబును నమ్మిన రైతులు ఇపుడు నట్టేట మునిగే పరిస్థితి నెలకొంది.
 
  వ్యవసాయ రుణాలు మాఫీ కాలేదు కదా... తరువాత ప్రకటించిన విధంగా కుటుంబానికి కనీసం రూ.లక్షన్నర కూడా మాఫీ కాలేదు. తొలి సంతకమంటూ ఊరించిన రాష్ట్ర సర్కారు అధికారంలోకి వచ్చిన ఏడు నెలలకు గానీ రుణమాఫీ అమలుకు దిగలేదు. అదీ అడ్డగోలు నిబంధనలు, సవాలక్ష షరతులు పెట్టి డిసెంబర్‌లో అరకొరగా అమలులోకి తీసుకువచ్చారు. ప్రభుత్వం విడుదల చేసిన రుణమాఫీ తొలి జాబితాను చూసి ‘అనంత’ అన్నదాతలు ఖంగుతిన్నారు.
 
  రూ.50 వేల లోపున్న రుణాలు అందరివీ మాఫీ అని చెప్పినా సగం మంది రైతులకు కూడా న్యాయం జరగలేదు. రూ.50 వేల పైబడి ఉన్న రుణాల్లో ఐదు విడతల్లో మాఫీ అంటూ తొలి జాబితాలో 20 శాతం మాఫీ చేశారు. అయితే ఇప్పటికీ రుణమాఫీ ఎవరికి ఎంత మొత్తం మాఫీ అయిందో తెలియని పరిస్థితి నెలకొంది. జిల్లాలో 2013 డిసెంబర్ 31వ తేదీ నాటికి పంట రుణాలు, బంగారు నగలు తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలు రూ.4,944 కోట్లు ఉన్నాయి. ఇవన్నీ మాఫీ కింద అర్హత పొందాయి. అయితే తొలి జాబితా ప్రకారం 6.62 లక్షల అకౌంట్ల పరిధిలో కేవలం రూ.780 కోట్లు మాఫీ అయ్యాయి. దీంతో అతికొద్ది మందికి మాత్రమే ఉపశమనం లభించగా తక్కిన లక్షలాది మంది రైతులకు వడ్డీకి కూడా సరిపోలేదు. రూ.4,944 కోట్ల రుణాలపై ప్రస్తుతమున్న వడ్డీ శాతం ప్రకారం రూ.700 కోట్ల వరకు వడ్డీ చెల్లించాల్సి వుంటుందని బ్యాంకర్లు చెబుతున్నారు.
 బ్యాంకర్ల రుణ ప్రణాళిక ఘోరంగా విఫలం
 చంద్రబాబు నాయుడు ప్రకటించిన రుణ మాఫీ పథకం నేపథ్యంలో బ్యాంకర్లు పెట్టుకున్న 2014-15 వార్షిక రుణ ప్రణాళిక ప్లాఫ్ అయ్యింది. రుణ మాఫీ మాయాజాలంలో ఇరుక్కుపోయిన రైతులను బ్యాంకర్లు కూడా దూరం పెట్టడంతో ‘అనంత’ అన్నదాత ఆర్థికంగా చితికిపోయాడు. ఓ పక్క ఖరీఫ్, రబీ పంటలు భారీ నష్టాలు తెచ్చిపెట్టగా మరోవైపు ప్రభుత్వం నుంచి ఏ మాత్రం సాయం లేకపోవడంతో రైతు బతుకులు దుర్భరంగా తయారయ్యాయి. పంట పెట్టుబడులు, కుటుంబ పోషణ కోసం ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు చేసిన అప్పులు తీర్చలేక మరోవైపు కొత్త అప్పులు పుట్టక రైతు జీవనయానం కష్టమైపోయింది. ఇన్‌పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ అందక, రుణమాఫీ కాక రైతు ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి.
 
