సాక్షి, కాకినాడ :
‘టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఒక తీవ్రవాదిలా తయారయ్యారు. అమెరికాలోని ట్విన్ టవర్స్ కూల్చివేసిన ఒసామా బిన్‌లాడెన్‌తో చంద్రబాబును పోల్చాల్సిన అవసరం ఉంది. ట్విన్ టవర్స్‌ను కూల్చివేసి బిన్‌లాడెన్ అమెరికాను అతలాకుతలం చేస్తే రాష్ర్ట విభజనకు అనుకూలంగా రెండు లేఖలు ఇచ్చి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌ను అతలాకుతలం చేశాడ’ంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాకినాడ సిటీ తాజా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాకినాడలో మంగళవారం విలేకర్లతో మాట్లాడుతూ రెండుకళ్ల సిద్ధాంతంతో ముందుకు పోతున్న బాబుకు రాష్ర్ట ప్రజలు రెండుకళ్లూ పీకేసే రోజు దగ్గర్లోనే ఉందన్నారు.
‘షర్మిల జై సమైక్యాంధ్ర అన్నారు. జగన్‌మోహ న్ రెడ్డి, వైఎస్ విజయమ్మ రాష్ర్టం సమైక్యంగా ఉంచాలన్న డిమాండ్‌తో ఆమరణ నిరాహార దీక్షలు చేశారు. మా ఎంపీలు, ఎమ్మెల్యేలు స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామాలు ఇచ్చి పవిత్రంగా ఉద్యమంలో పాల్గొంటున్నారు. లేఖలతో రాష్ర్ట విభజనకు కారకులైన మీరు మాత్రం ఇప్పుడు ఆత్మగౌరవ యాత్రంటూ ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తుండడం ఎంతవరకు సమంజసం’ అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ప్రక్రియ మొదలవుతుందని కేంద్రం ప్రకటిస్తే రెండ్రు రాష్ట్రాల్లో తెలుగుదేశం ఉంటుందనే భావనతో ఒక రాష్ర్టంలో లోకేష్, మరో రాష్ర్టంలో తాను ముఖ్యమంత్రి అవుదామనే ఆశతో బాబు కాంగ్రెస్ అధిష్టానంతో ఒప్పందం కుదుర్చుకున్నాడని ఆరోపించారు. సీమాంధ్రులు రోడ్డెక్కి 50 రోజులైంది. ఉద్యోగస్తులు సమ్మె చేపట్టి 40 రోజులవుతోంది. ఉద్యోగుల తరఫునో, సీమాంధ్ర ప్రజల కష్టాల కోసమో ఢిల్లీ పెద్దలతో మాట్లాడకుండా జగన్ ఆస్తులు, కేసుల విషయమై మాట్లాడేందుకు ఎంపీలను పంపడం శోచనీయమన్నారు.
నాలుగు రెట్లు ఇస్తాం.. మీ ఆస్తులు రాసిస్తారా?
‘మీరు ప్రకటించిన రూ.62.20 కోట్ల విలువైన ఆస్తులకు నాలుగు రెట్లు మేము అడుక్కొనైనా మీకిస్తాం. మీ ఆస్తులు మాకు రాసిచ్చేస్తారా’ అని ద్వారంపూడి చంద్రబాబుకు సవాల్ విసిరారు. తానో సత్యహరిశ్చంద్రునిలా తన వ్యక్తిగత ఆస్తి రూ.42 లక్షలు మాత్రమేనని, తన భార్య భువనేశ్వరికి రూ.42 కోట్లు, కుమారుడు లోకేష్‌కు రూ.9.20 కోట్లు, బ్రాహ్మణికి రూ.3.30 కోట్లు అంటూ మొత్తం కుటుంబ ఆస్తి కేవలం 62.20 కోట్లు మాత్రమేనంటూ ప్రకటించడం ఎవర్ని మోసగించడానికని ఆయన ప్రశ్నించారు. మీ కోడలు బ్రాహ్మణికి రూ.9.90 లక్షల విలువైన బంగారు ఆభరణాలు మాత్రమే ఉన్నాయని ప్రకటించారు. తన చెల్లెలు వివాహానికి బ్రాహ్మణి వేసుకున్న వస్తువులను టీవీ చానల్స్ అన్నీ చూపించాయి. విశ్లేషణలు కూడా చేశాయి. వాటి విలువ ఎంతో మీకు తెలియకపోతే మాకిస్తే విలువ కట్టిస్తాం అని చంద్రశేఖర రెడ్డి అన్నారు. మీ ఆస్తులు ప్రకటించమని మిమ్మల్ని ఎవరు అడిగారు. ఈ మోసపూరిత ప్రకటనలు చేయడం ఎందుకని ప్రశ్నించారు. ప్రజలేమీ అమాయకులు కారు. చాలా తెలివైన వారు. మీరు చెప్పే కాకిలెక్కలను చూసి మోసపోరన్నారు. కేంద్రమంత్రి ఎంఎం పళ్లంరాజు రాజీనామా చేయకుండా కాకినాడ వస్తే ప్రతిఘటిస్తామని, సమైక్యాంధ్రకు కట్టుబడి రాజీనామా చేయకుంటే చరిత్ర హీనుడిగా మిగిలిపోతారని హెచ్చరించారు.
అవిశ్వాసానికి మద్దతుగా ఓటేసుంటే ఈ గతి పట్టేది కాదు
‘ఎంత దౌర్భాగ్యమైన ప్రతిపక్ష నాయకుడు మనకు ఉన్నాడంటే అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు ప్రజల కష్టాలు తెలుసుకునేం దుకు పాదయాత్ర చేస్తున్నానని చెప్పి, విప్‌జారీ చేసి మరీ ప్రభుత్వాన్ని కాపాడాడు. ఆనాడు ప్రభుత్వం కూలిపోయి ఉంటే ప్రజ లకు నేడిన్ని కష్టాలు వచ్చేవి కావు. పెట్రోల్, డీజిల్, తదితర ధర లు పెరుగుదలే కాదు, ఈ విభజన కాష్టం కూడా రగిలేదికాదు’ అని చంద్రశేఖర రెడ్డి అన్నారు. వీటన్నింటికి ప్రభుత్వాన్ని నిందించదలుచుకోలేదని, ముమ్మాటికీ చంద్రబాబే కారణమన్నారు. డబుల్ గేమ్ రాజకీయాలు వీడి సమైక్యాంధ్రకు అనుకూలంగా ప్రకటన చేసి, ఉద్యమంలోకి రావాలని డిమాండ్ చేశారు.
పళ్లంరాజు రాజీనామా చేయాల్సిందే...
సమైక్యాంధ్ర కోసం కేంద్రమంత్రి ఎంఎం పళ్లంరాజు తన పదవికి రాజీనామా చేయకుంటే చరిత్రహీనుడిగా మిగిలిపోతారని ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి పేర్కొన్నారు. తన కుటుంబ ప్రతి ష్టకు భంగం కలిగించేలా పళ్లంరాజు ప్రవర్తిస్తున్నారని ఆయన విమర్శించారు. కాకినాడలో మంగళవారం ద్వారంపూడి విలేకరులతో మాట్లాడారు. కాకినాడలో పళ్లంరాజు కుటుం బానికి ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయని, తనకు కూడా ఆ కుటుంబంతో అనుబంధం ఉందని చెప్పారు. తాతగారు పళ్లంరాజు, తండ్రి రామసంజీవరావులకు ఎంతో మంచిపేరు ఉందన్నారు. కాకినాడ నుంచి గెలిచిన పళ్లంరాజు కేంద్ర కేబినెట్ మంత్రి అయినందుకు అందరూ సంతోషించామని, కానీ ఆయన వ్యవహార శైలి కాకినాడ ప్రజలకు తలవంపులు తెచ్చేలా ఉందని ద్వారంపూడి అన్నారు. లక్ష జనఘోషలోనే కాదు.. తానెక్కడికెళ్లినా పళ్లంరాజు తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూనే ఉన్నానన్నారు. రాజీనామా చేసే వరకు పళ్లంరాజును విడిచిపెట్టేప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
రాజీనామా చేయకుండా పళ్లంరాజు కాకినాడ వస్తే తాము ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. ‘ఇప్పటికైనా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాను, చేస్తారని ఆశిస్తున్నాన’న్నారు. వైఎస్సార్‌సీపీ సమైక్యాంధ్రకు పూర్తిగా కట్టుబడి ఉంది. ఈ విషయంలో ఎలాంటి అనుమానాలు అవసరం లేదని వ్యాఖ్యానిం చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలో తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేశారని చెబుతున్న నాయకులు ప్లీనరీలో చేసిన తీర్మానాన్ని క్షుణ్ణంగా చదివి మాట్లాడితే మంచిదని హితవు పలికారు. సమైక్యాంధ్ర విషయంలో సీమాంధ్రులంతా రోడ్డెక్కి ఉద్యమిస్తుంటే, చంద్రబాబు మాత్రం యాత్రల పేరుతో నాటకాలాడుతున్నారని ధ్వజమెత్తారు. కాకినాడలో షర్మిల సమైక్య శంఖారావానికి అద్భుత స్పందన లభించిందన్నారు. పార్టీ నాయకులు సంగిశెట్టి అశోక్, ఎండీ బషీరుద్దీన్, కర్రి నారాయణ, ఇళ్ల సత్యనారాయణ, కిషోర్, అక్బర్ అజాం, ఎల్లబోయిన చిన్న, డీకే రెడ్డి, సునీల్ పాల్గొన్నారు.
చంద్రబాబు ఓ తీవ్రవాది
Published Wed, Sep 18 2013 12:01 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM
Advertisement