నేడు ప్రధాని, కేంద్ర హోం, రక్షణ శాఖ మంత్రులతో భేటీ
రేపు ఆర్థిక మంత్రితో సమావేశమయ్యే అవకాశం
నిధులు, పోలవరం, రాజధాని అంశాలపై చర్చ!
ఇటీవల గెలుపొందిన రాష్ట్ర ఎంపీలకు బాబు విందు
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, అమరావతి/గన్నవరం: ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీకి చేరుకున్నారు. బుధవారం రాత్రి 8 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆయనకు పలువురు ఎంపీలు స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి నేరుగా అశోకా రోడ్డులోని ఆయన నివాసానికి వెళ్లారు. రెండు రోజుల పాటు ఢిల్లీలోనే బస చేయనున్నట్లు సమాచారం.
ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను చంద్రబాబు కలవనున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయం, పెండింగ్ ప్రాజెక్టుల విషయం, పోలవరం, రాజధాని అమరావతి అంశాలపై ప్రధాని, కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు. గురువారం ఉదయం ప్రధానితో భేటీ అవ్వనున్నట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. అనంతరం రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా, గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి మనోహర్ లాల్‌ఖట్టర్‌లను కలవనున్నారు.
శుక్రవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. కాగా, రాష్ట్రంలో ఇటీవల ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీ, జనసేన, బీజేపీ ఎంపీలకు చంద్రబాబు విందు ఇచ్చారు. అనంతరం శుక్రవారం రాత్రి లేదా శనివారం ఉదయం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు తిరిగి వెళ్లనున్నట్లు తెలిసింది.
34 కిలోమీటర్ల దూరానికి హెలికాప్టర్!
నిత్యం నీతులు, సుద్దులు చెబుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. కొంచెం దూరం ప్రయాణించడానికి కూడా హెలికాప్టర్ వినియోగించడం చర్చనీయాంశమైంది. బుధవారం ఆయన కేవలం 34 కిలోమీటర్ల దూరం రోడ్డు మార్గంలో ప్రయాణించకుండా, హెలికాప్టర్‌ను వాడారు. ఢిల్లీ పర్యటనకు వెళ్లేందుకు బుధవారం సాయంత్రం వెలగపూడి సచివాలయం నుండి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకునేందుకు ఆయన ఆకాశమార్గాన్ని ఎంచుకున్నారు.
హడావుడి, ఆడంబరాలకు దూరంగా ఉన్నట్లు రోజూ మీడియా సమావేశాలు, సమీక్షల్లో చెబుతున్న ఆయన కొద్దిపాటి దూరానికి హెలికాప్టర్ వినియోగించడం గమనార్హం. సాధారణంగా కొద్దిపాటి దూరం ప్రయాణాలకు ముఖ్యమంత్రి అయినా, గవర్నర్ అయినా రోడ్డు మార్గాన్నే ఉపయోగిస్తారు. అత్యవసర పరిస్థితులు ఉంటే తప్ప హెలికాప్టర్ వాడరు. కానీ ఇప్పుడు 34 కిలోమీటర్లు వెళ్లేందుకు హెలికాప్టర్ వాడడం ద్వారా తాను చెప్పే సూక్తులన్నీ మాటలకే పరిమితమని
చంద్రబాబు రుజువు చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment