టీడీపీలో పదవుల పండుగ
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీలోని చిన్నా చితకా నేతలకు పదవుల కరువు తీరే సమయం ఆసన్నమైంది. నామినేటెడ్ పదవుల పందేరానికి పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు తెర తీయడంతో పార్టీలో కోలాహలం కనిపిస్తోంది. అదే సమయంలో పదవుల కోసం పార్టీ నేతల మధ్యే తీవ్ర పోటీ నెలకొనడంతో జిల్లా నాయకులకు కొత్త సమస్యలు తెచ్చిపెడుతోంది. నామినేటెడ్ పదవులకు పేర్లు సూచించడానికి ఈ నెల 20వ తేదీని అధినేత డెడ్‌లైన్‌గా సూచించడంతో ఎవరికి వారు తమ పేర్లు ప్రతిపాదించాలని మంత్రులు, సీనియర్ నేతల చుట్టూ తిరుగుతున్నారు. పదేళ్ల పాటు పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికే గుర్తింపు ఉంటుందని నేతలు చెబుతున్నా ఆచరణలో అది ఎంతవరకు సాధ్యమనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కాగా జిల్లాలో అందుబాటులో ఉన్న పదవుల విషయం పరిశీలిస్తే..
ఏఎంసీ, దేవాలయ కమిటీలతో పాటు గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవులకు ఆశావహుల జాబితా ఇప్పటికే చాంతాడంత ఉంది. మార్కెట్, దేవాలయ కమిటీలను రద్దు చేయడంతో రెండు నెలల నుంచే ఈ పదవులపై చర్చ జరుగుతోంది. జిల్లాలో 14 ఏఎంసీలు ఉండగా ఒక్కో కమిటీలో 9 మంది సభ్యులకు చోటుంటుంది. ప్రముఖ ఆలయాలైన అరసవిల్లి, శ్రీ కూర్మం, శ్రీముఖలింగం దేవాలయ కమిటీలను నియమించాల్సి ఉంంది. గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవి కూడా పోటీ తీవ్రంగా ఉంటుంది. ఈ పదవులపై ఆశలు పెట్టుకున్నవారు ఎవరికి వారే ప్రయత్నాలు చేసుకుంటున్నారు. గ్రంథాలయ సంస్థ పదవి ఆశిస్తున్న ఓ నేత పొరుగు జిల్లా మంత్రిని ఆశ్రయించినట్లు తెలిసింది. ఆయన కూడా సానుకూలంగానే స్పందించినట్టు తెలిసింది. అయితే ఇక్కడి వారు మాత్రం ససేమిరా అంటున్నారు. పదేళ్లుగా తాము పార్టీ జెండా మోస్తుంటే ఇప్పుడిప్పుడే పార్టీలో హడావుడి చేస్తున్న వ్యక్తికి పదవేంటని మండిపడుతున్నారు. జిల్లా మంత్రి, విప్, ఎంపీ, స్థానిక ఎమ్మెల్యేల దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకువెళ్లారు.
కమిటీ సూచనలతోనే..నామినేటెడ్ పదవుల భర్తీకి సంబంధించి పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి రెండు రోజుల క్రితమే ఓ ఆదేశం వచ్చింది. జిల్లాకు చెందిన అగ్రనేతలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించి, వారి సూచన మేరకు ఓ కమిటీని ఏర్పాటు చేయాలి. ఆ కమిటీ సూచించిన వా రినే పదవులకు సిఫారసు చేయాలని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. జిల్లా మంత్రి, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు సూచించిన వారికంటే ఇన్నాళ్లూ పార్టీ కోసం కష్టపడిన వారిని గుర్తించి పదవులు కట్టబెట్టే యోచనలో అధిష్టానం ఉన్నట్టు తెలిసింది. పార్టీకి పట్టులేని, ఎన్నికైన ప్రజాప్రతినిధులు లేని ప్రాంతాలకు ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇప్పటివరకు జిల్లా కేంద్రంలో ఎలాంటి కార్యకర్తల సమావేశం పెట్టకపోవడం, పార్టీ భవిష్యత్తుపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోకపోవడాన్ని కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇటీవలి కాలం లో జిల్లాలో రెండు అధికార కేంద్రాలు ఏర్పడ్డాయి.
సీనియర్ నేత చుట్టూ ఓ వర్గం, ప్రస్తుతం పదవులు అనుభవిస్తున్న ఇతర నేతల చుట్టూ మరో వర్గం అన్నట్లు టీడీపీ రాజకీయాలు నడుస్తున్నాయి. దీన్ని గమనించిన అధిష్టానం సీనియర్ నేతను ఖాళీగా ఉంచకుండా పార్టీ పని అప్పగించింది. రెండు రోజుల క్రితం సమన్వయ సమావేశం నిర్వహించినా స్థానికంగానే ఉన్నప్పటికీ ఇద్దరు అగ్రనేతలు దానికి హాజరుకాకపోవడం, సమావేశంలో డీసీఎంఎస్ పదవి విషయంలో అభిప్రాయభేదాలు వ్యక్తం కావడం రానున్న పరిణామాలకు సూచికగా నిలుస్తోంది. జిల్లా నేతల సిఫారసులు పని చేస్తాయా.. పొరుగు జిల్లాల నేతల ఒత్తిళ్లు పనిచేస్తాయో త్వరలో తేలనుంది.