  ఫలితంగా ఆత్మస్థైర్యం కోల్పోయిన రైతులు అర్ధంతరంగా తనువు చాలిస్తుంటే మనోధైర్యం నింపే చర్యలు చేపట్టకపోవడం దారుణం. ఈ ఏడాది ఖరీఫ్, రబీలో రైతులకు రూ.3,315 కోట్ల రుణాలు పంపిణీ చేస్తామని గొప్పగా ప్రకటించారు. అందులో ఖరీఫ్ కింద రూ.2,764 కోట్లు పంపిణీ చేయాల్సివుండగా రూ.373 కోట్లు ఇచ్చారు. బంగారు నగలు తాకట్టు పెట్టుకుని మరో రూ.261 కోట్లు పంపిణీ చేశారు.  రబీలో పెట్టుకున్న రూ.551 కోట్ల లక్ష్యాన్ని అధిగమించారు.
 
 డిసెంబర్‌లో రుణమాఫీ జాబితా విడుదల కావడంతో కొందరు రైతులు రెన్యూవల్ చేసుకోవడం వల్ల రబీ ప్రణాళిక లక్ష్యం చేరుకున్నారు. లేదంటే పరిస్థితి మరింత ఘోరంగా ఉండేది. జిల్లాలో 7.71 లక్షల మంది రైతులు ఉండగా ఖరీఫ్‌లో కేవలం 1.49 లక్షల మంది రైతులు మాత్రమే బ్యాంకు మెట్లు ఎక్కారు. రుణమాఫీ జాబితా విడుదలయ్యాక మరో 1.72 లక్షల మంది పంట రుణాల రెన్యువల్, బంగారు నగలు తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్నారు. మిగిలిన నాలుగున్నర లక్షల మంది రైతులు చేతిలో చిల్లిగవ్వ లేక పడుతున్న అవస్థలు వర్ణనాతీతం.
 
 ఇదేం రుణ మాఫీ?
 కెనరా బ్యాంక్‌లో నేను 45 వేల రూపాయలు పంట రుణం తీసుకున్నాను. పైసా కూడా మాఫీ కాలేదు. పంట రుణం మాఫీ వుతుందని భావించినా నిరాశే మిగిలింది. ఎవరికి మాఫీ అయ్యిందో ఎవరికి కాలేదో అర్థం కాని పరిస్థితి నెలకొంది. అన్ని విధాలుగా రైతులను మోసం చేసే చర్య ఇది. అనేక మంది రైతులు తీసుకున్న రుణం రూ.50 వేలు లోపే ఉన్నా చాలా మందికి మాఫీ కాలేదు. ఈ పరిస్థితిలో బ్యాంకు వద్దకు వెళ్లలేక ప్రైవేట్ వ్యక్తుల వద్ద రూ.40 వేలు వడ్డీకి తేవాలనుకుంటున్నాను. అప్పు ఇవ్వడానికి కూడా పలువురు వెనకాడుతున్నారు.
 - సత్యనారాయణ, రైతు, పెద్దకోడిపల్లి,
  రొద్దం మండలం
 
 నమ్మించి నట్టేట ముంచారు..
 నేను రూ.13 వేలు పంట రుణం తీసుకున్నా. ఒక్క రుపాయి కూడా మాఫీ కాలేదు. రుణమాఫీకి అన్ని విధాల అర్హులమైనా మాకు న్యాయం జరగలేదు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. రూ.50 వేల లోపు మాఫీ చేస్తామని చెప్పారు. అదీ సక్రమంగా చేయలేదు. మాఫీ వర్తించకూడదని కొర్రీలు వేస్తున్నారు. ఎన్నెన్నో నిబంధనలు పెడుతున్నారు. నమ్మించి నట్టేట ముంచారు. చంద్రబాబు ఇలా చేస్తాడని అనుకోలేదని ఆ పార్టీ వాళ్లే గుర్రుమంటున్నారు. రైతులను ఇప్పటికైనా ప్రభుత్వం ఆదుకోవాలి. పంట కోసం ఇపుడు బయట ఎవరి వద్ద అయినా అప్పు తెచ్చుకోవాలి. ఏం ప్రభుత్వమో ఏమో.
 - ఎర్రప్ప, రైతు, పెద్దకోడిపల్లి, రొద్దం మండలం
 

Related News By Category

Related News By Tags

Advertisement