పశ్చిమగోదావరి , వీరవాసరం: అబద్దపు హామీలు, బూటకపు వాగ్దానాలతో అందలమెక్కిన సీఎం చంద్రబాబు ఎన్నికలు సమీపిస్తుండటంతో నిరుద్యోగభృతి అంశాన్ని తెరపైకి తెచ్చారు. గత ఎన్నికల సమయంలో ఇంటికో ఉద్యోగం లేదంటే నిరుద్యోగభృతి అంటూ ఊదరగొట్టిన చంద్రబాబు గద్దెనెక్కి నాలుగున్నరేళ్లు సమీపిస్తున్నా దీని ఊసు ఎత్తలేదు. చివరకు ఎన్నికలు దగ్గరపడటంతో నిరుద్యోగభృతి అమలుకు మార్గనిర్దేశాలు ప్రకటించారు. నెలకు రూ.2,500 ఇస్తానన్న భృతిని రూ.1,000కు తగ్గించారు. దీనిపై సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నా ఏమాత్రం పట్టించుకోని పాలకులు మరో మాయోపాయానికి తెరదీశారు. భృతి కింద ఇచ్చే రూ.1,000ను టీడీపీ కార్యకర్తలకు అందేలా కంప్యూటర్‌లో ఉన్న అనుసంధాన లింకును ఏమార్చారు. ముఖ్యమంత్రి యువనేస్తం పేరుతో నిరుద్యోగభృతి కోసం ఏర్పాటు చేసిన లింకు ద్వారా అర్హులైన వారంతా ఆన్‌లైన్ చేసుకోవాలి. రాష్ట్రవ్యాప్తంగా ఎందరో నిరుద్యోగులు తమ దరఖాస్తులను ఆన్‌లైన్ చేసుకోవడానికి ఎదురుచూస్తున్నారు.
ఈనేపథ్యంలో ముఖ్యమంత్రి యువనేస్తం వెబ్‌సైట్‌ను దాదాపు 15 రోజుల క్రితం ఏర్పాటుచేసినా దరఖాస్తుల స్వీకరణను మాత్రం మంగళవారం నుంచి ప్రారంభించారు. దరఖాస్తుల స్వీకరణకు కేవలం 48 గంటలు మా త్రమే లింకు ఓపెన్‌లో ఉండేలా ఏర్పాటుచేశారు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రానికి రాష్ట్రవ్యాప్తంగా సుమారు 10,500 మంది మాత్ర మే దరఖాస్తులను ఆన్‌లైన్ చేయించగలిగారు. కేవలం 48 గంటలు మాత్రమే గడువు ఇవ్వడంపై సర్వత్రా విమర్శలు ఎదురవడంతో గడువు పొడిగిస్తూ ప్రభుత్వం బుధవారం నిర్ణయం తీసుకుంది. ఈనెల 12వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణకు గడువు విధించింది. గందరగోళానికి గురిచేసేలా ముందు 48 గంటలు గడువు ఇవ్వడం, తర్వాత దానిని పొడిగించడం ప్రభుత్వ చిత్తశుద్ధిని తెలియజేస్తోందని నిరుద్యోగులు అంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎందరో నిరుద్యోగులకు పూర్తిస్థాయి సమాచారం లేకుండానే లింకు ప్రారంభించి క్లోజ్ చేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సరికాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమకు కావాల్సిన వారికి ముందుగా విషయాన్ని చేరవేసి వారికి మాత్రమే లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతోనే ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటుందని అంటున్నారు.
అర్హతలు ఇవే..
♦ ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండాలి.
♦ 22 నుంచి 35 ఏళ్ల వయసు ఉండాలి.
♦ 10వ తరగతి, డిగ్రీ లేదా పాలిటెక్నిక్ ఉత్తీర్ణత సాధించాలి.
♦ రాష్ట్ర ప్రభుత్వం నుంచి గతంలో ఏ లబ్ధిని పొంది ఉండకూడదు.
♦ ఎటువంటి క్రిమినల్ కేసుల్లోనూ దోషిగా ఉండకూడదు.
♦ నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు.
♦ 2.5 ఎకరాలపైన, మెట్ట వ్యవసాయం అయితే 5 ఎకరాలపైన ఉండకూడదు.
♦ ప్రభుత్వ, ప్రైవేట్ ఇతర అనుబంధ
♦ సంస్థల్లో ఉద్యోగి అయి ఉండరాదు. దరఖాస్తు సమయంలో ఆధార్ కార్డు, ఎస్‌ఎస్‌సీ సర్టిఫికెట్స్, ఉత్తీర్ణత పత్రాలు, బ్యాంక్ పాస్ పుస్తకం జతచేయాలి.
ఇది సరికాదు
నిరుద్యోగభృతి కోసం ఎటువంటి సమాచారం లేకుండా చేయడం దారుణం. రాష్ట్రవ్యాప్తంగా వేల సంఖ్యలో నిరుద్యోగులు ఉన్నారు. వారంతా కేవలం 48 గంటల్లో దరఖాస్తులు ఆన్‌లైన్ చేసుకోవడం ఎలా సాధ్యమవుతుంది. దీనిపై సర్వత్రా విమర్శలు ఎదురవడంతో గడువును పొడిగించారు. ఇలాంటి నిర్ణయాలు ప్రభుత్వ చిత్తశుద్ధిని తెలియజేస్తాయి. – వేండ్ర దివాకర్, వీరవాసరం
Comments
Please login to add a commentAdd a comment