చిట్టచివరికి నిట్టూర్పేనా.. | Chandrababu Naidu Cheating On Farmers Loan Waiver | Sakshi
Sakshi News home page

చిట్టచివరికి నిట్టూర్పేనా..

Published Tue, Dec 2 2014 12:34 AM | Last Updated on Sat, Sep 2 2017 5:28 PM

చిట్టచివరికి నిట్టూర్పేనా..

చిట్టచివరికి నిట్టూర్పేనా..

     బ్యాంకులకు అందిన రుణమాఫీ అర్హుల జాబితాలు
     ఆధార్ సహా అనేక సాకులతో వేలాది పేర్లకు కత్తెర
     జిల్లాలో రెండు లక్షల మంది రైతులకు అడియాసే
     పునఃపరిశీలన అంటూ అధికారుల కంటితుడుపు

 
 వరుస నష్టాలతో చితికిపోయిన చిన్నరైతు రుణమాఫీ హామీపై పెద్ద ఆశే పెట్టుకున్నాడు. ఆ హామీ ఇచ్చిన చంద్రబాబే అధికారంలోకి రావడంతో భారం విరగడవుతుందని సంబరపడ్డాడు. అంతలోనే ఆ ఆనందం.. వేగిన పెనంపై రాలిన నీటిబొట్టులా.. పాలకుల వంచనకు ఇగిరిపోయింది. పగ్గాలు చేపట్టిన నాటి నుంచి వాగ్దానాల్ని ఎలా ఎగ్గొట్టాలా అన్నట్టు వ్యవహరిస్తున్న సర్కారు చివరికి.. అర్హులైన ఎందరో రైతుల ఆశలను మాఫీ చేసింది. వారిని లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించింది.
 
 సాక్షి, రాజమండ్రి : రుణాలు మాఫీ అవుతాయన్న ఆశతో ఎదురు చూసిన రైతుల్లో పలువురికి సర్కారు క్షోభనే మిగులుస్తోంది. మాఫీని నామమాత్రంగా అమలు చేసేందుకు అర్హుల జాబితాలో కోతలు విధిస్తోంది. బ్యాంకు అధికారులు ఇటీవల రుణమాఫీకి అర్హులైన రైతుల పేర్లతో జాబితాలను తయారు చేసి నివేదించగా వాటిలో 20 నుంచి 30 శాతానికి పైగా కోత పెడుతూ ప్రభుత్వం బ్యాంకులకు పంపింది. కాగా నిబంధనల్లో పేర్కొన్నవన్నీ సమర్పించినా జాబితాల నుంచి తమ పేర్లు తొలగిపోయాయని పలువరు రైతులు ఆవేదన చెందుతున్నారు. అధికారులు మాత్రం ఇవి తుది జాబితాలు కాదని, సవరించిన జాబితాలు డిసెంబర్ మొదటి వారంలో వస్తాయని చెబుతున్నారు. మరో వంక బ్యాంకులు బకాయిదారులబంగారాన్ని వేలం వేసేందుకు సిద్ధం అవుతున్నాయి. రుణమాఫీ ప్రక్రియ అమలు జరుగుతున్నా రైతులకు నోటీసులు ఇస్తూ మనోవేదనకు గురి చేస్తున్నాయి.
 
 జిల్లాలో అక్టోబర్ ఆఖరు వారంలో బ్యాం క ర్లు రుణాలు తీసుకున్న రైతుల జాబితాను రెవె న్యూ అధికారులకు సమర్పించారు. వాటిని వారు పరీక్షించి ప్రభుత్వానికి నివేదించారు. కానీ ప్రభుత్వం నుంచి వచ్చిన జాబితాల్లో పలువురి రైతుల పేర్లు గల్లంతయ్యాయి. జిల్లాలోని 58 మండలాల్లో సుమారు రెండు లక్షల మంది  పేర్లు బ్యాంకులకు వచ్చిన జాబితాల్లో కనిపించకపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. వారిని శాంతింప చేయడానికి బ్యాంకు అధికారులు సాకులు చెబుతున్నారు. ‘జాబితాలను గ్రామ రెవెన్యూ అధికారులు పునః పరిశీలిస్తున్నారు. ఇది తొలి జాబితా మాత్రమే. మరొక జాబితా వస్తుంది. పలువురు అర్హుల పేర్లు కంప్యూటరీకరించడానికి సాఫ్ట్‌వేర్ పని చేయడం లేదు’ అంటూ అటు బ్యాంకు అధికారులు, ఇటు రెవెన్యూ అధికారులు  నమ్మబలుకుతున్నారు.
 
 పొసగని సమాధానాలతో అయోమయం
 ‘సాక్షి’ యంత్రాంగం సోమవారం జిల్లాలో పలు చోట్ల పలు బ్యాంకుల పరిధిలో రుణమాఫీ జాబితాలపై పరిశీలన జరపగా పలు  ప్రాంతాల్లో  అర్హులైన రైతుల పేర్లు చోటు చేసుకోలేదు. దీనిపై ప్రశ్నిస్తే పలువురి పేర్లు ఆధార్ కార్డుల్లో తప్పులుగా ఉన్నాయని, వారికి రేషన్ కార్డులు  లేవని, ఒకే కుటుంబంలో ఇద్దరు లేక ముగ్గురి పేర్లు జాబితాలో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. వాటిని మళ్లీ పరిశీలిస్తున్నామంటున్నారు. మరి కొన్ని బ్యాంకుల్లో వచ్చినవి తొలి జాబితాలని, రూ.50 వేల లోపు రుణాలున్న వారివని అంటున్నారు. ఎవరికి వారు పొసగని సమాధానాలు ఇస్తుండడంతో రైతులు అయోమయానికి గురవుతున్నారు.
 
 ఎక్కడ చూసినా వేలాదిగా పేర్లు గల్లంతు
 జిల్లాలో సుమారు 27 జాతీయ బ్యాంకుల సుమారు 450 శాఖలు, సహకార సంఘాల వద్ద  రైతులు రుణాలు తీసుకున్నారు. రంపచోడవరం నియోజక వర్గంలో ఆంధ్రాబ్యాంకు, స్టేట్ బ్యాం కు, యూనియన్ బ్యాంకు, సహకార బ్యాంకుల ద్వారా 12,500 మంది రుణాలు పొందగా వాటిలో 800 మంది పేర్లు తాజాగా బ్యాంకులకు వచ్చిన అర్హుల జాబితాల్లో లేవు. తుని నియోజక వర్గ పరిధిలోని మూడు మండలాల్లో 20,269 మంది పేర్లు ప్రాథమిక జాబితాలో కనిపించగా మరో 14,735 మంది జాబితాను పునఃపరిశీలిస్తున్నామని అక్కడి అధికారులు చెబుతున్నారు. ప్రత్తిపాడులో 26,700 రైతులకు గాను 13,800 మంది పేర్లు మాత్రమే జాబితాలో కనిపిస్తున్నాయి.
 
 పిఠాపురం నియోజక వర్గం పరిధిలో 13,800 మంది పేర్లే బ్యాంకులకు వచ్చిన జాబితాలో ఉండగా10,300 మంది రైతులు తమ పేర్లు కనిపించక ఆవేదన చెందుతున్నారు. సామర్లకోట, పెద్దాపురం మండలాల పరిధిలో 35 వేల మందికి గాను 13 వేల మంది పేర్లు కనిపించడం లేదు. కాకినాడ రూరల్ ప్రాంతంలో 15,500కు పైగా రైతులు రుణ మాఫీ కోసం చూస్తుంటే వారిలో 3,400 మందికి ప్రస్తుతం నిరాశే మిగిలింది. అనపర్తి నియోజక వర్గంలోని మూడు మండలాల్లో పరిశీలన జరపగా 12,800 మంది రైతుల్లో మూడు వేల పేర్లు కనిపించడం లేదు. మండపేటలోని ఏడు బ్యాంకుల పరిధిలో 3678 మందికి 1800 మంది పేర్లు రుణ మాఫీ జాబితాలో లేవంటున్నారు. అమలాపురం నియోజక వర్గం ప రిధిలో 9800 మంది రైతుల్లో 3345 మంది పేర్లు లే వు. కొత్తపేట పరిధిలో బ్యాంకులు, సొసైటీల నుం చి 37,388 మంది రుణాలు పొంది మాఫీకి ఎదురు చూస్తుంటే 7149 మంది పేర్లు గల్లంతయ్యాయి. మిగిలిన చోట్లా వేలాది మంది   జాబితాల్లో పేర్లు గల్లంతయ్యాయని ఆందోళనకు గురవుతున్నారు..

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement