సెల్వం పాత్రలో బాలయ్య | chandrababu in hastina balakrishna in secretariate | Sakshi
Sakshi News home page

సెల్వం పాత్రలో బాలయ్య

Published Thu, Jun 11 2015 2:33 AM | Last Updated on Sat, Sep 15 2018 8:38 PM

సెల్వం పాత్రలో బాలయ్య - Sakshi

సెల్వం పాత్రలో బాలయ్య

 బావా బావా.. ‘పన్నీర్’
ఆధారాలు బయటపడితే  చంద్రబాబు ఔట్.. సీఎంగా బాలకృష్ణకు చాన్స్
ఓటుకు నోటు వ్యవహారం నేపథ్యంలో టీడీపీలో చర్చ
బాబు కుటుంబసభ్యులు, సన్నిహితుల మంతనాలు
వీర విధేయుడి ఎంపికపై తర్జనభర్జనలు..
లోకేశ్‌కు అనుభవ లేమి.. పైగా ప్రస్తుత కేసులో చినబాబు ప్రస్తావన
కోడెల పేరూ తెరపైకి


సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యేకు డబ్బు ఎర చూపిన ఉదంతం తెలుగుదేశం పార్టీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో రేవంత్‌రెడ్డితో పాటు సూత్రధారిగా ఏపీ సీఎం చంద్రబాబుపై బలమైన ఆధారాలు ఉన్నాయని తెలుస్తున్న నేపథ్యంలో.. తదనంతర రాజకీయ పరిణామాలపై టీడీపీలో అంతర్గత సమాలోచనలు వేగవంతమయ్యాయి.బాబు సీఎంగా తప్పుకోవలసివస్తే ఏం చేద్దామన్న విషయమై ఆయన కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితులైన పార్టీ నేతల మధ్య అనేక కోణాల్లో సమాలోచనలు జరుగుతున్నాయి.

బాబు రాజీనామా  అనివార్యమైతే ఆయన ఈ కేసు నుంచి బయటపడే వరకు ఆ స్థానంలో కూర్చోబెట్టదగిన వీరవిధేయుడు ఎవరన్నదానిపై చర్చ సాగుతోంది. ఈ కేసు నుంచి బాబు బయట పడటానికి అవకాశాలున్నాయా? ఏసీబీ తదుపరి విచారణ కోణాలు ఎలా ఉండబోతున్నాయి? ఇంతవరకు ఎలాంటి ఆధారాలు సేకరించారు? వంటి వాటిపై సమాలోచనలు సాగిస్తూనే అనూహ్య పరిణామాలు తలెత్తితే అనుసరించాల్సిన వ్యూహంపైనా మల్లగుల్లాలు పడుతున్నారు. అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు... అనుకోని పరిణామాలు సంభవిస్తే తప్ప ఈ కేసు నుంచి బాబు బయటపడే ఆస్కారం, అవకాశాలు లేవని తెలుస్తోంది.

ఈ పరిస్థితుల్లో తమిళనాడులో పన్నీరు సెల్వం మాదిరిగా ఇక్కడ వీరవిధేయుడెవరన్న చర్చ మొదలైంది. తాను రాజీనామా చేయాల్సి వస్తే కుమారుడు లోకేశ్‌ను ఆ పదవిలో కూర్చోబెట్టాలని చంద్రబాబు భావిస్తున్నారు.ప్రస్తుత కేసులో చినబాబు పేరూ ప్రస్తావనకు వస్తుండటం, రాజకీయ అనుభవం సైతం లేకపోవడంతో ఇంకెవరు? అన్న ప్రశ్న ఉదయిస్తోంది. దీంతో బాబు వియ్యంకుడు, హిందూపురం ఎమ్మెల్యే ఎన్.బాలకృష్ణ పేరు బలంగా వినిపిస్తోంది. ఆయనకూ రాజకీయ అనుభవం లేకపోవడం ప్రతికూలంగా మారుతుందన్న చర్చా సాగుతోంది. దీంతో పార్టీలో సీనియర్లు, ఇతర విధేయుల పేర్లూ చర్చకొచ్చాయి. ప్రధానంగా ప్రస్తుత శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అన్ని రకాలుగా సమర్థులని చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన గురువు సూచించినట్టు తెలుస్తోంది.

పైగా బాలకృష్ణకు కూడా కోడెల అత్యంత సన్నిహితుడు. చిన్నచిన్న అభిప్రాయ భేదాలున్నప్పటికీ మొదటినుంచి పార్టీకి సేవలు అందించడం, ప్రతిపక్షాలను దీటుగా ఎదుర్కొనగలగడం, మంత్రిగా, స్పీకర్‌గా,అనుభవం కలిగిన నేతగా ఆయన పేరు ముందు వరుసలో చేరింది. ఇందుకు చంద్రబాబు అంగీకరిస్తారా లేదా అన్న మీమాంస ఉంది. మరోవైపు యనమల రామకృష్ణుడు లాంటి ఇతర సీనియర్లు కూడా అంగీకరించకపోవచ్చన్న అభిప్రాయమూ ఉంది. డిప్యూటీ సీఎంలు నిమ్మకాయల చినరాజప్ప, కేఈ కృష్ణమూర్తితో పాటు మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి పి.నారాయణల పేర్లు చర్చల్లో వస్తున్నప్పటికీ వీరి విషయంలో  ఏకాభిప్రాయం ఉండదన్న వాదనలున్నాయి.  

తమిళనాడు తరహాలో చూస్తే చినరాజప్ప పేరును, ఇటీవలి కాలంలో చాలా విషయాల్లో.. ప్రధానంగా ఏపీ కొత్త రాజధాని వ్యవహారాల్లో అత్యంత సన్నిహితుడిగా వ్యవహరిస్తున్న నారాయణ పేరును చంద్రబాబు సూచించే అవకాశాలుంటాయి. ఈ పరిణామాలపై చంద్రబాబు కుటుంబసభ్యులతో సన్నిహితంగా ఉన్నవారు మాత్రమే రహస్య సమాలోచనలు చేస్తున్నారు. మెజారిటీ మంత్రులు బాలకృష్ణ పేరును మాత్రమే సూచిస్తారని, బాబు సైతం ఆయన పేరును సూచించే వచ్చని జూనియర్ మంత్రులు చెబుతున్నారు. ఇక బుధవారం బాలకృష్ణ జన్మదినం కావడంతో మంత్రులు పెద్ద సంఖ్యలో ఆయన ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలియజేశారు.
 
ఏసీబీ నోటీసిస్తే ఒత్తిడి పెరుగుతుంది
వాస్తవానికి మంగళవారం (9 వతేదీ) చైనా ప్రతినిధి బృందంతో సమావేశంలో పాల్గొనడానికి మాత్రమే చ ంద్రబాబు ఢిల్లీ పర్యటన ఖరారైంది.  నామినేటెడ్ ఎమ్మెల్యేతో టెలిఫోన్‌లో మాట్లాడిన సంభాషణల ఆడియో టేపులు బయటకు రావడంతో ఉలిక్కిపడిన చంద్రబాబు తన పర్యటనను పొడిగించుకున్నారు. బుధవారం ఉదయం రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో మొదలుపెట్టి వరుసగా రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర హోం మంత్రి తదితరులను కలిశారు.

ఈ నేపథ్యంలో పార్టీ నేతలంతా బాబు ఢిల్లీ పర్యటనపై ఎన్నో ఆశలు పెట్టుకున్నామని సీనియర్ మంత్రి ఒకరు వ్యాఖ్యానించారు. ‘ఈ కేసు విషయమై విచారణకు హాజరుకావాలని ఏసీబీ బాబుకు నోటీసు ఇస్తే ఆయన రాజీనామా చేయాలన్న ఒత్తిడి పెరుగుతుంది. అంతవరకు వెళ్లదనుకుంటున్నాం. అదే జరిగితే బాబు కేసు నుంచి బయటపడేవరకు మరో నేతను ఎంపిక చేసుకుంటాం’ అని ఆ మంత్రి అన్నారు.
 
సచివాలయంలో మంత్రులతో బాలయ్య భేటీ
చంద్రబాబు ఢిల్లీ పర్యటన నేపథ్యంలో ఆయన వియ్యంకుడు బాలకృష్ణ బుధవారం సచివాలయానికి రావడం చర్చనీయాంశంగా మారింది. ఉదయం తన నివాసంలో పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న బాలకృష్ణ సచివాలయానికి వచ్చిన సందర్భంగా పలువురు మంత్రు లు, ఎమ్మెల్యేలతో సమావేశం కావడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. మంత్రి పరిటాల సునీత చాంబర్‌లో ఆయన కేక్‌ను కట్ చేశారు. వేడుకల్లో పాల్గొన్న మంత్రులు, టీడీపీ ప్రజాప్రతినిధులు, నేతలకు మిఠాయిలు పంపిణీ చేశారు. మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, రావెల కిషోర్‌బాబు, అచ్చెన్నాయుడు, టీడీపీ సీనియర్ నేతపయ్యావుల కేశవ్, ధర్మవరం ఎమ్మెల్యే వరదాపురం సూరి తదితరులతో రహస్యంగా మంతనాలు సాగించారు.

అనంతరం విలేకరులతో మాట్లాడుతూ నీతి నిజాయితీలకు టీడీపీ మారు పేరని చెప్పారు. టీడీపీని అస్థిరపరిచేందుకుకుట్ర సాగుతోందన్నారు. ఫోన్ ట్యాపింగ్  అనైతికమన్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికలపై చర్చించేందుకే మంత్రులు, టీడీపీ నేతలతో సమావేశమయ్యానని చెప్పారు.రేవంత్‌రెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్టు చేయడంపై స్పందించడానికి బాలకృష్ణ నిరాకరించారు. సమావేశానికి మీడియాను అనుమతించకపోవడాన్ని మంత్రులు అచ్చెన్నాయుడు, పల్లె రఘునాథరెడ్డి, రావెల దృష్టికి విలేకరులు తీసుకెళ్లగా..సమావేశానికి  ప్రాధాన్యత లేదని కొట్టిపారేశారు. కేవలం బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement