సాక్షి ప్రతినిధి, అనంతపురం : ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కే క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఆ పార్టీ శాసనసభ్యులు, శ్రేణుల మనోభిప్రాయాలను ఖాతరు చేయడం లేదు. జేసీ బ్రదర్స్‌కు టీడీపీ తీర్థం ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పనిలో పనిగా రాయదుర్గం టికెట్‌ను దీపక్‌రెడ్డికి ఇవ్వమని తేల్చి చెప్పారు. ఆ స్థానం నుంచి ఉషారాణిని బరిలోకి దింపుతామనే సంకేతాలు పంపారు. సీనియర్ నేత ఉన్నం హనుమంతరాయచౌదరికీ చంద్రబాబు ఝలక్ ఇచ్చారు. కళ్యాణదుర్గం నుంచి మాజీ ఎంపీ కాలవ శ్రీనివాసులను బరిలోకి దింపుతామనే సంకేతాలు బలంగా పంపారు. టీడీపీ అధినేత చంద్రబాబు మంగళవారం తీసుకున్న నిర్ణయాలపై ఆ పార్టీ శ్రేణులు భగ్గుమంటున్నాయి.
వివరాల్లోకి వెళితే.. కాంగ్రెస్ సీనియర్ నేత జేసీ దివాకర్‌రెడ్డి, జేసీ ప్రభాకర్‌రెడ్డి టీడీపీలో చేరడానికి చాలా రోజులుగా ప్రయత్నిస్తున్న విషయం విదితమే. ఈ అంశంపై ఆ పార్టీ శ్రేణులు నిలదీస్తే.. అలాంటిదేమీ లేదంటూ చంద్రబాబు ఇన్నాళ్లూ దాటవేస్తూ వచ్చారు. మంగళవారం గుట్టును రట్టు చేశారు. హైదరాబాద్‌లో అసెంబ్లీలోని టీడీఎల్పీ కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా ఎమ్మెల్యేలు పయ్యావుల కేశవ్, పరిటాల సునీత, బీకే పార్థసారథి, అబ్దుల్‌ఘని, పల్లె రఘునాథరెడ్డి, కందికుంట ప్రసాద్, ఎమ్మెల్సీ మెట్టు గోవిందరెడ్డి, మాజీ ఎంపీ కాలవ శ్రీనివాసులు తదితరులతో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పదేళ్లుగా విపక్షంలో ఉండటం వల్ల పార్టీ ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని ఆయన చెప్పుకొచ్చారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కేందుకు జేసీ బ్రదర్స్‌ను టీడీపీలోకి తీసుకోవాలని నిర్ణయించామని.. అభిప్రాయాలు తెలపాలని కోరారు. ఈ
ప్రతిపాదనపై పరిటాల సునీత భగ్గుమన్నారు. మూడు దశాబ్దాలుగా టీడీపీ శ్రేణులపై దాడులు చేస్తూ.. హింసించిన జేసీ బ్రదర్స్‌ను పార్టీలోకి ఎలా తీసుకుంటారంటూ చంద్రబాబును నిలదీసినట్లు టీడీపీ వర్గాలు వెల్లడించాయి. ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా.. పరిస్థితిని అర్థం చేసుకోవాలని ఆమెను అనునయించేందుకు విఫలయత్నం చేశారు.
వెనక్కి తగ్గని చంద్రబాబు
జేసీ బ్రదర్స్ చేరికపై జిల్లా నేతలను ఒప్పించే బాధ్యతను రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌కు చంద్రబాబు అప్పగించారు. ఆ తర్వాత రంగంలోకి దిగిన సీఎం రమేష్ జిల్లా నేతలతో విడివిడిగా సమావేశమయ్యారు. జేసీ బ్రదర్స్‌కు పార్టీ తీర్థం ఇచ్చేలా ఒప్పించే యత్నం చేశారు. ఇదే సందర్భంలో పయ్యావుల కేశవ్‌ను పరిటాల సునీత తీవ్ర స్థాయిలో నిలదీసినట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. జేసీ బ్రదర్స్‌ను టీడీపీలోకి తేవడంలో మీరే ప్రధాన పాత్ర పోషిస్తున్నారంటూ పయ్యావుల కేశవ్‌పై పరిటాల సునీత ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ఆ పార్టీ శ్రేణులు తెలిపాయి.
ఇందుకు కేశవ్ స్పందిస్తూ.. ఇందులో తన పాత్రేమీ లేదని అంతా చంద్రబాబు ఇష్టమని స్పష్టీకరించినట్లు సమాచారం. సీఎం రమేష్ అభిప్రాయాలను సేకరించిన తర్వాత జిల్లా నేతలతో చంద్రబాబు మరో మారు సమావేశమయ్యారు. అనంతపురం లోక్‌సభ స్థానం, తాడిపత్రి శాసనసభ స్థానం, మరో రెండు ఎమ్మెల్యే టికెట్లు ఇస్తేనే టీడీపీలో చేరుతామని తొలుత జేసీ బ్రదర్స్ షరతు విధించినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. కానీ.. ఆ షరతుకు చంద్రబాబు అంగీకరించలేదు. అనంతపురం లోక్‌సభ, తాడిపత్రి అసెంబ్లీ స్థానాలను మాత్రమే జేసీ బ్రదర్స్‌కు ఇచ్చేందుకు అంగీకరించారు.
ఈ అంశంపై టీడీపీ ఎమ్మెల్యేల వ్యతిరేకతను చంద్రబాబు పట్టించుకోలేదు. ఇదే అంశాన్ని ‘ఫోన్’లో జేసీ బ్రదర్స్‌కు చంద్రబాబు వెల్లడించినట్లు టీడీపీ వర్గాలు పేర్కొన్నాయి. చంద్రబాబు ప్రతిపాదనకు జేసీ బ్రదర్స్ సైతం అంగీకరించినట్లు ఆ వర్గాలు తెలిపాయి. ఈనెల 23న గానీ 24న గానీ జేసీ బ్రదర్స్ తమ వర్గీయులతో టీడీపీ తీర్థం పుచ్చుకుంటారని ఆ పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే ఒకరు ‘సాక్షి’కి వెల్లడించారు. చంద్రబాబు నిర్ణయంపై పరిటాల సునీత వర్గీయులు ఎలా స్పందిస్తారన్నది తేలాల్సి ఉంది.
దీపక్, ఉన్నంలకు చెక్..
అనంతపురం లోక్‌సభ, తాడిపత్రి అసెంబ్లీ సీట్ల ప్యాకేజీకే జేసీ బ్రదర్స్ అంగీకరించడంతో రాయదుర్గం స్థానంపై జేసీ ప్రభాకర్‌రెడ్డి అల్లుడు దీపక్‌రెడ్డి పెట్టుకున్న ఆశలు అడియాశలయ్యాయి. రాయదుర్గం స్థానాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ దీపక్‌రెడ్డికి కేటాయించవద్దని ఎమ్మెల్సీ మెట్టు, మాజీ ఎంపీ కాలవ.. చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చారు. ఆ స్థానాన్ని ఉషారాణికి కేటాయించాలని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు చంద్రబాబు సూత్రప్రాయంగా అంగీకరించారు. రాయదుర్గం అసెంబ్లీ స్థానం నుంచి ఉషారాణినే బరిలోకి దింపుతామంటూ చంద్రబాబు బలమైన సంకేతాలు పంపారు. ఈ క్రమంలోనే కాలవ శ్రీనివాసులును ఎక్కడి నుంచి బరిలోకి దింపాలనే చర్చ వచ్చింది.
అనంతపురం లోక్‌సభ స్థానాన్ని రెడ్డి సామాజిక వర్గానికి కేటాయించనున్న నేపథ్యంలో.. ఆ లోక్‌సభ స్థానం పరిధిలోని కనీసం మూడు శాసనసభ స్థానాల నుంచి బీసీలను బరిలోకి దించాలనే ప్రతిపాదనకు చంద్రబాబు అంగీకరించారు. గుంతకల్లు, రాయదుర్గం, కళ్యాణదుర్గంలలో బీసీలనే బరిలోకి దించుతామని ఆయన ప్రకటించారు. అంటే.. కళ్యాణదుర్గంలో సీనియర్ నేత ఉన్నం హనుమంతరాయ చౌదరికి ఝలక్ ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. ఆ స్థానం నుంచి మాజీ ఎంపీ కాలవ శ్రీనివాసులును బరిలోకి దింపుతామని చంద్రబాబు పరోక్షంగా సంకేతాలు పంపినట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.
తలుపు తీసిన బాబు !
Published Wed, Jan 8 2014 3:42 AM | Last Updated on Sat, Jul 28 2018 6:33 PM
Advertisement
Advertisement