Cheated Farmers
-
టోపీ బాబు..వాగ్దానాల డాబు..
అలవికాని హామీలెన్నో ఇచ్చారు.. నెరవేర్చలేక బొక్క బోర్లాపడ్డారు.. చివరకు గెలిపించిన ప్రజలను నట్టేట ముంచారు.. ఐదేళ్ల పాలనలో ఒక్క హామీని కూడా సంపూర్తిగా నెరవేర్చలేదు. పలు ప్రాజెక్టులు అర్ధంతరంగానే ఆగిపోయాయి. ప్రచార ఆర్భాటమే గానీ జిల్లాకు చేసిందేమీ లేదు. వైఎస్సార్ హయాంలో పరుగులు పెట్టిన వంశధార, ఆఫ్‌షోర్ ప్రాజెక్టులు చంద్రబాబు పాలనలో చతికిలపడ్డాయి. భావనపాడు పోర్టు శిలాఫలకానికి సైతం నోచలేదు. ఇలా రైతాంగానికీ, ఇతర వర్గాలకు ఎటువంటి మేలూ జరగకుండానే టీడీపీ ప్రభుత్వ కాలం ముగిసిపోయింది. సాక్షి, శ్రీకాకుళం: ఈ ఐదేళ్ల టీడీపీ ప్రభుత్వ పాలనలో నేతల ప్రధాన హామీలేవీ అమలుగాలేదు. పలు ప్రాజెక్టులు అర్ధంతరంగానే ఆగిపోయాయి. ఐదేళ్ల క్రితం సార్వత్రిక ఎన్నికల సమయంలో టీడీపీ నాయకులు ఇచ్చిన హామీలు, తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు పలుమార్లు జిల్లా పర్యటనల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు దాదాపు నెరవేరకుండాపోయాయి. ఐదేళ్ల పాలన అదిగో ఇదిగో అంటూ ఆర్భాటపు ప్రచారంతోనే గడిచిపోయింది. జిల్లాలకు ఆర్థిక వనరులు సమకూర్చే ప్రధాన హామీలను సైతం పూర్తి చేయలేని దీనపరిస్థితి ఏర్పడింది. దీంతో జిల్లాలో రైతాంగానికీ, ఇతర వర్గాలకు ఎటువంటి మేలూ జరగకుండానే టీడీపీ ప్రభుత్వ కాలం ముగిసిపోయింది. కుంటుపడిన వంశధార ప్రాజెక్టు దాదాపు 19 టీఎంసీల నీటినిల్వ సామర్థ్యంతో శ్రీకాకుళం జిల్లాను సస్యశ్యామలం చేయాలనే ఉద్దేశంతో వంశధార స్టేజ్–2 ఫేజ్–2 ప్రాజెక్టుకు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నాంది పలికారు. ఆయన హయాంలోనే ప్రాజెక్టు పనులు, నిర్వాసితులకు పునరావాస ఏర్పాట్లు 60 శాతం పూర్తయ్యాయి. వైఎస్ అకాల మరణంతో ప్రాజెక్టు పనులు కుంటుపడ్డాయి. ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని గత ఎన్నికలలో హామీ ఇచ్చిన చంద్రబాబు, జిల్లా టీడీపీ నాయకులు కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి రెండేళ్లు పట్టించుకోలేదు. తర్వాత యూత్ ప్యాకేజీ తీసుకొచ్చి 18 ముంపు గ్రామాల నుంచి తరలించినా వారికి నిర్వాసిత కాలనీల్లో తగిన ఏర్పాట్లు చేయలేదు. ఇప్పుడిప్పుడే అక్కడి నిర్వాసితులు తేరుకుంటున్నారు. మిగిలిన ప్రాజెక్టులను పూర్తి చేయించడంలో టీడీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. వంశధార స్టేజ్–2 ఫేజ్–2 పనుల్లో ప్యాకేజీ 87 టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్ సంస్థే చేస్తోంది. నది నుంచి వరదకాలువకు నీరు మళ్లించే సైడ్ వియర్, వరద కాలువ, సింగిడి బ్యాలెన్సింగ్ రిజర్వాయరు నిర్మాణ పనులను ఇప్పటికీ ఆ సంస్థ పూర్తి చేయలేకపోయింది. చంద్రబాబు సొంత మనిషైన సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్ సంస్థను అదిలించడానికి, కదిలించడానికి ఇంజనీరింగ్ అధికారులు పెద్దగా సాహసం చేయలేకపోయారు. గత ఏడాదే వంశధార ప్రాజెక్టులో భాగమైన హిరమండలం జలాశయంలో నీరు నింపుతామంటూ చంద్రబాబు ఇచ్చిన హామీ కూడా నెరవేరని పరిస్థితి ఏర్పడింది. రెండేళ్ల క్రితం హిరమండలంలో బహిరంగసభకు హాజరైన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వంశధార నిర్వాసితులకు అభయమిచ్చిన సంగతి తెలిసిందే. తమ పార్టీ అధికారంలోకి వస్తే నిర్వాసితుల సమస్యలన్నీ పరిష్కరిస్తానని, ప్రాజెక్టు పెండింగ్ పనులు సత్వరమే పూర్తి చేసి రైతాంగానికి పుష్కలంగా సాగునీరు అందుబాటులోకి తెస్తానని హామీ ఇచ్చారు. ఇదే హామీని ‘నవరత్నాల్లో’నూ పునరుద్ఘాటించారంటే దానికి ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో అర్థమవుతోంది. కలగా మిగిలిన ‘ఆఫ్‌షోర్’ మహేంద్ర తనయ నది నీటిని సద్వినియోగం చేసుకునేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే ఆఫ్‌షోర్ ప్రాజెక్టుకూ నాంది పలికారు. దీన్ని కూడా 2018 డిసెంబరు నాటికే పూర్తి చేస్తామని చంద్రబాబుతో పాటు పలాస ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర శివాజీ కూడా పలుమార్లు చెప్పుకొచ్చారు. కానీ నేటికీ ఆ ప్రాజెక్టు పనులు సగం కూడా పూర్తికాలేదు. ఈ పరిస్థితి తలెత్తడానికి శివాజీ అల్లుడు యార్లగడ్డ వెంకన్న చౌదరి మితిమీరిన జోక్యం కూడా ప్రధాన కారణమనే విమర్శలు ఉన్నాయి. ఇక వంశధార నది కరకట్టల నిర్మాణ పనులకు తొలి నాలుగున్నరేళ్లు పట్టించుకోకుండా ఎన్నికలు సమీపిస్తున్నాయనగానే ఇటీవల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు శంకుస్థాపన చేసి మమ అనిపించారు. పనులు మాత్రం మొదలవ్వలేదు. వంశధార–నాగావళి నదుల అనుసంధానం చేశామని ఒకవైపు చంద్రబాబు, టీడీపీ నాయకులు ఘనంగా చెప్పుకుంటున్నా ఇక్కడి పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. వంశధార ప్రాజెక్టులోని హిరమండలం జలాశయం నుంచి నారాయణపురం ఆనకట్ట వరకూ నిర్మిస్తున్న హైలెవల్ కెనాల్ (హెచ్ఎల్సీ) పనులు తూతూమంత్రంగానే జరుగుతున్నాయి. అలాగే ఆమదాలవలస, రాజాం నియోజకవర్గ రైతులకు కీలకమైన నారాయణపురం ఆనకట్ట ఆధునికీకరణ పనులు చేపడతామని గత మూడేళ్లుగా ఊరిస్తున్న టీడీపీ నాయకులు చివరకు శంకుస్థాపన కార్యక్రమాన్ని ఇటీవలే మొక్కుబడిగా ముగించిన సంగతి తెలిసిందే. భావనపాడుపై నాన్చుడు ధోరణి టెక్కలి నియోజకవర్గంలోని సంతబొమ్మాళి, పలాస నియోజకవర్గంలోని వజ్రపుకొత్తూరు మండలం సరిహద్దులో భావనపాడు వద్ద పోర్టు నిర్మిస్తామంటూ చంద్రబాబు, టీడీపీ నాయకులు ఇచ్చిన హామీ నేటికీ నీటిమూటగానే మిగిలిపోయింది. ఈ పోర్టును ప్రైవేట్ సంస్థ ఆదానీకి అప్పగిస్తూ గత ఏడాది విశాఖపట్నంలో జరిగిన భాగస్వామ్య సదస్సులో ఎంఓయూ కుదిరింది. అయితే శంకుస్థాపన మాత్రం వాయిదా పడుతూ వచ్చింది. చివరకు ఇటీవల భోగాపురం విమానాశ్రయం శంకుస్థాపన కార్యక్రమం సమయంలోనే భావనపాడు పోర్టు శిలాఫలాకాన్నీ అక్కడే చంద్రబాబుతో ఆవిష్కరించడానికి ప్రయత్నాలు జరిగాయి. కానీ అదీ ఆఖర్లో ఆగిపోయింది. సుగర్స్ రైతుల నోట్లో చేదు ఆమదాలవలస కోఆపరేటివ్ సుగర్ ఫ్యాక్టరీని పునఃప్రారంభిస్తామని గత సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు, కూన రవికుమార్ హామీ ఇచ్చారు. ఈ హామీని నెరవేరుస్తామంటూ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్నాళ్లు హంగామా చేశారు. తీరా అది సాధ్యం కాదంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు గత ఏడాది ఆమదాలవలసలో జరిగిన ఏరువాక కార్యక్రమంలో తేల్చిచెప్పేశారు. అక్కడ పారిశ్రామిక పార్కు ఏర్పాటు చేస్తామన్నారు. కానీ ఇప్పటివరకూ అదీ కార్యరూపం దాల్చలేదు. సిక్కోలుపై చిన్నచూపు జిల్లా కేంద్రమైన శ్రీకాకుళం నగరంలో టీడీపీ ప్రభుత్వం చెప్పుకోవడానికి కనీసం ఒక్క ప్రాజెక్టు కూడా లేదు. నగరం చుట్టూ రింగ్ రోడ్డు నిర్మిస్తామని, సిటీలో మురుగు సమస్య నిర్మూలించేందుకు భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేస్తామని గత ఎన్నికల ప్రచారంలోనే కాదు నగరానికి వచ్చినప్పుడల్లా చంద్రబాబు హామీ ఇస్తూనే వచ్చారు. కానీ అవేవీ కార్యరూపం దాల్చలేదు. కనీసం నగరం నడిబొడ్డున పశుసంవర్థక శాఖ స్థలంలో నిర్మించిన 30 షాపుల వ్యాపార సముదాయాన్ని కూడా ప్రారంభించలేదు. చేనేత వృత్తిదారులకు ప్రథమ ప్రాధాన్యంతో కేటాయిస్తామని అధికారులు.. కాదు తమవారికే దక్కాలని టీడీపీ నాయకులు పట్టుబట్టడంతో ఆ షాపింగ్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవానికి నోచుకోలేదు. -
అన్నదాతలకు ‘బాబు’ కుచ్చుటోపీ!
సాక్షి, బాలాయపల్లి: ఎన్నికల వేళ రైతన్నలను మరోసారి మభ్యపెట్టేందుకు తెలుగుదేశం నాయకులు కొత్త ఎత్తులు వేస్తూ మోసపూరిత హామీలు గుప్పిస్తూ అన్నదాతలను వంచించే ప్రయత్నం చేస్తున్నారు. 2019 ఎన్నికల నేపథ్యంలో...! అన్నదాత సుభీభవతో రైతులను అభివృద్ధి చేస్తామని, సన్న, చిన్నకారు రైతులకు రూ.15 వేలు ఇస్తామని, పోస్ట్‌డేటెడ్ చెక్కులతో అన్నదాతలకు నగదు ఆందేలా చూస్తాం అంటూ ప్రకటిస్తూ మరోమారు రైతులను మోసం చేసేందుకు కొత్త›కొత్త పథకాలు అమలు చేస్తున్నారు. 2014 ఎన్నికల సమయంలో అధికారంలోకి వస్తే రైతు రుణమాఫీపై తొలి సంతకం. ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెడతా, ఎరువుల ధరలను తగ్గిస్తా, గిట్టుబాటు ధరలు కల్పిస్తామంటూ సీఎం చంద్రబాబు ప్రగల్భాలు పలికారు. పేస్కేల్ ఆధారంగా రుణమాఫీ ఉంటుందని రూ 1.50 లక్షల వరకు బ్యాంకు రుణం తీసుకున్న రైతులకు మాత్రమే ఇది వర్తిస్తుందని స్పష్టం చేశారు. ఇక రాష్ట్రంలో ఆర్థిక లోటు ఉంది. ఏకకాలంలో మాఫీ చేయడం సాధ్యం కాదన్నారు. ఆదికూడా 5 విడతలుగా మాఫీ మాత్రం మొండిచేయి చూపించారు రైతన్నలు ఏమంటున్నారంటే..! ఏరు దాటే వరకు ఓడ మలన్న.... ఏరుదాటక బోడి మల్లన్న అన్న చందంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే ఎన్నికల దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు మరోమారు రైతులను నట్టేట మంచడానికి పచ్చి హామీలు ఇస్తున్నారని మండిపడతున్నారు. నియోజకవర్గంలోని సుమారు 56,789 మంది రైతులు అధికంగా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. ప్రస్తుతం మామిడి, జామా, వరి, నిమ్మ, బొప్పాయి, వివిధ రకాల కురగాయల పంటలు 23,314 హెక్టార్లలో సాగవుతోంది. 56,789 మంది రైతులు వ్యవసాయ రంగాన్నే నమ్ముకుని పూట గడుపుతున్నారు. అయితే రైతులకు వాతావరణం అనుకూలించాక, వరుణుడు కరుణించకపోవడంతో ఏటా నష్టాలు తప్పడం లేదు. అప్పులు చేసి పంట పండిస్తే పెట్టిన పెట్టుబడి చేతికందే పరిస్థితి కనిపించడం లేదు. గత ఏడాది మామిడికి గిట్టుబాటు ధరల్లేకపోవడంతో పంట నేలమట్టమైంది. రైతులు రోడ్డుపైకి రావడంతో ప్రభుత్వం కేజీకి రూ.2 రూపాయలు ఇస్తామని ప్రకటించింది. ఆ తర్వాత ఆ రూ.2 రూపాయలు కొంతమంది రైతులకు దక్కలేదు. ఇక వర్షాలు పడకపోవడంతో నియోజకవర్గంలో కొంతమేరకు ఎండిపోయింది. ప్రభుత్వం కరువు మండలంగా ప్రకటించి నష్టపోయిన రైతు వివరాలను సేకరించి చేతులు దులుపుకుంది. తీరా ఏడాది ఆపుతున్నా నష్టపరిహారం చెల్లించలేదు. దీంతో రైతులు ఏ పంటలు సాగు చేయాలన్న జంకుతున్నారు. ప్రభుత్వం ఆర్థిక సాయం ఆందించడంలో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. రుణమాఫీకి షరుతులు.. 2014 ఎన్నికల్లో ఇచ్చిన రుణమాఫీ హామీని నెరవేర్చడంలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారు. దీంతో రుణమాఫీకి షరతులు పెట్టడంతో చాలా మంది రైతన్నలు రుణమాఫీకి దూరమయ్యారు. ఐదు విడతల్లో మూడు విడతల వరకు మాఫీ పరిమితం కావడంతో రైతులు ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యతిరేకత చేస్తున్నారు. బ్యాంకుల నుంచి నోటీసులు రావడంతో భయాందోళనకు గురవుతున్నారు. 2019 ఎన్నికలు సమీపించడంతో చంద్రబాబు పాత పల్లవి ఆందుకున్నారని ఆరోపణలు వెల్లువేత్తున్నాయి. ఇక ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్తామని పలువురు రైతులు చెబుతున్నారు. సాగు విస్త్తరణ తగ్గుముఖం తెలుగుదేశం పాలనలో రైతాంగం పూర్తిగా డీలా పడింది. సాగు విస్తీర్ణం ఏటా తగ్గుతూ వస్తోంది. అప్పులు చేసి పంటలు పండించే స్థాయిలో రైతులు లేరు. – సురేష్‌రెడ్డి, చిలమనూరు రైతు ప్రభుత్వం మోసం చేసింది.. ప్రభుత్వం రుణమాఫీ విషయంలో మోసం చేసింది. ఇంత వరకు రూపాయి మాఫీ చేయలేదు. కొత్త రుణాలు కావాలంటే బ్యాంకర్లు ఇవ్వనంటున్నారు. ఇప్పుడు అన్నదాత సుభీభవ అంటూ నాటకాలు మొదలు పెట్టారు. – రామయ్య, బొల్లవారిపాళెం రైతు బుద్ధి చెబుతాం.. రైతులు బాబు గారిని నమ్మే పరిస్థితి లేదు. గతంలో చెప్పిన మాటలు నమ్మి పూర్తిగా మోసపోయాం. ఇప్పుడు పోస్ట్›డేటెడ్ చెక్కులు ఇస్తామని అంటున్నారు. అవి ఎవరికి కావాలండి ఇచ్చిన మాట ప్రకారం రైతులకు న్యాయం చేయాలి. లేకుంటే వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తాం. – కరణం శ్రీనివాసులు నాయుడు, బాలాయపల్లి రైతు -
బాబు మాట.. బంగారానికి టాటా!
రైతు రుణమాఫీ హామీ గుప్పించిన చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక మాటమార్చడంతో రైతులు మరింత రుణగ్రస్తులయ్యారు. ఇంట్లో బంగారాన్ని బ్యాంకుల్లో తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకున్న రైతులు ఎంతో నష్టపోయారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అని, భూమి రికార్డులు సరిగా లేవని, డబుల్ ఎంట్రీలని వంకలుపెట్టి రుణమాఫీలు సవ్యంగా చేయలేదు. దీంతో బ్యాంకుల్లో తీసుకున్న రుణాలకు వడ్డీలు పెరిగిపోయి రైతులకు మరింత భారమైంది. బంగారం ధరలు పతనమవ్వడం కొత్త ఇబ్బందులు తెచ్చిపెట్టింది. బంగారంపై తీసుకున్న రుణాలకు అసలు, వడ్డీలు పెరిగిపోయాయి. దీంతో బ్యాంకర్లు రుణ రికవరీ కోసం నోటీసులు జారీ చేస్తున్నారు. ఈనేపథ్యంలో ఈ నెల 9వ తేదీ నుంచి రుణమాఫీ విజయయాత్రకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తణుకు/ఏలూరు టూటౌన్ : పంట రుణాల కోసం బంగారం తాకట్టు పెట్టిన రైతులు తిరిగి రుణాలు చెల్లించవద్దు.. అధికారంలోకి రాగానే మన చంద్రన్న రుణాలన్నీ మాఫీ చేస్తారని ఎన్నికల సమయంలో ప్రచార సభల్లో, టీవీల్లో ఊదరగొట్టిన ప్రకటనలు ఇప్పటికీ గుర్తుండే ఉంటాయి. ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలని మోసపూరిత వాగ్దానాలు చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటింటికీ నాయకులు, కార్యకర్తలను పంపి బంగారు రుణాలు రద్దు కావాలంటే చంద్రబాబును ముఖ్యమంత్రిని చెయ్యాలంటూ ప్రచారం చేయించారు. చివరికి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రుణమాఫీపైనే మొదటి సంతకమూ చేశారు. దీంతో పుస్తెలతాళ్లు సైతం బ్యాంకుల్లో దాచుకున్న అక్కచెల్లెమ్మల్లో ఆనందం కనిపించింది. అయితే అమలులోకి వచ్చేసరికి సవాలక్ష నిబంధనలు విధించారు. రుణమాఫీ జరుగుతుందని రైతులు, వారి ఇళ్ళల్లోని మహిళలు ఎదురు చూస్తే నిరాశే మిగిలింది. కేవలం రూ. 1100 కోట్లు మాఫీ ఎన్నో ఆంక్షలతో బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న పంట రుణాలు పూర్తిస్థాయిలో రద్దు కాలేదు. సరికదా బ్యాంకర్ల వేలం ప్రకటనలతో కొందరు అప్పు చేసి మరీ విడిపించుకుంటున్నారు. మూడు విడతల్లో బంగారు రుణాల మాఫీ అంతంతమాత్రమే అయినా ఈ నెల 9 నుంచి రుణమాఫీ విజయయాత్రకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై రైతులు పెదవి విరుస్తున్నారు. జిల్లాలో 8 లక్షల మంది రైతులు ఉండగా వీరికి రూ. 7,200 కోట్లు మేర రుణాలు ఆయా బ్యాంకుల నుంచి అందాయి. వీటిలో బంగారంపై రుణాలు రూ.1300 కోట్లు ఇచ్చారు. బంగారం హామీగా పెట్టుకోవటంతో పాటు రైతుల నుంచి పట్టాదారు పాస్‌బుక్ జిరాక్సు కాపీ తీసుకుని బ్యాంకర్లు రుణాలు మంజూరు చేశారు. జిల్లాలో వివిధ బ్యాంకుల నుంచి 2లక్షల 75వేల మంది రైతులు బంగారంైపై వ్యవసాయ రుణాలు పొందారు. మూడు దశల్లో కేవలం రూ. 1100 కోట్లు మాత్రమే రుణమాఫీ అయినట్టు గణాంకాలు చెబుతున్నాయి. రుణాలు మాఫీ చేస్తామని చంద్రబాబు చెప్పడంతో విశ్వసించిన ప్రజలు సకాలంలో బ్యాంకులకు బకాయిలు చెల్లించలేదు. దీంతో వడ్డీ సైతం పెరిగి రైతులకు గుదిబండలా మారింది. ఇదిలా ఉంటే రూ. 50వేల లోపు బంగారం తాకట్టు పెట్టి రుణం తీసుకున్న రైతులకు మాఫీ జరిగిందని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. కాగా బ్యాంకు అధికారులు మాత్రం బంగారం నగలను వేలం వేస్తామని ప్రకటనలు ఇస్తుండటంతో బయట ఎక్కువ మొత్తంలో వడ్డీలకు తెచ్చి మరీ బంగారాన్ని విడిపించుకునేందుకు కొందరు రైతులు ప్రయత్నిస్తున్నారు. బ్యాంకు అధికారులు చెబుతున్న గణాంకాలు ప్రకారం జిల్లాలో కేవలం 10 నుంచి 20 శాతం రుణాలు కూడా మంజూరు కాకపోవడం విశేషం. కౌలు రైతుల ఆందోళన కౌలు రైతులకు కాకుండా అసలు యజమానికి రుణమాఫీ వర్తిస్తుందని బ్యాంకర్లు చెప్పటంతో వారు ఆందోళనకు గురయ్యారు. ప్రభుత్వ నిర్వాకం వల్ల జిల్లాలో రైతుల సుమారు రూ.150 కోట్ల వరకూ వడ్డీ రూపేణా బ్యాంకర్లకు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. బంగారు రుణాలు రైతులకు ఇచ్చే సమయంలో సంవత్సరం కాల పరిమితిలో చెల్లించకపోతే వడ్డీ రెట్టింపు అయ్యే అవకాశం ఉందని నిబంధన ఉంది. సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీని నమ్మి సకాలంలో రుణాలు చెల్లించక పోవటంతో రైతులు అదనపు వడ్డీ చెల్లించాల్సి వస్తోంది. అప్పుదారుల తిప్పలు నరసాపురం అర్బన్: నరసాపురం నియోజకవరంగలో దాదాపుగా రూ. 3.80 కోట్ల రుణాలు బంగారు ఆభరణాలపై రైతులు వివిధ బ్యాంకుల్లో తీసుకున్నారు. నరసాపురం మండలంలో రూ.68 లక్షలు, మొగల్తూరు మండలంలో రూ.28 లక్షల వరకూ మాత్రమే రుణమాఫీ జరిగింది. బ్యాంకుల నుంచి నోటీసులు బంగారం ధరలు తగ్గడంతో బ్యాంకర్లు రికవరీలపై దృష్టి పెట్టారు. బంగారం అప్పుదారులు ఎలాగైనా రుణాలు చెల్లించాలని, కనీసం అప్పుతీసుకున్న అసలు మొత్తంలో ఎంతో కొంత జమ చేయాలని నోటీసులు పంపిస్తున్నారు. దీంతో ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో రైతులు ఉన్నారు. బంగారంపై రుణాలు మాఫీ అవుతాయని ఇంకా ప్రభుత్వం నుంచి హామీలు లభిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మాటలు నమ్మాలో.. లేదో.. అర్థంకాని పరిస్థితి. అప్పోసప్పో చేసి బంగారం రుణాలు కట్టకపోతే బ్యాంకుల్లో ఉన్న మొత్తం నగలు జప్తు చేస్తారనే ఆందోళన కూడా రైతులను వెంటాడుతోంది. స్పష్టమైన హామీ ఇవ్వాలి బంగారం రుణాలు ఎంతవరకూ మాఫీ చేస్తారనే విషయంలో ఇంతవరకూ ప్రభుత్వం స్పష్టంగా చెప్పలేదు. ఇది దారుణం. పూర్తిగా రుణాలు మాఫీ చేయాలి. అప్పుదారులపై బ్యాంకర్లు వత్తిడి తేకుండా చూడాలి. ఇప్పటికిప్పుడు రుణాలు చెల్లించాలంటే, ఎలా కడతారు. - ఆరేటి మృత్యుంజయ, రైతుసంఘం నాయకుడు