వరంగల్: బ్రాండ్ ఇమేజ్, ప్రచారం కోసమే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి విమర్శించారు. హన్మకొండలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. హన్మకొండలో శనివారం జరిగిన కాంగ్రెస్ కృతజ్ఞత సభ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో టీడీపీ, కేంద్రంలో బీజేపీ ప్రధాన ప్రతిపక్షాలుగా బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. తెలంగాణ ఏర్పాటుపై జీవోఎంకు ఆ రెండు పార్టీలు అభిప్రాయాలు చెప్పకుండా వ్యవహరిస్తున్న తీరును రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారన్నారు. వాటి మధ్య రహస్య ఒప్పందం కుదిరిందని తెలిపారు.
ఓట్లు, సీట్లు కోసమే బాబు తాపత్రయ పడుతున్నారని, రానున్న రోజుల్లో ఆయన పార్టీకి ప్రతిపక్ష స్థానం కూడా దక్కదని జోస్యం చెప్పారు. రచ్చబండ ఫ్లెక్సీల్లో సీఎం కిరణ్ ఫొటో ఉండడంపై సొంత పార్టీ ఎంపీల నుంచి వ్యతిరేకత వస్తుంది కదా.. అని విలేకరుల అడిగిన ప్రశ్నలకు అధిష్టానం చూసుకుంటుందని ఆయన సమాధానం దాటవేశారు.