బాబు మాట.. బంగారానికి టాటా! | Chandrababu Naidu Cheated Farmers On Loan Waiver | Sakshi
Sakshi News home page

బాబు మాట.. బంగారానికి టాటా!

Published Mon, Sep 7 2015 12:47 AM | Last Updated on Sun, Sep 3 2017 8:52 AM

బాబు మాట.. బంగారానికి టాటా!

బాబు మాట.. బంగారానికి టాటా!

రైతు రుణమాఫీ హామీ గుప్పించిన చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక మాటమార్చడంతో రైతులు మరింత రుణగ్రస్తులయ్యారు. ఇంట్లో బంగారాన్ని బ్యాంకుల్లో తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకున్న రైతులు ఎంతో నష్టపోయారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అని, భూమి రికార్డులు సరిగా లేవని, డబుల్ ఎంట్రీలని వంకలుపెట్టి రుణమాఫీలు సవ్యంగా చేయలేదు. దీంతో  బ్యాంకుల్లో తీసుకున్న రుణాలకు వడ్డీలు పెరిగిపోయి రైతులకు మరింత భారమైంది. బంగారం ధరలు పతనమవ్వడం కొత్త ఇబ్బందులు తెచ్చిపెట్టింది. బంగారంపై తీసుకున్న రుణాలకు అసలు, వడ్డీలు పెరిగిపోయాయి. దీంతో బ్యాంకర్లు రుణ రికవరీ కోసం నోటీసులు జారీ చేస్తున్నారు. ఈనేపథ్యంలో ఈ నెల 9వ తేదీ నుంచి రుణమాఫీ విజయయాత్రకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.                                             
            
 తణుకు/ఏలూరు టూటౌన్ : పంట రుణాల కోసం బంగారం తాకట్టు పెట్టిన రైతులు తిరిగి రుణాలు చెల్లించవద్దు.. అధికారంలోకి రాగానే మన చంద్రన్న రుణాలన్నీ మాఫీ చేస్తారని ఎన్నికల సమయంలో ప్రచార సభల్లో, టీవీల్లో ఊదరగొట్టిన ప్రకటనలు ఇప్పటికీ గుర్తుండే ఉంటాయి. ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలని మోసపూరిత వాగ్దానాలు చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటింటికీ నాయకులు, కార్యకర్తలను పంపి బంగారు రుణాలు రద్దు కావాలంటే చంద్రబాబును ముఖ్యమంత్రిని చెయ్యాలంటూ ప్రచారం చేయించారు. చివరికి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రుణమాఫీపైనే మొదటి సంతకమూ చేశారు. దీంతో పుస్తెలతాళ్లు సైతం బ్యాంకుల్లో దాచుకున్న అక్కచెల్లెమ్మల్లో ఆనందం కనిపించింది. అయితే అమలులోకి వచ్చేసరికి సవాలక్ష నిబంధనలు విధించారు. రుణమాఫీ జరుగుతుందని రైతులు, వారి ఇళ్ళల్లోని మహిళలు ఎదురు చూస్తే నిరాశే మిగిలింది.
 
 కేవలం రూ. 1100 కోట్లు మాఫీ
 ఎన్నో ఆంక్షలతో బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న పంట రుణాలు పూర్తిస్థాయిలో రద్దు కాలేదు. సరికదా బ్యాంకర్ల వేలం ప్రకటనలతో కొందరు అప్పు చేసి మరీ విడిపించుకుంటున్నారు. మూడు విడతల్లో బంగారు రుణాల మాఫీ అంతంతమాత్రమే అయినా ఈ నెల 9 నుంచి రుణమాఫీ విజయయాత్రకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై రైతులు పెదవి విరుస్తున్నారు. జిల్లాలో 8 లక్షల మంది రైతులు ఉండగా వీరికి రూ. 7,200 కోట్లు మేర రుణాలు ఆయా బ్యాంకుల నుంచి అందాయి. వీటిలో బంగారంపై రుణాలు రూ.1300 కోట్లు ఇచ్చారు. బంగారం హామీగా పెట్టుకోవటంతో పాటు  రైతుల నుంచి పట్టాదారు పాస్‌బుక్ జిరాక్సు కాపీ తీసుకుని బ్యాంకర్లు రుణాలు మంజూరు చేశారు. జిల్లాలో వివిధ బ్యాంకుల నుంచి 2లక్షల 75వేల మంది రైతులు బంగారంైపై వ్యవసాయ రుణాలు పొందారు. మూడు దశల్లో కేవలం రూ. 1100 కోట్లు మాత్రమే రుణమాఫీ అయినట్టు గణాంకాలు చెబుతున్నాయి.

రుణాలు మాఫీ చేస్తామని చంద్రబాబు చెప్పడంతో విశ్వసించిన ప్రజలు సకాలంలో బ్యాంకులకు బకాయిలు చెల్లించలేదు. దీంతో వడ్డీ సైతం పెరిగి రైతులకు గుదిబండలా మారింది. ఇదిలా ఉంటే రూ. 50వేల లోపు బంగారం తాకట్టు పెట్టి రుణం తీసుకున్న రైతులకు మాఫీ జరిగిందని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. కాగా బ్యాంకు అధికారులు మాత్రం బంగారం నగలను వేలం వేస్తామని ప్రకటనలు ఇస్తుండటంతో బయట ఎక్కువ మొత్తంలో వడ్డీలకు తెచ్చి మరీ బంగారాన్ని విడిపించుకునేందుకు కొందరు రైతులు ప్రయత్నిస్తున్నారు. బ్యాంకు అధికారులు చెబుతున్న గణాంకాలు ప్రకారం జిల్లాలో కేవలం 10 నుంచి 20 శాతం రుణాలు కూడా మంజూరు కాకపోవడం విశేషం.
 
 కౌలు రైతుల ఆందోళన
 కౌలు రైతులకు కాకుండా అసలు యజమానికి రుణమాఫీ వర్తిస్తుందని బ్యాంకర్లు చెప్పటంతో వారు ఆందోళనకు గురయ్యారు. ప్రభుత్వ నిర్వాకం వల్ల జిల్లాలో రైతుల సుమారు రూ.150 కోట్ల వరకూ వడ్డీ రూపేణా బ్యాంకర్లకు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. బంగారు రుణాలు రైతులకు ఇచ్చే సమయంలో సంవత్సరం కాల పరిమితిలో చెల్లించకపోతే వడ్డీ రెట్టింపు అయ్యే అవకాశం ఉందని నిబంధన ఉంది. సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీని నమ్మి సకాలంలో రుణాలు చెల్లించక పోవటంతో రైతులు అదనపు వడ్డీ చెల్లించాల్సి వస్తోంది.
 
 అప్పుదారుల తిప్పలు
 నరసాపురం అర్బన్:   నరసాపురం నియోజకవరంగలో దాదాపుగా రూ. 3.80 కోట్ల రుణాలు బంగారు ఆభరణాలపై రైతులు వివిధ బ్యాంకుల్లో తీసుకున్నారు. నరసాపురం మండలంలో రూ.68 లక్షలు, మొగల్తూరు మండలంలో రూ.28 లక్షల వరకూ మాత్రమే రుణమాఫీ జరిగింది.
 
 బ్యాంకుల నుంచి నోటీసులు
 బంగారం ధరలు తగ్గడంతో బ్యాంకర్లు రికవరీలపై దృష్టి పెట్టారు. బంగారం అప్పుదారులు ఎలాగైనా రుణాలు చెల్లించాలని, కనీసం అప్పుతీసుకున్న అసలు మొత్తంలో ఎంతో కొంత జమ చేయాలని నోటీసులు పంపిస్తున్నారు. దీంతో ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో రైతులు ఉన్నారు. బంగారంపై రుణాలు మాఫీ అవుతాయని ఇంకా ప్రభుత్వం నుంచి హామీలు లభిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మాటలు నమ్మాలో.. లేదో.. అర్థంకాని పరిస్థితి. అప్పోసప్పో చేసి బంగారం రుణాలు కట్టకపోతే బ్యాంకుల్లో ఉన్న మొత్తం నగలు జప్తు చేస్తారనే ఆందోళన కూడా రైతులను వెంటాడుతోంది.
 
 స్పష్టమైన హామీ ఇవ్వాలి
 బంగారం రుణాలు ఎంతవరకూ మాఫీ చేస్తారనే విషయంలో ఇంతవరకూ ప్రభుత్వం స్పష్టంగా చెప్పలేదు. ఇది దారుణం. పూర్తిగా రుణాలు మాఫీ చేయాలి. అప్పుదారులపై బ్యాంకర్లు వత్తిడి తేకుండా చూడాలి. ఇప్పటికిప్పుడు రుణాలు చెల్లించాలంటే, ఎలా కడతారు.
 - ఆరేటి మృత్యుంజయ, రైతుసంఘం నాయకుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement