
సాక్షి, అమరావతి: ఐదేళ్ల పాలనలో తీసుకున్న అక్రమ నిర్ణయాలకు చివరి కేబినెట్ సమావేశాల్లో ఆమోదముద్ర వేయించడం ద్వారా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వాటికి సక్రమం ముసుగు వేశారు. నిబందనలకు విరుద్ధమని, సంబంధిత శాఖలు అభ్యంతరం తెలిపినా లెక్క చేయకుండా నిర్ణయాలు తీసుకుని కేబినెట్ భేటీలో ఆమోదించారు. రాష్ట్ర పారిశ్రామిక పెట్టుబడి మండలి (ఎస్‌ఐపీబీ)లో తీసుకున్న నిర్ణయాలను కూడా కేబినెట్‌లో ఆమోదించడం ఇప్పుడు అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గతంలో ఏ ప్రభుత్వాలూ ఎస్‌ఐపీబీ నిర్ణయాలను కేబినెట్‌లో ఆమోదింపచేసుకున్న సందర్భాలు లేవని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు.
అస్మదీయులకు ఖజానా దోచిపెట్టి..
గత ఐదేళ్లుగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎస్‌ఐబీపీలో ప్రభుత్వ పారిశ్రామిక విధానానికి అనుకూలంగా కాకుండా పారిశ్రామిక వేత్తలు కోరిన మేరకు రాయితీలను ఇవ్వడమే కాకుండా తక్కువ ధరకు భూములను కేటాయిస్తూ నిర్ణయాలు తీసుకున్నారు. కొన్ని కంపెనీలకైతే ఉదారంగా పెట్టుబడికి మించి రెట్టింపు రాయితీలను కూడా ఇచ్చేశారు. గత రెండేళ్లుగా ఐటీ రంగంలో పెట్టుబడుల పేరుతో అస్మదీయుల సంస్థలకు భారీ రాయితీలు ఇవ్వడమే కాకుండా చౌకగా భూములను కట్టబెట్టేశారు. ఐటీ విధానం ముసుగులో ఇష్టానుసారంగా రాయితీలు, భూముల ధరలను నిర్ణయించారు. బడా పారిశ్రామికవేత్తలకు ఇలా నిబంధనలకు విరుద్ధంగా ఖజానా నుంచి రాయితీలను ఇవ్వడంతో భవిష్యత్‌లో ఇవి ఎక్కడ తమ మెడకు చుట్టుకుంటాయోనని అధికారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
ఎస్‌ఐపీబీ సమావేశాల్లోనే నిర్ణయాలు..
రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించడానికి ముందుకొచ్చే వారు పెట్టే పెట్టుబడి ఎంత? ఎంత భూమి కోరుతున్నారు? ఏ రాయితీలు అడుగుతున్నారు? కల్పించే ఉద్యోగాలు ఎన్ని? తదితర అంశాలను పరిశీలించాక పారిశ్రామిక విధానం మేరకు భూ కేటాయింపుల ధరను నిర్ణయించాలని ఎస్‌ఐపీబీలో నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన సమావేశమయ్యే ఎస్‌ఐపీబీలో సంబంధిత శాఖల మంత్రులు, ముఖ్య కార్యదర్శులు ఉంటారు. ఎస్‌ఐపీబీలో నిర్ణయాలు తీసుకునే ముందు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని పారిశ్రామిక పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ (ఎస్‌ఐపీసీ) ఈ ప్రతిపాదనలను అధ్యయనం చేసి ఎంత మేరకు రాయితీలు కల్పించవచ్చో సూచిస్తుంది. ప్రభుత్వ విధానానికి మించి రాయితీలను కోరితే ఆ విషయాన్ని స్పష్టం చేస్తూ ఎస్‌ఐపీబీలో తగిన నిర్ణయం తీసుకోవాలని సూచిస్తుంది. ఎస్‌ఐపీబీలో తీసుకున్న నిర్ణయాల మేరకు సంబంధిత శాఖలు జీవోలను జారీ చేస్తాయి. అయితే గతంలో ఎన్నడూ ఎస్‌ఐపీబీలో తీసుకున్న నిర్ణయాలు కేబినెట్‌కు వెళ్లలేదు.
అక్రమాలకు సక్రమం..
ఎస్‌ఐపీబీలో తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్‌లో తమకు చిక్కులు సృష్టిస్తాయనే అభిప్రాయం అధికార వర్గాల్లో వ్యక్తమైంది. దీంతో ఎస్‌ఐపీబీ నిర్ణయాలను కేబినెట్‌లో పెట్టి ఆమోదించాల్సిందిగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సంబంధిత అధికారులు సూచించారు. కేబినెట్‌లో ఆమోదిస్తే తనకు కూడా సమస్య ఉండదని ఆయన భావించారు. ఈ నేపథ్యంలో గత ఐదేళ్లుగా ఎస్‌ఐబీపీలో తీసుకున్న నిర్ణయాలను ఎన్నికలకు ముందు నిర్వహించిన రెండు కేబినెట్ సమావేశాల్లో ఆమోదించారు. అయితే ఇలా ఆమోదించినంత మాత్రాన అక్రమాలు సక్రమం ఎలా అవుతాయని సీనియర్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. తొలుత నిర్ణయాలు తీసేసుకుని జీవోలు కూడా ఇచ్చేసిన తరువాత ఎప్పుడో కేబినెట్‌లో పెట్టి ఆమోదించారని స్పష్టం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో బయట తీసుకున్న నిర్ణయాలు కేబినెట్ నిర్ణయాల కిందకు రావని పేర్కొంటున్నారు. ఇది ఇలా ఉండగా మరికొద్ది రోజుల్లో ఏర్పాటయ్యే కొత్త ప్రభుత్వం ఎస్‌ఐపీబీ నిర్ణయాలను సమీక్షించవచ్చని, ఖజానాకు నష్టం కలిగించేలా ప్రైవేట్ సంస్థలు, వ్యక్తులకు ఇచ్చిన రాయితీలపై సమీక్షించి తగిన నిర్ణయాలు తీసుకునే అధికారం ఉందని సీనియర్ ఐఏఎస్ అధికారి ఒకరు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment