
'నీచ రాజకీయాలకు చంద్రబాబు కేంద్రబిందువు'
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నీచ రాజకీయాలకు కేంద్ర బిందువని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి విమర్శించారు.
అనంతపురం: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నీచ రాజకీయాలకు కేంద్ర బిందువని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి విమర్శించారు. చంద్రబాబు చేపట్టబోయే బస్సు యాత్రను ఉద్దేశించి ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఆయన చేయనున్న యాత్రను ప్రజలే ప్రతిఘటిస్తారన్నారు. చంద్రబాబు చేసే యాత్రలో జరిగే గొడవలను వైఎస్సార్ సీపీపై నెట్టాలని టీడీపీ భావిస్తోందని రామచంద్ర రెడ్డి అన్నారు.
వచ్చే నెల 1 నుంచి దాచేపల్లి మండలం పొందుగల గ్రామం నుంచి బస్సుయాత్ర చేపడతారని టీడీపీ నేతలు ప్రకటించిన నేపథ్యంలో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముందు ప్రకటించిన యాత్ర కాస్తా వెనక్కి పోవడంతో ..తాజాగా ప్రకటించిన యాత్ర ఎంతవరకూ ముందుకు వెళుతుందన్న విషయం చర్చనీయాంశమైంది.
సీమాంధ్రలో ఆగస్టు 25వ తేదీ నుంచి బస్సుయాత్రను చేపడుతున్నట్లు ముందుగా చంద్రబాబు ప్రకటించినా అనివార్య కారణాల వల్ల వాయిదా వేశారు. ఓ దశలో ఎలాగైనా యాత్రను చేపట్టేద్దామని నిర్ణయించుకున్న బాబుకు సీమాంధ్ర నేతలు అసలు సంగతి చెప్పి రెండు కళ్ల సిద్ధాంతం వికటించిందని కళ్లు తెరిపించారు. దీంతో బాబు బస్సు యాత్రకు బ్రేక్ పడింది. తొలుత ప్రకటించిన షెడ్యల్ ప్రకారం విజయనగరం జిల్లా కొత్త వలస నియోజకవర్గం నుంచి రోడ్ షోను ఆరంభించాల్సి ఉంది.