
రుణమాఫీపై నోరు మెదపరేం
గణపవరం : ‘అధికారంలోకి రాగానే డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామన్నారు. బ్యాంకులకు ఒక్క పైసా కూడా కట్టొద్దన్నారు. తీరా అధికారంలోకి వచ్చాక దీనిపై నోరు మెదపడం లేదు’ అంటూ అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జిల్లా శాఖ అధ్యక్షురాలు ఎ.అజయకుమారి ధ్వజమెత్తారు. డ్వాక్రా రుణాలను తక్షణమే మాఫీ చేయూలంటూ గణపవరం తహసిల్దార్ కార్యాలయం ఎదుట మహిళలు బుధవారం ధర్నా నిర్వహిం చారు.
ఈ సందర్భంగా అజయకుమారి మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నాయకులు చెప్పిన మాటలు విని నాలుగు మాసాలుగా డ్వాక్రా రుణాలకు సంబంధించి వాయిదాలను మహిళలు ఎవరూ చెల్లించలేదన్నారు. దీంతో అప్పులు పేరుకుపోయూయని, ఆ మొత్తాలను వెంటనే కట్టాలంటూ బ్యాంకు అధికారులు వేధిస్తున్నారని ఆమె వాపోయూరు. దీనివల్ల మహిళలు కంటిమీద కునుకులేకుండా ఆందోళనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం డ్వాక్రా రుణాలను తక్షణమే మాఫీ చేయూలంటూ తహసిల్దార్ షేక్ ఇస్మాయిల్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా నాయకులు గారపాటి విమల, చెరుకువాడ గంగ, వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు మామిడిశెట్టి వెంకటేశ్వరరావు, కౌలు రైతుల సంఘం నాయకుడు కవల వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.